విశాఖ, విజయవాడ, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ల ఓటర్లు ఇచ్చిన తీర్పుతో ఇక అమరావతి అంశం మరుగున పడి విశాఖ రాజధానిగా మారే మార్గం సుగమం అయినట్టేనని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అమరావతి రాజధానిగా ఉండాలో వద్దో తేల్చుకోండని ..ఈ ఎన్నికలు రెఫరెండం అని పదేపదే చెప్పారు. ఇంకో అడుగు ముందుకేసి ‘మీకు సిగ్గు, రోషం లేదా. గుంటూరు కారం తిన్న పౌరుషం ఏమైంది. యువతలో చేవ చచ్చిపోయిందా’ అంటూ పరుష పదజాలం కూడా బాబు ఉపయోగించారు. అమరావతి కోసం రాజధాని ప్రాంతంలో ఆందోళనలు జరుగుతుంటే గుంటూరు ప్రజలు ఏం పట్టనట్టు ఉన్నారంటూ ఎన్నికల ప్రచారంలో బాబు అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు కార్పొరేషన్‌ను వైసీపీ గెలుచుకుంటే రాజధాని వికేంద్రీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని బాబు ఓటర్లను హెచ్చరించారు. అయినప్పటికీ బాబు మాటల ప్రభావం ఓటర్లపై పనిచేయలేదు.
గుంటూరు తో పాటు పక్కనున్న విజయవాడ ఓటర్లు .. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా జగన్ ఎంపిక చేసుకున్న విశాఖ ఓటర్లు వైసీపీ కే పట్టం కట్టారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద 71 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 69 చోట్ల వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. కేవలం తాడిపత్రి , మైదుకూరు మునిసిపాలిటీలలో టీడీపీ గెలిచింది. మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో కంటే కూడా ఈ మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ కి ఘోర పరాభవం మిగిలింది.మామూలుగా మునిసిపల్ ఎన్నికల్లో సీఎం, ప్రతిపక్షనేతలు ఎన్నికల ప్రచారం చేయరు. అదొక సంప్రదాయం. దాన్ని కూడా పక్కన బెట్టి బాబు ఈ మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయినా ఫలితాలు ఘోరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బీటలు బారాయి.
పార్టీ చరిత్రలో ఇది అత్యంత ఘోర ఓటమి. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎంతో కొంత మేర ఉనికిని చాటుకుంది. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించలేదు.ఈ ఎన్నికల ఫలితాల పైన చంద్ర బాబు చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయని …మనదే రాజ్యం. కాస్త ఓపిక పట్టండి. అంటూ కార్యకర్తలు,నేతలు పార్టీ మారకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఇపుడు ఈ ఎన్నికల్లో ఓటమి తో పాటు … జమిలి వచ్చే సూచనలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో ఫిరాయింపులు కూడా పెరగవచ్చు. ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీకి దూరంగా జరిగితే ..ప్రతిపక్ష హోదా మిగలకపోవచ్చు. బాబు అధికారం లో ఉండగా పవర్ ఎంజాయి చేసిన చాలామంది నేతలు సీరియస్ గా ఈ ఎన్నికల్లో పనిచేయ లేదు. ఏదైనా పార్టీ పనితీరును సమీక్షించుకుని ఇక ముందు జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉంది. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఇక వైజాగ్ లో ఆఫీస్ ఏర్పాటుచేసుకుని విశాఖనుంచి పాలన మొదలు బెట్టే సూచనలున్నాయి.
—————K.N.MURTHY