అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ ఇండియాపై గురి పెట్టినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశంలో అల్లర్లు రేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దావూద్ కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం దావూద్ ప్రత్యేకం గా ఒక దళాన్ని రిక్రూట్ చేసుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు. దావూద్ ఇబ్రహీంపై ఇటీవల ఎన్‌ఐఏ ఒక అభియోగ పత్రం దాఖలు చేసింది. అందులో ఈ అంశాలను ప్రస్తావించింది. దావూద్ హిట్ లిస్ట్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయని అంటున్నారు.
ఈక్రమం లోనే ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దావూద్‌పై,ఆయన అనుచరులు,బంధువుల పై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసింది. దావూద్ సోదరి హసీనా పార్కర్ .. సోదరుడు ఇక్బాల్ కస్కర్‌పై కూడా మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆమధ్య కాలంలో కొంతమందిపై కేసులు బుక్ చేసి జైళ్లకు పంపారు.
దావూద్ ఇబ్రహీం పాక్ లో మకాం పెట్టి ఇండియాలో మాఫియా కార్యకలాపాలను చాపకింద నీరుగా సాగిస్తునే ఉన్నాడు. కొంతమంది రహస్య అనుచరులతో నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు. ఇంత కాలంగా ఎంతో గోప్యంగా ఉన్న దావూద్ కదలికలు బయటకు వస్తున్నాయి. ఇది దావూద్ ఫెయిల్యూరా లేక భారత గూడాచారుల చాకచక్యమా అన్న విషయంపై భిన్నవాదనలు ప్రచారంలో ఉన్నాయి.
పాకిస్థాన్ కరాచీలో దావూద్ ఉంటున్న ఇంటి అడ్రస్ కూడా ఆమధ్య బయటకు వచ్చింది. అలాగే ఆ అడ్రస్ తో ఉన్న టెలిఫోన్ కనెక్షన్‌లే కాక అందులోని కాల్ డేటాను కూడా మన గూఢచారులు బయటకు లాగారు. దావూద్ భార్య మహే జాబీన్ పేరున నాలుగు ఫోన్ కనెక్షన్‌లు ఉన్నాయి. అందులో నుంచి అంతర్జాతీయంగా పది నంబర్లకు తరచుగా కాల్స్ చేస్తున్నారు.
అందులో 5 నంబర్లు భారత్‌లో ఉన్నాయి. ఆ నంబర్లన్నీ కూడా దావూద్ ప్రధాన అనుచరులవే. అందులో చోటా షకీల్‌కు చెందిన నంబరు కూడా ఉందని కూపీ లాగారు. ఆమధ్య పాకిస్థానీ హీరోయిన్ మెహవీష్ హయత్ తో దావూద్ ప్రేమాయాణం సాగిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తన వ్యవహారాలన్నీ భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుస్తున్నాయని పసిగట్టిన దావూద్ జాగ్రత్తలు తీసుకున్నాడు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడైన దావూద్ ఇబ్రహీమ్ కోసం పలు దేశాలు చాలాకాలంగా వెతుకు తున్నాయి. ఎన్నో అక్రమాలకు.. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన దావూద్ 1993 ముంబై పేలుళ్లలో కీలకంగా వ్యవహరించాడు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. హిందీ సినిమా ఇండస్ట్రీని కూడా ఒకప్పుడు కనుసైగలతో శాసించిన దావూద్ కి పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీతో కూడా దగ్గరి సంబంధాలు ఉన్నాయి.