స్టాలిన్ రూటే వేరప్పా !

Sharing is Caring...

Stalin away from the politics of revenge …………………..

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ భిన్నమైన శైలి లో పనిచేస్తున్నారు. మొన్నొక రోజు రాత్రి 10. 30 గంటల సమయంలో అకస్మాత్తుగా కోవిడ్ కమాండ్ సెంటర్ ను దర్శించారు. కోవిడ్ కట్టడిలో భాగంగా ఈ కమాండ్ రూమ్ ను ఈ నెల మొదట్లోనే ప్రారంభించారు.

కోవిడ్ బాధితులు కానీ వారి బంధువులు కానీ  ఈ సెంటర్ కు కేటాయించిన 104 ఫోన్ నంబర్ కి కాల్ చేసి నేరుగా సిబ్బంది తో మాట్లాడవచ్చు. ఆసుపత్రుల్లో పడకలు , ఆక్సిజన్ సరఫరా, తదితర సమస్యలపై  మాట్లాడవచ్చు.

ఈ సెంటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి సీఎం స్టాలిన్ సడన్ గా రావడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. అదే సమయంలో అర్చన పద్మాకర్ అనే మహిళ ఈ కేంద్రానికి ఫోన్ చేసింది. సిబ్బంది ని ఆ ఫోన్ ఇవ్వమనగా వారు స్టాలిన్ కి ఫోన్ ఇచ్చారు. ఆయన స్వయంగా ఆ మహిళ తో మాట్లాడారు. ఆమె తన 78 ఏళ్ల అత్త గారి కోసం హాస్పిటల్ బెడ్ కావాలని కోరింది.

సీఎం స్టాలిన్ తనతో మాట్లాడుతున్నారని టెన్షన్ లో ఉన్న అర్చన గుర్తించలేదు. ఆమె అత్తగారికి చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బెడ్ కేటాయించినట్టుగా  చెబుతూ … ఆమె అత్తగారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. సిబ్బంది ఆ వెంటనే అర్చన అత్తగారి విషయం రాజీవ్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కి తెలియజేశారు. 

స్టాలిన్ అలా కమాండ్ సెంటర్ ను దర్శించి అర్చనతో మాట్లాడటం సోషల్ మీడియా లో వైరల్ అయింది. తర్వాత అర్చన కూడా మీడియాతో మాట్లాడుతూ తాను టెన్షన్ లో సీఎం ను గుర్తించలేకపోయానని .. వెంటనే స్పందించి బెడ్ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియ జేశారు. సీఎం పదవి చేపట్టిన కొద్దీ గంటల్లోనే స్టాలిన్ లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు.

అంతటితో ఆగకుండా ఒక సలహా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ లో అసెంబ్లీ లో ప్రాతినిధ్యం ఉన్న ప్రతి పార్టీ సభ్యుడికి చోటు కల్పించారు. కమిటీ లోకి అన్నాడీఎంకే కి చెందిన మాజీ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ ని తీసుకున్నారు. ఈ కమిటీ సలహాలను .. సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది. కమిటీ కి సీఎం స్టాలిన్ అధ్యక్షులుగా ఉంటారు.

ఇలా అందరి అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా అందరిని కలుపుకుని పరిపాలన సాగించాలని స్టాలిన్ ఆకాంక్షిస్తున్నారు.అమ్మ క్యాంటీన్ల కొనసాగింపు కూడా మంచి నిర్ణయమే. అది అన్నా డీఎంకే అధినేత జయ లలిత ప్రారంభించిన పధకం అయినప్పటికీ కొనసాగించాలని నిర్ణయించడం పై స్టాలిన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు.

స్టాలిన్ వ్యవహార శైలిని బట్టి  ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలవగానే విపక్ష నేత పళని స్వామి ఇంటికి వెళ్లి కలవడం కూడా ఇందులో భాగమే అంటున్నారు విశ్లేషకులు. ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన స్టాలిన్ కి ఇప్పటికి సీఎం అయ్యే ఛాన్స్ లభించింది.

దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు  తెలుస్తోంది. కరుణానిధి వ్యవహార శైలికి  స్టాలిన్ స్టయిల్ కి చాలా తేడా ఉంది. తండ్రి కరుణానిధి బద్ధ శత్రువుగా భావించే జయలలితకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా స్టాలిన్ ఆమెను పరామర్శించడానికి వెళ్లారు.

————KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!