ఈ సినిమాకు తొలుత అనుకున్న హీరో ‘చిరు’ నా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala…………………..

‘సాగ‌ర‌సంగ‌మం’ సినిమాలో ముందు అనుకున్న హీరో హీరోయిన్లు చిరంజీవి, జ‌య‌సుధ.  అయితే …చిరంజీవి క‌న్నా క‌మ‌ల్ హ‌స‌న్ అయితే బాగుంటుంద‌ని ద‌రిమిలా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో నిర్మాత ద‌ర్శ‌కులు అనుకోవ‌డంతో సీన్ మారింది.

హీరోను మార్చ‌డంలో నిర్మాత గారి చొర‌వ కూడా ఉందిగానీ,హీరోయిన్ ను మార్చ‌డం మాత్రం కేవ‌లం విశ్వ‌నాథ్ గారి అభిప్రాయం మేర‌కే జ‌రిగింది.అలా చిరంజీవి స్థానంలో … క‌మ‌ల్ జ‌య‌సుధ ప్లేసులో జ‌య‌ప్ర‌ద‌లు చేరారు.

శంక‌రాభ‌ర‌ణం విజ‌య‌యాత్ర సంద‌ర్భంగా  చిన్న పొరపాటు వలన మ్యూజిక్ డైరెక్టర్ గా ‘మామ మ‌హ‌దేవ‌న్’ ప్లేసులో ‘ఇళ‌య‌రాజా’ వ‌చ్చారు. అది ఏమిటంటే ‘శంక‌రాభ‌ర‌ణం’ విజ‌య‌యాత్ర సంద‌ర్భంలో …. మ‌హ‌దేవ‌న్ కు ఫ‌స్ట్ క్లాసు టిక్కెట్టూ …. పుహ‌ళేందికి సెకండు క్లాసు టిక్కెట్టూ తీసుకున్నార‌ట‌. దీంతో మ‌హ‌దేవ‌న్ హ‌ర్ట్ అయ్యార‌ట‌.

అయ్యా ఏమిటిలా చేశార‌ని అడిగితే … అసిస్టెంట్ల‌కు సెకండు క్లాసులోనే వేయ‌డం ఆన‌వాయితీ అన్నారట‌. పుహ‌ళేందిని అసిస్టెంట్ అని చెప్పిందెవ‌ర‌ని మామ నిల‌దీశాడ‌ట‌. అలా ఆయ‌న ఆ నిర్మాత‌కు పని చేయ‌కూడ‌దని నిర్ణ‌యించుకోవ‌డంతో సాగర సంగ‌మానికి ‘ఇళయ రాజా’ వ‌చ్చాడు…

అయితే విశ్వ‌నాథ్ కి చిరంజీవి మీదున్న న‌మ్మ‌కానికి కార‌ణం ‘శుభ‌లేఖే’. ఆల్విన్ యాడ్ గా చిత్రీక‌రించిన డాన్స్ బిట్ లో న‌ర్తించేందుకు చిరంజీవి చాలా బాధ్య‌త‌గా క‌ష్ట‌ప‌డ్డాడు. డాన్స్ మాస్ట‌ర్ శేషు సూచ‌న‌ల మేర‌క‌కు మూమెంట్స్ రిహార్స‌ల్ చేసి ఫైన‌ల్ అవుట్ పుట్ బాగా రావ‌డానికి చిరంజీవి ప‌డ్డ త‌ప‌న విశ్వ‌నాథ్ కి న‌చ్చి … సాగ‌ర‌సంగ‌మం లో కూడా అనుకున్నారు. ఆ బిట్ భ‌లే ఉంటుంది కూడాను. అయితే అనుకోకుండా నిర్ణయం మారింది.  
——
Tharjani  ……………..

సాగరసంగమం  3 జూన్ 1983న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.ఇళయరాజా స్వరకల్పన చేసిన  ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రాశారు.

“ఓం నమశ్శివాయ” “తకిట తధిమి తకిట తధిమి తందాన” “నాద వినోదము నాట్యవిలాసము” “మౌనమేలనోయి ఈ మరపురాని రేయి” “వేదం అణువణువున నాదం” “వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే”  పాటలు అద్భుతంగా ఉంటాయి. వాటిని విశ్వనాధ్ హృద్యంగా తెరకెక్కించారు.

కమల్ హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రలో జీవించారు. ఈ పాత్రకు ‘కమల్ హాసన్’ ని సంప్రదించగా ముందు నిరాకరించారు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తరువాత కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయని కమల్ భయపడ్డాడు. అయితే విశ్వనాధ్ కథ చెప్పి ఆయనను ఒప్పించారు. జయప్రదది కూడా మంచి పాత్ర.. బాగా చేసింది.  ఇందులో గాయని ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇతర నటులు కూడా పాత్రలకు న్యాయం చేశారు.
 
తమిళంలో ‘సలంగై ఒలి’ పేరిట , మలయాళంలో ‘సాగర సంగమం’ పేరుతో విడుదలైంది. రష్యన్ భాషలోకి కూడా డబ్ చేశారు. సాగర సంగమం రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలను గెలుచుకుంది. మద్యం మత్తులో ఓ బావి మీద ఉన్న పైపుపై కమల్ హాసన్  చేసే నాట్యం సినిమాలో హైలెట్ గా నిలిచింది.

“నాదవినోదము” పాటను ఊటీలో తీశారు. వి. శాంతారాం తీసిన  ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్ సినిమాలకు నృత్యాలు సమకూర్చిన గోపికృష్ణ ఈ పాటకు నృత్య రీతులు అందించారు. కమల్ కూడా డాన్సర్ కనుక అద్భుతంగా పాటల్లో నటించాడు.

క్లైమాక్స్ లో  “వేదం అణువణువున నాదం” పాట చిత్రీకరణకు ముందు వేరే సినిమా షూటింగ్ లో కాలికి గాయమైంది. సరిగ్గా అడుగులు వేయలేని పరిస్థితిలో  కూడా  కమల్  నృత్యం చేసి సినిమా పట్ల  తన కమిట్మెంట్ ను నిరూపించుకున్నారు.  41 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది .. చూడని వారు చూడొచ్చు .. చూసిన వారు కూడా మరొక మారు చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!