కోర్టుకు వెళ్లే యోచనలో బాబు ?

Sharing is Caring...

ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో అందుకున్న నోటీసులపై మాజీ సీఎం చంద్రబాబు న్యాయ నిపుణులతో చర్చించారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించిన వైనం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘ చర్చల దరిమిలా వారు మూడు ఆప్షన్లను  చంద్రబాబుకి సూచించినట్టు తెలుస్తోంది. మొదటి ఆప్షన్ సీఐడీ నోటీసులపై హైకోర్టు కు వెళ్లడం .. క్వాష్ పిటీషన్ దాఖలు చేయడం.  రెండో ఆప్షన్ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకోవడం. మూడో ఆప్షన్ విచారణకు హాజరై దర్యాప్తు సంస్థలకు సహకరించడం.రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగినపుడు విచారణకు హాజరుకావడం తప్పేమి కాదని న్యాయనిపుణులు సూచించినట్టు సమాచారం.

ఈ మూడింటిలో బాబు కోర్టుకి వెళ్లడమే మంచి మార్గమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే న్యాయనిపుణులతో  కోర్టు నుంచి స్టే తెచ్చుకునే అవకాశాలపై కూడా చర్చించారు.దీంతో పాటు గతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి  కూడా న్యాయనిపుణులతో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. బుధవారం ఉదయం బాబు తుది నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు.

రాజధాని ప్రకటన చేయకముందే చంద్రబాబు తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేయించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఆరోపణలతో కేసు నమోదు అయింది. సుమారు 450 ఎకరాల భూమి బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో 1977 అసైన్డ్ భూముల చట్టం ఉల్లంఘన జరిగిందని .. 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని  క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.  అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడంతో పాటు వాటికి సాధారణ భూములకు ఇచ్చే పరిహారాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంలో అప్పటి సీఎం చంద్రబాబు కేబినెట్ అనుమతి లేకుండానే జీవో జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పేదల దగ్గర అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ లో అత్యధిక ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. ఇలా ప్రయోజనం పొందినవారు నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులని అంటున్నారు.చాలామంది భావిస్తున్నట్టు ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు కాదు. అసైన్డ్ భూముల దుర్వినియోగం అని అభియోగం. మొత్తం మీద బాబుకి నోటీసులు జారీ కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ కేసు ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. అటు టీడీపీ ఇటు వైసీపీ రాజకీయ విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే చర్చలు జరుగుతున్నాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!