Ramana Kontikarla …………………………..
కవి గుర్రం జాషువా అన్నట్టు రుద్రభూమికి చెడ్డవాడు, మంచివాడనే తేడా ఉండదు..హతుడూ, హంతకుడు ఇద్దరూ ఒకటే. కవైనా, రాజైనా, చిత్రకారుడైనా… ఎవ్వరైతేనేమి ఆయువు తీరాక ఏ హోదాలో ఉన్నవాడైనా ఈ మరుభూమి కొచ్చి విశ్రమించక తప్పదు. బతికున్నంత కాలం ఎక్కడ ఉన్నా .. మరెక్కడా తిరిగినా అంతిమంగా చేరాల్సింది శ్మశానికే. అక్కడ పనిచేసే కాటికాపరి కూడా శ్రద్దగా పనిచేస్తుంటాడు.కాయానికి కపాల మోక్షం కల్పిస్తుంటాడు.
జీవితం అనూహ్యమైన మలుపులు ఎన్ని తిరుగుతుందో చెప్పడానికి ముసల్మాన్ టోపీ పెట్టుకున్నఈ కాటికాపరి ఓ సజీవ ఉదాహరణ. పుట్టుక, చావు మధ్య మనిషి సృష్టించుకున్నకుల,మతాల భావనే మనుష్యులను దూరంగా పెడుతుందని.. ఆ భావన ను మనసులో నుంచి తీసేయాలని నమ్మినవాడు..
మనిషి కట్టె గా మారిన క్షణం నుంచి మనం అంతకు ముందు చేసిన మంచి ఒకటే జనాలకు కనబడుతుందని తెలిసిన అనుభవశాలి. నమ్మిన అంశాలను జీవితంలో అమలు చేసిన మంచి మనిషీ. 27 ఏళ్ల తన కాటికాపరి జీవితంలో కుల, మతాలకతీతంగా… ఎన్నో అనాథ శవాలకు అన్నీ తానై అంత్యక్రియలు పద్మశ్రీ మహ్మద్ షరీఫ్ అకా.. అలియాస్ షరీఫ్ చాచా.
షరీఫ్ చాచాది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య. ఫైజాబాద్ లో సైకిల్ పంక్చర్లు వేస్తూ జీవించేవాడు. అలాంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డ్ కు ఎంపిక కావడమే గొప్పవిషయం. సైకిల్ పంక్చర్లేంటి… పద్మశ్రీ ఏంటీ…? అనుకుంటున్నారా ? అతనిలో ఓ గొప్ప మానవతావాది ఉన్నాడు. మొన్న మొన్నటి దాకా ఎవరికి తెలియని విషయమది.
స్వయానా తన సొంత కొడుకే దుర్మరణం పాలయ్యాడు. శరీరాన్ని జంతువులన్నీ పీక్కుతిన్న దుస్థితిలో రైల్వే ట్రాక్ పై కనిపించింది. అదిగో అక్కడ మొదలయింది చాచా కాటికాపరి ప్రస్థానం. తన కొడుకులా ఇంకెవ్వరూ చావొద్దన్న తపనలోంచి మొదలైంది… ఈ హరిశ్చంద్రుడి నిరీక్షణ.
అలా గత 27 ఏళ్లల్లో 25 వేల మృతదేహాలకు షరీఫ్ చాచా అంత్యక్రియలు నిర్వహించారు. చనిపోయినవారి కులమేంటో, మతమేంటో జాన్తానై అన్నాడు. ముందు మనం మనుషులమంటాడు. రోడ్లపై అనాథల్లా యాక్సిడెంట్లలో మృతి చెందినవారెందరికో తానే అన్నీ అయి అంత్యక్రియలు చేసేవాడు.ఆ మృతదేహాలను తన సైకిళ్లపై, లేదా వాటికోసం ఏర్పాటు చేసుకున్న ఓ రిక్షాలాంటి వాహనంపై తీసుకెళ్లి మరీ అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. అలా తీసుకెళ్లే క్రమంలో ఈ సభ్య సమాజం చాచాను చూసి పిచ్చివాడు అని కూడా ఎన్నోసార్లనుకుందట.
షరీఫ్ చాచాకు తెలియకుండానే ఆయన చేస్తున్న అంతిమ సేవలు అందరికి తెలిసి పోయాయి. అందుకే షరీఫ్ చాచా తీసుకొచ్చే మృత దేహాలే కాకుండా… 72 గంటల్లో మృతులెవరో తెలియని శవాలను కూడా రైల్వే అధికారులు .. ఊరిశివార్లలో దొరికిన డెత్ కేస్ బాడీలను చాచాకు అప్పగించే వారట అలా తన దృష్టికి వచ్చిన అన్ని భౌతిక కాయాలకు అంతిమ సంస్కారాలు చేసి సాగనంపిన సంస్కారవంతుడు మహ్మద్ షరీఫ్ చాచా.
షరీఫ్ చాచా వద్దకు ఓరోజు ఓ పోలీసాయన వచ్చి… తన వెంట రమ్మన్నాడట. ఎందుకు నేనేం నేరం చేశానంటే చెప్పా పెట్టకుండానే బలవంతంగా తీసుకెళ్లాడట. వెళ్లిందేమో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి. వెళ్లగానే ఏమవుతుందో, ఏమోనన్న టెన్షన్ లో ఉండగా చాచాకు కలెక్టర్ వచ్చి పుష్పగుచ్ఛమందించి అభినందించారట. మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించిందని చెప్పారు. ఎప్పుడూ శ్మశాన వైరాగ్యంలోనే గడిపిన ఆ బతుక్కి…ఆ అభినందన చల్లని గాలిలా సోకి మనసుకు ఊరట కల్గిందంటాడు చాచా.
కానీ చాచా గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు. లోకల్ బీజేపి ఎంపీ లల్లూసింగ్ సిఫారసుతో షరీఫ్ చాచాకు పద్మశ్రీ వచ్చింది. ఇప్పుడు పద్మశ్రీ వచ్చిందన్న సంతోషం కన్నా… పూట గడవని స్థితిలో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతోంది. చాలామంది, చాలా సంస్థలు ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.పద్మశ్రీ బదులు తమకు ఇంత పెన్షనిచ్చినా బాగుండుననే బాధ ఆయన కొడుకు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చాచా మొన్న నవంబర్ 8వ తేదీన రాష్ట్రపతి రామ్ నాాథ్ కోవిద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్నందుకుని… ఒక మానవతావాదిగా అందరి మన్ననలూ చూరగొన్నాడు.