విపక్షాలు ‘యోగి’ ని ఢీ కొనగలవా ?

Sharing is Caring...

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన స్థానం గోరఖ్‌పూర్ అర్బన్. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో  యోగి ఆదిత్యనాథ్  పోటీ చేయడం ఇదే మొదటిసారి. సీఎంగా ఎంపిక అయ్యాక ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.

గోరఖ్‌పూర్ అర్బన్ బీజేపీ కి మంచి పట్టున్న స్థానం. ఇపుడు ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతోంది.
యోగి ఆదిత్యనాథ్‌తో అంతర్గతంగా విభేదించిన బీజేపీ మాజీ నాయకుడు, దివంగత ఉపేంద్ర దత్ శుక్లా భార్య శుభావతి శుక్లాను సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడ  బరిలోకి దించింది. ఉపేంద్ర దత్ శుక్లా 2020లో మరణించారు.

గోరఖ్‌పూర్ రాజకీయాల్లో బీజేపీని జనంలోకి తీసుకెళ్లి.. బలోపేతం చేయడంలో  ఉపేంద్ర దత్ శుక్లా కీలక పాత్ర పోషించారు. శుభావతి రాజకీయాలకు పూర్తిగా కొత్త. గోరఖ్ పూర్ ప్రాంతంలో బలమైన శక్తిగా ఎదిగిన యోగి ని ఆమె ఎంతమేరకు ఎదుర్కోగలదో సందేహమే.

బీజేపీ ఏకీకృత ఓటు బ్యాంకును చీల్చేందుకు అఖిలేష్ ఠాకూర్-బ్రాహ్మణుల ఓట్ల విభజనపై కన్నేసినట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన  శుక్లా గోరఖ్‌పూర్‌లో అందరికి పరిచితులే. ఆయనకు మంచిపేరుంది.

కాగా గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా చేతనా పాండే పోటీ చేస్తున్నారు. ఈమె కూడా బ్రాహ్మణ మహిళ. రాజకీయంగా అనుభవం లేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాజన్వా నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి  2200  ఓట్లు సంపాదించింది.

బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) యోగి ఆదిత్యనాథ్‌పై తొలిసారిగా ఖ్వాజా షంషుద్దీన్ ను బరిలోకి దింపింది. షంషుద్దీన్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గోరఖ్‌పూర్ జిల్లాలో పార్టీ కోసం 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అటు ముస్లిం ఓట్లు .. ఇటు దళిత్  ఓట్లు కొన్ని పడవచ్చు.

మరో అభ్యర్థి ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్ర శేఖర్ ఆజాద్ రంగంలో ఉన్నారు.ఈ యన కూడా దళిత ఓట్లను చీలుస్తారు.  గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం మినీ కాస్మోపాలిటన్‌ సిటీ. నియోజకవర్గంలో దాదాపు 4.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

వీరిలో దాదాపు 60,000-70,000 మంది బ్రాహ్మణ ఓటర్లు, 55,000-60,000 మంది కాయస్థులు, 50,000 మంది  వైశ్య ఓటర్లు ఉన్నారని అంచనా. అలాగే  50,000 మంది దళిత ఓట్లు …  75,000 మంది వెనుకబడిన కులాలైన నిషాద్‌లు, యాదవులు, నోనియాలు, సాంథ్వార్‌లు ఇతరులు ఉన్నారు.

దాదాపు 40,000 మంది ముస్లిం ఓటర్లు, 25,000-30,000 మంది రాజ్‌పుత్‌లు ఉన్నారు. ఇతర ఓటర్లలో బెంగాలీలు, సిక్కు-పంజాబీలు, సింధీలు,క్రైస్తవులు ఉన్నారు. 1989 నుండి గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో BJP ఆధిపత్యం చెలాయిస్తోంది. 2002లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాధా మోహన్ దాస్ అగర్వాల్‌కు అప్పటి లోక్‌సభ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ మద్దతు ఇచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే సీటును కోల్పోయింది.

ఆ తర్వాత అగర్వాల్ బీజేపీలో చేరారు. 2002 నుంచి గోరఖ్‌పూర్ అర్బన్ ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు.ఆయనను తప్పించి బరిలోకి యోగి ని దించారు. కాగా  ఎస్పీ రాధా మోహన్ దాస్ కి టికెట్ ఆఫర్ చేసింది కానీ అతగాడు ధైర్యం చేయలేకపోయారని అంటారు.

గోరఖ్‌నాథ్ మఠానికి ఈ ప్రాంతంలో ‘మహంత్ జీ’గా పరిచితులైన యోగి ఆదిత్యనాథ్ 1998 నుంచి గోరఖ్‌పూర్ ఎంపీ గా  ఐదుసార్లు పనిచేశారు. 2002లో ఆయన స్థాపించిన హిందూ యువ వాహిని కూడా చురుగ్గా పనిచేస్తున్నది. మొత్తం మీద పరిశీలించి చూస్తే ప్రత్యర్ధులు యోగికి గట్టి పోటీ ఇవ్వగలరా ?లేదా అనేది సందేహమే.ఇక ఓటర్ల మొగ్గు ఎటు అన్నది కొద్దీ రోజులు పోతే కానీ తేలదు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!