శ్రీరాముడి పాత్రలో ఎన్టీ రామారావు,శోభన్ బాబు, హరనాథ్,బాలకృష్ణ,సుమన్ మరికొందరు నటులు నటించి మెప్పించారు. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ ఆ పాత్రను ఆదిపురుష్ చిత్రం లో చేస్తున్నారు. సాత్వికుడైన రాముడి పాత్రలో రెబెల్ స్టార్ ఎలా ఉంటారో ? ఎలా నటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ కి పౌరాణిక పాత్రలు పోషించిన అనుభవంలేదు.మొదటిసారిగా ప్రభాస్ ఈ పాత్ర పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆపాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో తెలిపే కొన్ని చిత్రాలు కూడా ప్రచారంలో కొచ్చాయి.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ప్రస్తుతం “ఆదిపురుష్” పోస్ట్ ప్రొడక్షన్ .. గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రామాయణాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించడానికి దర్శకుడు ఓం రౌత్ కృషి చేస్తున్నారు. ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో రూ. 100 కోట్లు కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కే కేటాయించారని చెబుతున్నారు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమానే అనుకున్నారు.
అయితే ఇంగ్లీష్ భాషలోకి కూడా డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదల చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ చిత్రం కోవిడ్ పరిస్థితుల్లో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ మొత్తం మీద షూటింగ్ పూర్తి చేసుకున్నది. కేవలం 103 రోజుల్లో షూటింగును పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
రామాయణం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఏయే ఘట్టాలను హైలైట్ చేస్తున్నారో .. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు సినిమాగా రూపొందుతున్నదో ఎవరికి తెలీదు. లోకమాన్య ఏక్ యుగ్ పురుష్,హాంటెడ్ 3 డి వంటి సినిమాలు తీసిన ఓం రౌత్ ఈ సినిమా పై పూర్తి శ్రద్ధ పెట్టారు.
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. కృతి సనన్సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను, దేవదుత్తా హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు.
రావణుడిలోని ‘మానవీయ’ కోణాన్ని ఈ సినిమా చూపిస్తుందని సైఫ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసాడు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి ఈ క్రమంలోనే హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే మటుకు తమ పార్టీ సహించదని బీజేపీ నేత రామ్ కదమ్ అదే సమయంలో అన్నారు.
ఆ తర్వాత హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సైఫ్ వ్యాఖ్యలపట్ల విమర్శలు కూడా వచ్చాయి వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాడు. ఎటువంటి వక్రీకరణలు లేకుండా సినిమా తీస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటివరకు చాలామంది దర్శకులు రామాయణం సినిమా తీశారు. ఈ దర్శకుడు ఎలా తీస్తాడో చూడాలి.