ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రాబోతోంది. దర్శకుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకరత్న టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక ప్రముఖనటుడు దాసరి పాత్రలో నటించవచ్చని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది.
ఇక ధవళ సత్యం సినిమా దర్శకుడిగా కాకముందు ప్రజానాట్యమండలి లో పనిచేసారు. జ్వాలాశిఖలు, యుగసంధి, సత్యంవధ, ఇరుసు మొదలైన నాటకాలు ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు.మాదాల రంగారావు నిర్మించిన యువతరం కదిలింది .. ఎర్రమల్లెలు,జాతర, చైతన్య రధం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. దాసరి నారాయణ రావు వద్ద చాలా సినిమాలకు సహాయ దర్శకుడిగా చేశారు.
దర్శకరత్న దాసరి 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. సినిమా చరిత్రలో డైరెక్టర్ కి ఒక గౌరవం, ఒక స్థాయి తీసుకొచ్చిన దాసరి స్టార్ డైరెక్టర్ గా వెలుగొందారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ,శోభన్, చిరంజీవి వంటి అగ్రనటులతో పనిచేశారు. తాతా మనవడు, స్వర్గం నరకం, దేవుడే దిగివస్తే , మేఘసందేశం,శివరంజని, తూర్పు పడమర, మామగారు వంటి సినిమాలు దాసరికి మంచి పేరు తెచ్చాయి. ఇక అవార్డులు రివార్డులు గురించి చెప్పనక్కర్లేదు. దాసరి తీసిన బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు చిత్రాల నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ కి పాలిటిక్స్ పట్ల ఆసక్తి పుట్టింది.
మామగారు, సూరిగాడు , ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి విమర్శకుల ప్రశంసలు , బహుమతులు అందుకున్నారు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆయన జీవితం లో చాలా కీలక ఘట్టాలున్నాయి. సరిగా తీస్తే మంచి బయో పిక్ అవుతుంది.