ప్రకృతి ప్రేమికులకు భూతల స్వర్గం !

Sharing is Caring...

Heaven on earth……………

అరకు… తూర్పు కనుమలో అదొక భూతల స్వర్గం… శీతాకాలం వచ్చిందంటే అరకు అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య జాలు వారే జలపాతాల ధ్వనులతో ..పక్షుల కిలకిలారావాలతో మనసు ఉత్తేజానికి లోనవుతుంది.  ప్రకృతికి రమణీయత కు నిలయమైన అందాల ఆంధ్ర ఊటీ అరకు సోయగాలు కనీసం ఒకసారైనా చూసి తరించాల్సిందే.

శీతకాలం అరకుకు కొత్త సోయగాలు ..సొబగులతో కళకళలాడుతుంది .సిటీ లైఫ్ తో ..కాలుష్యపు విషగాలులు పీలుస్తూ బతికే వారు ఈ సీజన్ లో అరకు వెళితే అక్కడి అందాలకు అబ్బుర పడతారు. చల్లని మేఘాలు పక్కగా వెళుతూ పలకరిస్తుంటే మైమరచి పోతాం. పుడమి తల్లి పచ్చని పూలను సిగలో పెట్టుకుని పలకరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ ప్రాంతం లో  ప్రకృతి దృశ్యాలు పర్యాటకుల మనసును పరవశింప చేస్తాయి.

మంచు తెరలను చీల్చుకుంటు చేసే అరకు ప్రయాణం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది.ప్రకృతి సోయగాలను చూసేందుకు శీతాకాలంలో పర్యాటకులు క్యూ కడుతుంటారు. అరకు లోయ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. బొర్రా గుహలు , కటికి జలపాతం, తాడిగూడ జలపాతం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, సుంకరమెట్ట యు పాయింట్, గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, చాపరాయి జలపాతాలను వీక్షించి మరిచిపోలేని అనుభూతులను మూట కట్టుకుని తిరిగి వెళుతుంటారు.  

విశాఖ మన్యంలోని అందాలు.. అక్కడ గిరిజనుల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు, గిరిజనులతో చేసే దింసా నృత్యాలు చూసి ఉల్లాస భరితులవుతారు. అక్కడి కాఫీ కేఫ్ లో ఎన్నో రకాల కాఫీ కూడా తాగవచ్చు. ఈ శీతాకాలంలో అరకు పాడేరు, వంజంగి ఏజెన్సీలోని ప్రాంతాలలో పర్వతాలపై ప్రయాణించే మేఘాలను దగ్గరగా చూడవలసిందే. ఒక్కోసారి మనలను తాకుతూ కూడా వెళుతుంటాయి మేఘాలు.అలాంటి సౌందర్య దృశ్యాలు మన్యం కే పరిమితం.

అందుకే పర్యాటకులు క్యూ కడుతుంటారు. కొండల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసే తోటలు చూడ ముచ్చటగా కనిపిస్తాయి. ఎత్తైన కొండల మధ్య కదిలాడే  మంచు మేఘాలు భూమిని తాకుతున్నాయా అన్నట్టు చూపరులకు కనువిందు చేస్తాయి. వాటిని వీక్షించే పర్యాటకులు మంత్ర ముగ్దులవుతారు. గజగజ వణికించే చలిలో సైతం సంతోషంతో తడిచి ముద్ద అవుతారు.

విశాఖ నుండి అరకు ప్రయాణం సుమారు 115 కిలోమీటర్లు కొండల మధ్య ప్రయాణం కొంచెం కష్టంగా ఉన్నా ..అరకు అందాలను చూసి దాన్ని మర్చిపోతారు. అరకుకి అతి సమీప దూరంలో ఉన్న మాడగడ కొండ పై భాగం దట్టంగా పొగ మంచు కమ్ము కోవడంతో మంచు కైలాసంలో తేలి ఆడిన ఫీలింగ్ కలుగుతుంది.

పర్యాటకులైతే అసలు భూమి మీదనే ఉన్నామా లేక ఆకాశంలో తేలి ఆడుతున్నమా అన్న అనుభూతికి లోనవుతారు. అద్భుతమైన ప్రకృతి అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. సరదాగా ఒక సారి వెళ్ళివద్దామా ? చలో అరకు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!