Bharadwaja Rangavajhala………….
1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది.రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది.అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడు కు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు.
ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన డి.వి.ఎస్ రాజుగారి పిల్లలు తీసిన సింహబలుడుకు భారీ బడ్జెట్ పెట్టారు. భారీ సెట్టింగులు వేశారు.ఈ సినిమాకు పోటీగా కృష్ణ నటించిన సింహగర్జన కూడా రిలీజయ్యింది.గిరిబాబు తీసిన సింహగర్జనకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకుడు. ఈ రెండు సినిమాలూ యావరేజ్ గానే నడిచాయి.
సింహబలుడుకైతే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అంతిమంగా గర్జనకే ఎక్కువ డబ్బులొచ్చాయి. సింహ బలుడు తీస్తున్న టైమ్ లో ఎవరో చెప్పిన మాటలు విని ఆగ్రహించిన ఎన్టీఆర్ ను … మొహమాటం లేకుండా కలసి తన సినిమా కథ చెప్పి మీ సినిమాకూ మా సినిమాకూ ఎటువంటి పోలికా లేదని గిరిబాబు చెప్పారు. ఎన్టీఆర్ వెంటనే కన్విన్స్ అయిపోయి వెళ్లి హ్యాపీగా సినిమా చేసుకోండనేశారు. ఎన్టీఆర్ తో అది మరచిపోలేని అనుభవం అంటారు గిరిబాబు.
విచిత్రంగా అదే సమయంలో జాపపద బ్రహ్మ విఠలాచార్య తీసిన గంధర్వకన్య కూడా రిలీజయ్యింది.జానపదాల నిర్మాణం ఆగిపోయిన ఎనిమిదేళ్లకు జరిగిన ఈ ప్రయత్నంలో విఠలాచార్యే విజయం సాధించారు.సింహబలుడు చిత్రం విజయం కోసం రాఘవేంద్రరావుతో పాటు ఆయన తండ్రి కె.ఎస్. ప్రకాశరావు, అన్న కె.బాపయ్య కూడా శ్రమించారు.ఈ సినిమాకు కెమేరా దర్శకత్వం వహించింది సీనియర్ కెమేరామెన్ కన్నప్ప.సెకండ్ యూనిట్ కెమేరామెన్ గా ప్రమోషన్ అందుకున్నారు కె.ఎస్. ప్రకాశ్.
రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం డ్రైవరు రాముడు. ఆ సినిమా మళ్లీ విజయభేరి మోగించింది.ఈ సినిమాకు పోటీగా కూడా కృష్ణ తో లారీ డ్రైవర్ సినిమా రావాల్సింది. అన్నగారితో అడవిరాముడు తీసిన సత్యచిత్ర నిర్మాతలే పి.సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ జయప్రదలు హీరో హీరోయిన్లుగా లారీ డ్రైవర్ అనే సినిమా ప్రారంభించారు. కొంత షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏ కారణం చేతో ఆపివేశారు.