సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు.కానీ ఇది సరైన సమయం కాదని అంటున్నారు. ఎన్నికలు కొద్దీ రోజుల్లో జరగబోతుండగా కేంద్రం ఇంత అకస్మాత్తుగా అవార్డు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అవార్డు ప్రకటించడం మూలాన దాని విలువ తగ్గిందని… ప్రజలు .. రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని మరోలా అర్ధం చేసుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఎన్నికలకు ముందు ఇలా చేయడం కారణంగా రాజకీయాలతో దాన్నిముడి పెట్టి చూస్తారని రజనీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
రజనీ కాంత్ ఇలాంటి అవార్డులు కన్నా ప్రజల మద్దతు .. ఆదరణను గొప్పగా భావిస్తారని చెబుతున్నారు. రజనీ దృష్టిలో ప్రజల గుర్తింపుకన్నా మరేది గొప్ప గుర్తింపు కాదని రజనీకాంత్ అభిమానుల క్లబ్ సీనియర్ ఫంక్షనరీ ఆర్.బి.కృష్ణన్ అంటున్నారు.
“2019 సంవత్సరానికి సంబంధించిన అవార్డును ఇపుడు ప్రకటించారు.నిజంగా రజనీకాంత్‌ను గౌరవించాలనుకుంటే, కనీసం రెండు నెలల క్రితం లేదా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అవార్డును ప్రకటించి ఉంటే బాగుండేది. ఓటింగ్‌కు కొద్ది రోజుల ముందు ప్రకటన చేయడం తో ఈ పురస్కారం విలువ, విశ్వసనీయత తగ్గిపోయాయి. రాజకీయ మైలేజీని సాధించడానికి ఈ సమయంలో ఈ అవార్డు ప్రకటించారనే అభిప్రాయం జనంలో వ్యక్తమౌతోంది” అని కృష్ణన్ అభిప్రాయ పడుతున్నారు.
మరో రజనీ అభిమాని గ్రేట్ వాసు మాట్లాడుతూ “రజనీకాంత్ అభిమానులకు ఈ ప్రకటన వెనుక ఉన్న రాజకీయ కోణం గురించి బాగా తెలుసు. అన్ని విషయాలను అభిమానులు అర్ధం చేసుకోగలర”ని అంటున్నారు. బీజెపి ఒత్తిడి కారణంగానే రజనీకాంత్ రాజకీయ పార్టీని ప్రారంభించకుండా వెనక్కి తగ్గారని బలంగా నమ్ముతున్న ఆయన అభిమానులలో ఒక వర్గం ఇప్పటికే కమలం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని వాసు చెబుతున్నారు.
కాగా రజనీకాంత్‌కు ఉత్తమ నటుడిగా 1989 అక్టోబర్‌లో స్టేట్ అవార్డు లభించింది. 1989 లో సార్వత్రిక ఎన్నికలకు ఒక నెల ముందు అవార్డు పంపిణీ కార్యక్రమం జరిగింది. రజనీకాంత్ అప్పటి ముఖ్యమంత్రి కరుణానిథి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన పిదప మాట్లాడారు. “రాబోయే పార్లమెంటు ఎన్నికలలో డిఎంకె కూటమి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నా అభిమానులు ఈ కూటమికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. డీఎంకే విజయం సాధించబోతోంది. ఆ పార్టీ నేతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.” అన్నారు. అంతే .. రజనీ మాటలను అనుసరించి ఆయన అభిమానులు రాష్ట్రమంతటా డిఎంకె కూటమికి అనుకూలంగా కృషి చేశారు. కానీ డీఎంకే కూటమి నాగపట్టణం మినహా అన్ని సీట్లను కోల్పోయింది, ఇక్కడ డిఎంకె మిత్రపక్షమైన సిపిఐ గెలిచింది. డీఎంకే పార్టీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఘోరంగా ఓడిపోయిన ఎన్నికలవి. అందువల్ల రజనీ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించినంత మాత్రాన బిజెపి పార్టీకి రజనీ అభిమానులు ఓట్లు వేస్తారనే గ్యారంటీ ఏమీ లేదని మరో అభిమాని అంటున్నారు.
ఇదిలా ఉంటే జరగబోయే ఎన్నికలలో రజనీకాంత్ ఏ పార్టీకి అయినా మద్దతు ప్రకటిస్తారో ? లేదో ? తెలీదు. ఇప్పటివరకు అలాంటి ప్రకటన రాలేదు. రజనీ అభిమానులు కూడా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే అంశంపై కూడా స్పష్టత లేదు.
——————KNMURTHY