Garuda Puranam ……………………………
‘మనిషి ఏ పాప కార్యం చేస్తే ఏ జన్మ ఎత్తుతాడో’ గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి కి స్వయంగా వివరించాడు.. ఆయన చెప్పినమేరకు మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి వుంటుంది.
మార్గంలో తన కోసం తిలోదకాలనూ… పిండప్రదానాలనూ చేసిన వారి దయవల్ల వాటినే తింటూ వుండాలి. త్రాగుతుండాలి. అక్కడి నుండి పుణ్యకర్ములు స్వర్గానికేగగా పాపకర్ములు నరకంలో పడిపోతారు.
స్వర్గ నరకాల అనుభవం తరువాత ప్రాణి భూలోకానికి మరలి వచ్చి స్త్రీ గర్భంలో ప్రవేశించి అండాకారాన్ని ధరిస్తుంది.అండం అలాగే భూమిపై పడి కొన్ని జీవులు పుట్టగా ….. మనిషి మాత్రం క్షీరదాలన్నిటివలెనే గర్భం లోపలే పూర్తి ఆకారాన్ని ధరించి సర్వాంగాలతో పుడమిపై పడడం జరుగుతుంది.
మానవులు సాధారణంగా పూర్తిగా తొమ్మిది మాసాలూ జనని గర్భంలో వుంటారు. అంతవరకూ అందరికీ పూర్వజన్మ గానీ జన్మలుగానీ గుర్తుంటాయి.పూర్వజన్మలో చేసిన తప్పులు, పొరపాట్లు ఇక చేయకూడదని అనుకుంటారు గానీ నేలపై పడగానే వైష్ణవ మాయ కమ్మేసి అన్నీ మరచిపోతారు. సామాన్య జీవికి బాల్య, కౌమార, యువ, వృద్ధ అనే దశలు ఉంటాయి. మరల మృత్యువు కబళించడం, జనన మరణ చక్రం పరిభ్రమించడం జరుగుతాయి.
నమ్మి దాచుమని యిచ్చిన సొమ్మునపహరించినవాడు పరమ పాతకుడు. వాడు నరకానికి పోయి అన్ని శిక్షలనూ అనుభవించి తిరిగి భూమిపై పడ్డపుడు క్రిమి కడుపున పడతాడు. ఈర్ష్యాళువు కూడా ఆ నరకానికే పోతాడు. కానీ మరల భూమిపై పడ్డపుడు రాక్షసి గర్భంలో పడతాడు.
విశ్వాసఘాతకుడు నరకము నుండి వచ్చి చేప కడుపున పుడతాడు. ఇలాగే ధాన్యపు దొంగలకూ, స్త్రీని అపహరించేవారికీ, అన్నదమ్ముల భార్యలతో సంబంధాలు పెట్టుకున్న వారికి, గురు లేదా తత్సమానుల పత్నులతో సంబంధాలు పెట్టు కున్న వారికీ, నరకలోకం నుండి రాగానే, ఎలుక, తోడేలు, కోకిల, పంది జన్మలు వస్తాయి.
యజ్ఞ దాన వివాహాది పవిత్ర, శుభకార్యాలలో గోలచేసి అల్లరిపెట్టి అడ్డు పుల్లలు వేసి విఘ్నాలు కలిగించే పాపాత్ములు నరకం నుండి వచ్చి క్రిములౌతారు. దేవతలకు నివేదించకుండా పితరులకు అర్పించకుండా బ్రాహ్మణులకూ, అతిథికీ పెట్టకుండా ఆబగా అన్నం తినేసేవాడు నరకం నుండి వచ్చి కాకిగా పుడతాడు.
పెద్దన్నను అవమానించినవాడు క్రౌంచపక్షిగా పుడతాడు. కృతఘ్నుడైన వ్యక్తి క్రిమిగానో, తేలుగానో పుడతాడు.అంటే ముందు క్రిమిగా పుట్టి గిట్టి అలాగే కీటకం, దీపపు పురుగు జన్మలెత్తి చివర తేలుగా పుట్టి చచ్చి నరకానికి మళ్ళీ పోతాడు. నిరాయుధుని చంపినవాడు గాడిదై పుడతాడు.
స్త్రీలను, బాలురను చంపినవాడు క్రిమిగానూ అన్నం దొంగ పిల్లిగానూ, భోజనం దొంగ ఈగ గానూ, నువ్వులదొంగ ఎలుకగానూ, నేతి దొంగ ముంగిస గా, మాంసం దొంగ కాకి గానూ తేనె దొంగ అడవి ఈగ గానూ, అప్పాల దొంగ పురుగుగానూ, నీటిదొంగ కాకి గానూ, కఱ్ఱలదొంగ హరిలపిట్టగానూ, అగ్ని చోరుడు కొంగగానూ, కూరల దొంగ నెమలిగానూ, కుందేలుని దొంగిలించిన వాడు కుందేలుగానూ.. కళలదొంగ నపుంసకునిగానూ, పూలదొంగ దరిద్రునిగానూ జన్మిస్తారు.
ఇంటిని అపహరించినవాడు మహాభయానకాలైన రౌరవాది నరకాలలో పడిపోతాడు. వీరంతా దేహాంతంలో నరకానికి పోయి అక్కడ అన్ని పాపాలకూ అన్ని శిక్షలనూ అనుభవించి చివరగా ఈ పాపాలవల్ల పైన చెప్పిన విధంగా జన్మిస్తారు.
ప్రాణుల పట్ల దయ చూపిస్తూ, చక్కగా చల్లగా మంచిగా అందరితోనూ మాట్లాడుతూ, పరలోక దృష్టితోనైనా సాత్వికానుష్ఠాన, సత్కార్య నిష్పాదన, సత్యధర్మ పాలన చేస్తూ ఇతరుల హిత చింతననూ, ముక్తి సాధనేచ్చనూ, వేదప్రమాణ బుద్ధినీ కలిగిఉండి, గురువులనూ పెద్దలనూ దేవర్షులనూ .. సిద్ధులను సేవిస్తూ, సాధుజనులు చేసిన నియమాలను పాటిస్తూ జీవించినవారే స్వర్గాని కి వెళ్ళగలరు.
మరల భువికి మరలినపుడు ఉత్తమ జన్మ పొందగలరు. పున్నెము పండి యోగ శాస్త్రం ద్వారా చెప్పబడిన యమ నియమాలను అష్టాంగ యోగాలను ఆలంబనగా చేసుకొని సత్ జ్ఞానులై సమాజం కోసమే జీవించిన వారు దేహాంతంలో అత్యంతిక ఫలాన్ని అనగా మోక్షాన్ని పొందుతారు.