అరవింద్ అవుట్ .. నెక్స్ట్ ఆవిడేనా ??

Sharing is Caring...

Paresh Turlapati ………………………

ఒకప్పుడు మా విజయవాడలో శత్రువును దెబ్బకొట్టే ముందు పక్కా ప్లాన్డ్ గా స్కెచ్ వేసేవారు. 
దీనికో టీమ్ ఉండేది.. టీమ్ వేసిన స్కెచ్ ను అమలు చేసే బాధ్యత ఇంకో టీమ్ తీసుకునేది. 
అంతా పక్కాగా జరిగి ప్లాన్ సక్సెస్ అయ్యేది. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటారా,ఏ పనికైనా…ఏ విజయానికైనా సరెైన వ్యూహం ముఖ్యం.

మన దేశంలో దాదాపు ప్రతి రాజకీయ పార్టీకి వ్యూహకర్తలు ఉన్నారు.. కొందరు తెర వెనక వ్యూహరచనలు చేస్తే మరికొందరు నేరుగా వ్యూహ రచన చేస్తారు.. ఇక ఈ వ్యూహ రచనల్లో సోషల్ మీడియా పాత్ర చెప్పనవసరం లేదు.. ప్రస్తుతం ప్రతి పార్టీ సోషల్ మీడియా మీద ఆధార పడి ఉన్నాయి.

వీటిలో బీజీపీ ప్రథమ స్థానంలో ఉంది.. మోడీ చరిష్మా కు తోడు బీజేపీకి చక్కని వ్యూహకర్తలు ఉన్నారు.. పటిష్ఠమైన సోషల్ మీడియా నెట్ వర్క్ ఉంది.. అంతా ఒక పద్ధతి ప్రకారం
ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది.. బీజేపీలో కార్యకర్తలనుంచి నాయకుల వరకు మోడీకి ఎదురులేని నాయకత్వం అప్పగించారు.

ప్రస్తుతానికి బీజేపీలో మోడీనే సుప్రీమ్..ఇది చాలు మోడీకి.. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా.. మోడీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతున్నారు.. ఈ మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో గానీ.. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో గానీ బీజీపీ గెలవడం వెనక పక్కా స్కెచ్ ఉంది.

అరవింద్ కేజ్రీవాల్ IRS సర్వీస్ అధికారి.. అన్నా హజారే స్పూర్తితో ఉద్యమ పార్టీగా ప్రజల ముందుకు వచ్చి ఢిల్లీ పీఠం దక్కించుకుని సంచలనం సృష్టించారు. అప్పట్లో అదో కొత్త ఉత్సాహం.. కొత్త ఆశలు..రాజకీయ పార్టీల రాజకీయాలతో విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు అత్యున్నత విద్యావంతుడు అఖిల భారత సర్వీసులకు చెందిన అరవింద్ కేజ్రీవాల్ లో మచ్చలేని ఓ స్వచ్ఛంద నేతను చూశారు..

అవినీతి అంటని పాలన అందిస్తాడని ఆశ పడ్డారు. మీరు మచ్చలేని పాలన అందించండి.. మీ వెనక మేముంటాం అని ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కు బాసటగా నిలిచారు.ఈ ఉత్సాహంతో అరవింద్ పంజాబ్ లో కూడా ఆప్ జండా ఎగురవేశాడు.. అనతి కాలంలోనే కేజ్రీవాల్ బలమైన నాయకుడిగా ఎదిగాడు. 

దేశ వ్యాప్తంగా మూడుసార్లు అధికార పగ్గాలు చేపట్టిన బీజెపీ కూడా కేజ్రివాల్ విషయంలో తడబడింది.. ఒకానొక టైమ్ లో బీజేపీకి ఆప్ పార్టీ నే ప్రత్యామ్నాయం అని రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది..అందుచేతనే ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్న చంద్రబాబు అప్పట్లో బీజేపీని కూలగొట్టడానికి కేజ్రివాల్ కు మద్దతు ఇచ్చారు.. బీజెపీని పడగొట్టడానికి కేసీఆర్ కూడా కేజ్రివాల్ తో మంతనాలు జరిపారు.

దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజీపీ ని ఓడించడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండి కూటమి గా జట్టు కట్టారు.ఆదిలోనే హంసపాదు లా ఇండియా కూటమిలో మొదట్లోనే విభేదాలు వచ్చి మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అయ్యింది ..ఇండియా కూటమిలో చీలికలకు కూడా బీజెపీ వ్యూహ కర్తలు మాస్టర్ ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు.

బీజెపీ ఎప్పుడూ రాహుల్ నాయకత్వ సామర్థ్యం గురించి కానీ…కాంగ్రెస్ పార్టీ గురించి గానీ పెద్దగా భయపడలేదు.. ఇక మిగిలిన పని అరవింద్ కేజ్రివాల్ పనిబట్టడం.. అరవింద్ కేజ్రివాల్ కు పాలనలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రూపంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి.. కేజ్రివాల్ కు సగం సమయం లెఫ్టినెంట్ గవర్నర్ తో గొడవలకే సరిపోయింది.

దీంతో ఢిల్లీలో వాయు కాలుష్యం.. మంచి నీటి వ్యవస్థలు అశ్రద్దకు గురయ్యాయి.. మెల్లగా పాలనపై గ్రిప్ తగ్గింది.. ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో కన్నా బీజేపీని తిట్టడానికి.. గవర్నర్ తో గొడవలు పడటానికి ఎక్కువ టైం తీసుకున్నాడు.

ఈ క్రమంలో మెల్లగా కేజ్రివాల్ అంటే ఢిల్లీ ప్రజలకు మొహం మొత్తినట్టు అయిపోయింది.పదేళ్ళ నుంచి ఒకటే మూస ధోరణి చూసీ చూసీ విసుగెత్తిపోయారు..సరిగ్గా ఇదే సమయంలో బీజీపీ బ్రహ్మాస్త్రం ప్రయోగించింది.. అదే లిక్కర్ స్కామ్ వెలికితీత.. కేజ్రివాల్ గురువు సామాజిక కార్యకర్త అయిన అన్నా హజారే కూడా లిక్కర్ స్కాం లో కేజ్రివాల్ తీరును తప్పు పట్టారు.

కేజ్రివాల్ కూడా లిక్కర్ స్కాంని రాజకీయ కక్ష సాధింపు దృష్ఠిలో బీజీపీ ఇరికించిన మాస్టర్ ప్లాన్ అని ఓ స్టేట్మెంట్ పడేసి లైట్ తీసుకున్నారు..వ్యవస్థలు ఒకరొకర్ని అరెస్ట్ చేసి కోర్టుల్లో ప్రవేశపెడుతుంటే ఏదో స్కూల్ కి వెళ్తున్న పిల్లల్లా రెండు వేళ్ళు చూపిస్తూ ఎగేసుకుంటూ జైలుకు వెళ్లారు మినహా లిక్కర్ స్కాం అనేది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని గట్టిగా ప్రజలను కన్విన్స్ చేయలేకపోయాడు. 

ఈ కేసులో పూర్తిగా ఆప్ నాయకులనే టార్గెట్ చేసి ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ ఆంధ్రా తెలంగాణా నేతలు కూడా గ్లాసు పంచుకున్నారని అరెస్టులు చేయడంతో ప్రజలకు వెళ్లాల్సిన సంకేతాలు బలంగానే వెళ్లాయి..మెల్లగా కేజ్రివాల్ కూడా అవినీతి ముద్ర పడ్డ సాధారణ పొలిటీషియనే అనే భావం ప్రజల్లో కలిగింది.

పై పెచ్చు కాంగ్రెస్ తో జట్టు కట్టకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళడం కేజ్రివాల్ చేసిన ఇంకో తప్పు .. ఈ గోలలో పడి విద్యా వ్యవస్థ లోనూ.. వైద్య రంగంలోనూ తీసుకొచ్చిన సంచలనాత్మకమైన మార్పులను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాడు.

అందరి ఫోకస్ లిక్కర్ స్కాం మీదే పడింది.. తర్వాత కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్ మహల్ పునర్నిర్మాణం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి .. శీష్ మహల్ వీడియోలు , ఫోటోలు జనంలోకి వెళ్లి బాగా డామేజ్ చేశాయి. పర్యవసానం ఢిల్లీ పీఠం కోల్పోవడం..ఢిల్లీ పీఠం పోతే పోయింది ..కనీసం అసెంబ్లీలో ఆప్ వాయిస్ వినిపించడానికి కూడా లేకుండా తను కూడా ఓడిపోయాడు.

కొసమెరుపు: కేంద్రంలో బీజేపీని మట్టి కరిపించే లక్ష్యంగా బీఆరెస్ పార్టీ పెట్టిన కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కాదు కదా కనీసం తెలంగాణా రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా లేకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కాలక్షేపం చేస్తున్నారు.

అరవింద్ కేజ్రివాల్ కు ఫామ్ హౌస్ ఉందో లేదో తెలీదు కానీ ముందు ముందు ఇప్పుడు చేసినంత ఆక్టివ్ రాజకీయాలు మాత్రం చేయలేరు.. ఒకవేళ చెయ్యాలన్నా పై ఇరువురికి కొంత టైమ్ పడుతుంది…ఇక ప్రస్థుతానికి బీజెపీ కి మిగిలిన టార్గెట్ మమతా బెనర్జీ.. ఆవిడని కూడా ఇంటికి పంపడానికి బీజెపీ వ్యూహకర్తలు ఇకపై ఏం స్కెచ్ వేస్తారో చూడాలి !

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!