ఇంత అద్భుతమైన ఫాంటసీ సినిమా మరొకటి లేదా ?

Sharing is Caring...

73-year-old good film ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

‘సాహసం సేయరా డింభకా’ …. ‘నరుడా ఏమి నీకోరిక’ … ‘జనం అడిగింది మనం చేయవలెనా?’ ‘మనం చేసింది జనం చూడవలెనా?’ ‘నిజం చెప్పమంటారా ?అబద్ధం చెప్పమంటారా ?’……. ఎప్పుడో 73ఏళ్ళ క్రితం రాసిన ఈ డైలాగులు  ఇప్పటికి జనం నోళ్ళలోనానుతున్నాయంటే ఆ రచయిత నిజంగా ధన్యుడే. ఆ రచయిత ఎవరో కాదు పింగళి నాగేంద్రరావు మాస్టారు.

 ఆ సినిమా ‘పాతాళ భైరవి’. తెలుగు లో దీన్ని కొట్టిన ఫాంటసీ మరొకటి లేదు. కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ‘పాతాళ భైరవి’ స్థాయిలో అవి లేవు. ఆ స్థాయిలో హిట్ కూడా కాలేదు. ‘పాతాళ భైరవి’ కూడా కల్పిత కథే. కాశీ మజిలీ కథలను స్ఫూర్తిగా తీసుకుని పింగళి వారు రచన చేశారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్  అయింది. చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసారు. ఇప్పటికి చూస్తుంటారు. అప్పట్లో  నిర్మాతలు సాహసం చేశారు కాబట్టే ఈ సినిమా మన ముందుకు వచ్చింది.

దర్శకుడు కేవీరెడ్డి తొలుత ఈ సినిమాలో తోటరాముడు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును ఎంపిక చేద్దామనుకున్నారు. అలాగే నేపాళ మాంత్రికుడిగా గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను పెట్టాలనుకున్నారు. అయితే ఎన్టీఆర్ పేరును ను కేవీ రెడ్డి కి వేరెవరో సూచించారు. కేవీరెడ్డి వెళ్లి పల్లెటూరి పిల్ల షూటింగ్ చూసి ఎన్టీఆర్ ను తోటరాముడిగా కంఫర్మ్ చేసుకున్నారు.

అలాగే ఎస్వీ రంగారావు కి మేకప్ టెస్ట్ చేశారు. నేపాళ మాంత్రికుడిగా ఆయన కరెక్ట్ గా సూట్ అయ్యారు. దాంతో షూటింగ్ చకచకా పూర్తి చేసుకుని 1951  మార్చిలో విడుదల చేశారు. కథ .. కథనం అద్భుతంగా ఉండటం.. దీనికి తోడు మంచి పాటలు .. ప్రేక్షకులను అలరించాయి. నిర్మాతలు ఊహించని రీతిలో ఆదరణ లభించింది.తెలుగు సినిమా చరిత్రలో మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది.

ఆ రోజుల్లోనే పాతాళ భైరవి 28 కేంద్రాలలో శతదినోత్సవం జరువుకుంది.కొన్ని కేంద్రాలలో 200 రోజులు నడిచింది. తెలుగులో అన్ని రోజులు ఆడిన మొదటి సినిమా  కూడా ఇదే కావడం విశేషం.
ఎన్టీఆర్ కి ఇది ఆరో సినిమా.ఈ సినిమా తో ఎన్టీఆర్ కు వరుసగా హీరో గా ఎన్నో అవకాశాలు వచ్చాయి.

పాతాళ భైరవి ని అప్పట్లో ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. రెండిట్లో ఎన్టీఆరే హీరో. తెలుగులో మార్చి 15 న , తమిళంలో  మే 17 న విడుదలైంది.ప్రఖ్యాత కెమెరామాన్ మార్కస్ బారాట్లే మాయాజాలం జనాన్ని బాగా ఆకట్టుకుంది. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా కథ ను బారాట్లే అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు.

ఘంటసాల మాస్టారి సంగీతం గురించి ఇక చెప్పనక్కర్లేదు. కలవరమాయే మదిలో , ప్రేమకోసం వలలో పడెనే పాపం పసివాడు,వినవే బాలా నా ప్రేమ గోలా, వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు వంటి పాటలు ఇప్పటికి అక్కడక్కడా వినిపిస్తుంటాయి. ఈ సినిమా హీరోయిన్ మాలతీ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ తల్లి పాత్రల్లో నటించింది.

1952 లో మొదటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా సౌత్ ఇండియా నుంచి ఎంపిక అయింది. ఇదే సినిమాను 1985 లో  హీరో కృష్ణ హిందీలో రీమేక్ చేశారు. జయప్రద , జితేంద్ర, ఖాదరఖాన్ నటించారు. హిందీలో లో కూడా బాగానే ఆడింది . తెలుగు పాతాళ భైరవి విడుదల అయి కరెక్టుగా ఈ మార్చికి 73 ఏళ్ళు అయింది. 

———KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!