బినామీ ఆస్తుల వివాదాల్లో అజిత్ పవార్ !

Sharing is Caring...

Leader of the controversy……………………………………

సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ అన్న కుమారుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ కి ఐటీ శాఖా పెద్ద షాక్ ఇచ్చింది. అజిత్,ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.1,000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ ఆస్తులన్నీ మహారాష్ట్ర, గోవాలలో ఉన్నాయి. 

అక్టోబర్ 7 న ఐటీ అధికారులు ఈ ఆస్తులపై దాడులు చేశారు. అపుడు జరిగిన సోదాలలో ఈ ఆస్తులన్నీచట్ట విరుద్ధంగా కొనుగోలు చేసినట్లు గుర్తించారు.ఇవన్నీ బినామీ ఆస్తులని  ఐటీ అధికారులు అంటున్నారు. యాంటీ బినామీ చట్టం ప్రకారం ఐటీ శాఖ ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు చెబుతున్నారు.  

తాత్కాలికంగా అటాచ్ చేసిన ఈ ఆస్తులలో జరందేశ్వర్ చక్కెర కర్మాగారం విలువ రూ.600 కోట్లు.. దక్షిణ ఢిల్లీ ఫ్లాట్ విలువ 20 కోట్లు, పవార్ నిర్మల్ కార్యాలయం విలువ 25 కోట్లు ..గోవా రిసార్ట్ విలువ 250 కోట్ల మేరకు ఉండవచ్చని అంచనా. అజిత్‌ పవార్‌, ఆయన ముగ్గురు సోదరీమణులకు సంబంధం ఉన్న కొల్హాపూర్‌, సతారా, పూణెలోని పలు కంపెనీలపై కూడా అక్టోబర్‌ 7న ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించింది.

అలాగే పవార్‌కు కంచుకోట అయిన బారామతి వద్ద ఉన్న డౌండ్ షుగర్ ఫ్యాక్టరీ .. సతారా, అంబాలికా చక్కెర కర్మాగారాలు , ష్రెయిబర్ డైనమిక్స్ డెయిరీ వంటి సంస్థలపై కూడా దాడులు జరిగాయి.అజిత్ పవార్ నియంత్రణలో మొత్తం 12 చక్కెర మిల్లులు ఉన్నాయి. మహారాష్ట్రలో అతిపెద్ద చక్కెర వ్యాపారి ఎవరంటే అజిత్ పవారే.

అజిత్ పవార్ గత కొంతకాలంగా వివాదాల్లో కూరుకుపోయాడు. ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడతారనే పేరున్న పవార్ 1999-2014 మధ్య కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వాలలో జలవనరుల మంత్రిగా చేశారు. అప్పట్లో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి రూ.26 వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని  ఆరోపణలు వెల్లువెత్తాయి.కొంతమంది కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ..ప్రాజెక్టుల వ్యయాన్ని పలు రెట్లు పెంచేలా నిబంధనలను తుంగలో తొక్కారనే ఆరోపణలున్నాయి. 

ప్రతిపక్ష బీజేపీ ఈ నీటిపారుదల కుంభకోణం విలువ రూ.70,000 కోట్లుగా ప్రచారం చేసింది. చాలాకాలంగా అజిత్ పవార్ కేంద్ర ఏజెన్సీల దృష్టిలో ఉన్నారు. ఐటీ అధికారులు అదను కోసం చూసి దాడులు చేశారు. ఆస్తులు అటాచ్ చేశారు. అజిత్ ఆస్తుల వ్యవహారంపై సీబీఐ విచారణ కు బీజేపీ డిమాండ్ చేయవచ్చు.

ఇదే అంశంపై అజిత్ పవార్ స్పందిస్తూ తమ సంస్థలన్నీ సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని మండి పడుతున్నారు. ఈ తాజా పరిణామాలు ఏమలుపు తిరుగుతాయో ? అధికారపార్టీ ..  బీజేపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!