Tried to some extent but could not succeed………………..
తమిళ మాస్ స్టార్ ఎంజీఆర్ ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం కావాలని కలలు గన్న హీరో విజయ్ కాంత్ ఆ స్థాయికి ఎదగలేకపోయారు. విజయకాంత్ సొంతంగా పార్టీ పెట్టారు. తన కెరీర్‌లో కేవలం తమిళ చిత్రాల్లో మాత్రమే నటించిన అతి కొద్ది మంది నటులలో విజయకాంత్ ఒకరు.
విజయకాంత్ సినిమాలు ఎక్కువగా తెలుగు, హిందీలోకి డబ్ అయ్యాయి. విజయకాంత్‌కు సినీ పరిశ్రమలో “పురచ్చి కలైంజర్” ‘కెప్టేన్’ వంటి బిరుదులు కూడా ఉన్నాయి. విజయ కాంత్ మూడు షిఫ్ట్ లలో ఫుల్ బిజీ గా నటించిన నటుడు.
రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపు లేని నటుడు కావడంతో చాలామంది నిర్మాతలు ఆయనకు పారితోషకం ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయంటారు. నిర్మాతలు కష్టాల్లో ఉంటే తాను పారితోషకం తీసుకునే వాడు కాదు. దాదాపు 150 సినిమాల్లో నటించి తనకంటూ ఒక స్టైల్ .. పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు విజయకాంత్.
స్వయం కృషితో విజయకాంత్ తమిళ సినిమా అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు. 1984లో విజయకాంత్ సినిమాలు 18 విడుదల అయ్యాయి. ఆయన కెరీర్లో అదొక రికార్డు.విజయ్ కాంత్ .. 2005లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.
2006 ఎన్నికల్లో 234 స్థానాల్లోనూ ఆ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేశారు. ఉలందూర్ పేట నియోజకవర్గం నుంచి ఆయన ఒక్కరే గెలుపొందారు. 2011 లో మళ్ళీ అక్కడినుంచి గెలిచారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు.
29 సీట్లలో గెలుపొంది జయలలిత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2016 ఎన్నికల్లో డీఎండీకే 104 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. విజయకాంత్ కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
ఆయన అతివిశ్వాసమే ఆయన పరాజయానికి కారణమని అంటారు. అయినా విజయ కాంత్ గుణపాఠాలు నేర్వలేదు. జయలలిత తో విభేదాలు ఆయన్ను బాగా దెబ్బ తీశాయి. 2021 లో విజయకాంత్ పార్టీ 60 చోట్ల పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. అప్పటికే ఆయన ఆరోగ్యం బాగాలేదు.
ఆ సమయంలో విజయకాంత్ భార్య ప్రేమలత పార్టీ ని నిర్వహించింది. కుటుంబ సభ్యుల జోక్యం .. టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు .. నాయకత్వ లేమి పార్టీని దెబ్బ తీశాయి. అభిమానులు కూడా విజయ్ కాంత్ వైఖరికి విసిగి పోయి దూరంగా జరిగారు. దీంతో పార్టీ బొక్క బోల్తా పడింది. కాగా విజయ్ కాంత్ 71 సంవత్సరాల వయసులో 2023 డిసెంబర్ లో అనారోగ్యం తో కన్నుమూసారు.
——KNM