తోపుడుబండి సాదిక్………………….. The human aspect
తుమ్మల యుగంధర్ ఎవరూ అంటే ?….నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న మాస్ అండ్ క్లాస్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు గారి అబ్బాయి అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ యుగంధర్ అంటే ఇంతేనా అని అడిగితే, కాదు,,, అంతకన్నా ప్రత్యేకతలు యుగంధర్ లో చాలా ఉన్నాయి అని చెప్తాను. చాలా మందికి తెలియని, సన్నిహితంగా చూసిన కొద్దిమందికి మాత్రమే తెలిసిన మరో యుగంధర్ గురించి రాయటమే ఈ పోస్ట్ ఉద్దేశ్యం.
అసలెందుకు రాయాలి? తోపుడు బండి దశాబ్ద కాలపు ప్రయాణంలో చాలామంది మిత్రులు చాలా సందర్భాల్లో తోడూ నీడగా నిలబడ్డారు. వారి గురించి ఆయా సందర్భాల్లో రాస్తూ వచ్చాను.కానీ తొమ్మిదేళ్లుగా తోడుగా ఉండి, చోదక శక్తిగా నడిపిస్తున్న డాక్టర్ యుగంధర్ గురించి ఒక్కసారి కూడా రాయలేదు.దానికి కారణం ఆయన అన్న మాటలే.
‘అవసరంలో ఉన్న వారికి మనకు చేతనైన సాయం చేసాం. దాని గురించి చెప్పుకోవటం ఎందుకు, చేసామన్న సంతృప్తి చాలు, పబ్లిసిటీ వద్దు ‘అని సున్నితంగా వారించే వారు. కానీ ఆ మంచి తనాన్ని, మనిషితనాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఈరోజు ఈ పోస్ట్.
తోపుడబండి పల్లెకు ప్రేమతో…100రోజులు 1000కిలోమీటర్లు యాత్రతో యుగంధర్ గారితో మా ప్రయాణం మొదలైంది. వరంగల్ లో బస్తిలో పుస్తకాల పండుగ యాత్ర సందర్భంగా మా బంధం బలపడింది.ఆ యాత్రలో ఒకానొక బస్తిలో చిత్రమైన పరిస్థితి ని ఎదురుకున్నాం.అక్కడి ప్రజల్లో చాలామంది చర్మ వ్యాదులు, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.
స్వతహాగా డాక్టర్ అయిన యుగంధర్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాను. విన్న మరుక్షణం ఆయన శరవేగంగా స్పందించారు. తన మిత్రులు, సన్నిహితులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ తో ఒక బృందాన్ని తయారు చేశారు. అవసరమైన మందులు సమకూర్చారు.అలా తొలిసారిగా ఆయన లోని మానవీయ కోణాన్ని చూశాను.
ఆ తర్వాత తోపుడుబండి అడవితల్లికి అక్షరతోరణం కార్యక్రమం. ఇల్లందు నుంచి గుండాల వరకు అటవీ ప్రాంతాల్లో నెలరోజుల పాటు జరిగిన యాత్రలో ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకునేవారు. గిరిజనుల జీవన స్థితిగతులు తెలుసుకునేవారు. వారికి అక్కడి సమస్యలపైన సంపూర్ణ అవగాహన ఉంది. వాళ్ళకోసం ఏదైనా చేయాలనే తపన పడేవారు.
ఇక తోపుడుబండి కల్లూరును కార్యక్షేత్రంగా చేసుకొని పని మొదలు పెట్టినప్పటి నుంచి యుగంధర్ గారితో కలిసి చాలా పనులే చేసాం. కొత్తమేడేపల్లి లో 365 మంది గిరిజన బిడ్డలు ఎండాకాలంలో నీళ్లులేక అల్లాడిపోతున్నారు అని చెప్తే వాళ్లకు కావాల్సిన డ్రమ్ములు, కాన్ లు సమకూర్చటమే కాకుండా ఆ రెండు నెలలు నీళ్లకు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు.
ఇక సర్కారు బళ్ళల్లో నిరుపేద విద్యార్థులకు నోట్ బుక్స్ కావాలి అన్నప్పుడు ఆయన పడిన తపన నాకింకా గుర్తుంది. హైదరాబాద్, బెంగుళూరు, మరోచోట ఆయన ఎక్కడున్నా ఫాలో అప్ చేస్తుండేవారు. ఫలాన టైమ్ కి వస్తాయిఅనీ, వచ్చాక వచ్చింది లేనిది కనుక్కొని చేరాల్సిన వారికి చేరాయా లేదా అని ఆరా తీసేవారు.
అలాగే, మా చిన్నారి శివుడు రోడ్ ప్రమాదంలో గాయపడి కాలును పోగొట్టుకున్న విషయం తెలిసి తల్లడిల్లిపోయారు. శివుడికి కృత్రిమ కాలు పెట్టించే బాధ్యతను కూడా తనే తీసుకున్నారు. ఇప్పుడు పెట్టకూడదు, మరింతకాలం ఆగాలి అని డాక్టర్స్ చెప్పటంతో ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. కరోనా సమయంలో యుగంధర్ గారు అందించిన సహకారం మరో లెవెల్.
ఇవి కొన్ని మాత్రమే.ఇలా చెప్తూ పోతే చాలా రాయాల్సి ఉంటుంది. తుమ్మల గారి కొడుకుగా మాత్రమే కాకుండా, తనకంటూ ఒక స్పష్టమైన వ్యక్తిత్వం, ఆలోచనా సరళి, పనితీరు చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంది.
ఆర్భాటాలకు, పబ్లిసిటీ కి పోకుండా నిండుకుండలా, నిజాయితీగా, మనసుతో పనిచేస్తున్న డాక్టర్ యుగంధర్ కు అభినందనలు. మున్ముందు వారి సేవలు విస్తృతం అవ్వాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటూ…