Bharadwaja Rangavajhala …….
హరనాథ్ … టాలీవుడ్ లో ఫిఫ్టీస్ ఆఖర్లో … సిక్స్టీస్ ప్రారంభంలో బాగా వినిపించిన పేరు. అప్పటికి సూపర్ స్టార్ డమ్ లో ఉన్న ఎన్టీఆర్ , ఏఎన్నార్ ల తర్వాత తరం హీరోగా హరనాథ్ పేరు కాస్త గట్టిగా వినిపించింది … ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మొదలైన హరనాథ్ కెరీర్ వంద సినిమాలకు విస్తరించింది.
హరనాథ్ అందగాడు. తెలుగు తెర తొలి గ్లామర్ హీరో అనలేం కానీ అలానే అంటారాయన్ను. హరనాథ్ సరసన నటించడానికి అప్పట్లో హీరోయిన్లు పోటీలు పడేవారంటారు. నేనైతే అలా అనుకోను. ఇలాంటి దూకుడు స్టేట్మెంట్లతో ఆయన్ని ఆవిష్కరించవలసిన అవసరం ఉందని నేననుకోను. ఆయన పర్సనాల్టీ స్క్రీన్ మీద ఎట్రాక్టివ్ గా ఉండేది. నటన చాలా నాచురల్ గా ఉండేది. డైలాగ్ మాడ్యులేషన్ బావుండేది.
సహజత్వం ఉట్టిపడేది … చాలా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గానూ కనిపించేవాడు హరనాథ్ … నిజానికి మోడ్రన్ డాన్సులు కూడా తెలుగు తెర మీద హరనాథ్ తోనే ప్రారంభమయ్యాయి. అవే ఆయన్ని బాలీవుడ్ కీ లాక్కెళ్లాయి. హరనాథ్ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా రాపర్తి . తండ్రి వరహాల రాజు. ఆయన చిన్నతనంలోనే మద్రాసు వెళ్లి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయడం … సరదాగా డబ్బింగులూ అవీ చెప్పడం , అసిస్టెంట్ డైరక్టర్ గా ఉండడం లాంటి కార్యక్రమాలు చేసేవారు.
అలా హరనాథ్ కూడా నెపో కిడ్డే. ఆయన పుట్టింది చెన్నైలోనే …ఇంటర్ వరకూ ఆయన చదువూ చెన్నైలోనే సాగింది… డిగ్రీ మాత్రం కాకినాడ పి.ఆర్ కాలేజీలో చేశాడు… హరనాథ్ కు చిన్నప్పట్నించీ నాటకాల లో ఇంట్రస్ట్ ఉండేదిగానీ … చదువు మీద కాన్సన్ ట్రేట్ చేశారు. కాకినాడ పిఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి తరపున నాటకాలు ఆడడం ప్రారంభించారు హరనాథ్.
ఆ సంస్ధ నాటకాలకు దర్శకుడెవరో తెల్సా? పూర్ణోదయా పిక్చర్స్ బ్యానర్ మీద శంకరాభరణం లాంటి అజరామర చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు గారు. ఆ సంస్ధ లో మరో భాగస్వామి ప్రఖ్యాత నిర్మాత దర్శకుడుగా మారిన వి.బి.రాజేంద్రప్రసాద్. అలా పిఆర్ కాలేజీలో నాటకాల్లో నటిస్తున్న హరనాథ్ కు ఓసారి ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చింది.
దాన్ని నటి జమున చేతుల మీదుగా అందచేయాలనుకున్నారు నిర్వాహకులు. అయితే … జమున చేతుల మీదుగా దాన్ని తీసుకోడానికి అంగీకరించలేదు హరనాథ్ … ఏమిటన్నారు నిర్వాహకులు. జమునకి స్టేజ్ అనుభవం లేదు కదా ఆవిడ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడమేమిటన్నాడు హరనాథ్ . అయితే జమున కూడా ప్రజానాట్యమండలి నాటకాలలో నటించారని చెప్పి హరనాథ్ ను ఒప్పించారు. ఆ తర్వాత హరనాథ్ సినిమాల్లోకి వచ్చాక ఎక్కుగా నటించింది జమున సరసనే కావడం విశేషం.
నాటకాల్లో నటిస్తూనే చెన్నైలో కాలుపెట్టారు హరనాథ్ . కళాదర్శకుడు సూరన్న ద్వారా హరనాథ్ పేరు దర్శకుడు గుత్తా రామినీడు దగ్గరకు చేరింది. ఆయన హరనాథ్ ను చూసిన వెంటనే ఐ గాట్ హీరో అన్నారు. నవశక్తి పర్వతనేని గంగాధరరావు గారు పూర్తిగా హైద్రాబాద్ లో తీసిన మాయింటి మహాలక్ష్మి సినిమా కోసం హరనాథ్ ని తీసుకున్నారు రామినీడు.
ఆ మధ్య సాగర్ సొసైటీలో ఉంటున్న పర్వతనేని గంగాధరరావుగారి తమ్ముడు సాంబశివరావుగారిని కల్సినప్పుడు ఆయన అడిగారు. ఏమయ్యా … ఇండస్ట్రీ మద్రాసు నుంచీ తీసుకొచ్చిన వాళ్ల పేర్లలో నాగేశ్వర్రావు గారి పేరు చెప్తారుగానీ మొదటి సారి మొత్తం సినిమా హైద్రాబాద్ లో తీసిన మా అన్న గంగాధరరావుగారి పేరు చెప్పరేంటయ్యా అని కోప్పడ్డారు. అది వేరు సంగతి.
విడుదలైన హరనాథ్ మొదటి సినిమా మా ఇంటి మహాలక్ష్మేగానీ … కెమెరాను ఫేస్ చేసిన తొలి చిత్రం మాత్రం రుష్యశృంగ. అందులో టైటిల్ పాత్రలోనే కనిపించారాయన.ఆ సినిమాకు ప్రముఖ నటుడు ముక్కామల దర్శకుడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆ సినిమా విడుదలలో జాప్యం అయ్యింది. సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
అందుకే హరనాథ్ తొలి చిత్రం అనగానే మా యింటి మహాలక్ష్మనే చెప్తారు. ఋష్యశృంగ, మా ఇంటి మహాలక్ష్మి చిత్రాల తర్వాత అపూర్వచింతామణి, మనోరమ, భక్త శబరి చిత్రాల్లో నటించిన హరనాథ్ కు మంచి గుర్తింపు వచ్చేసింది.సరిగ్గా అప్పుడే … ఎన్టీఆర్ నుంచీ పిలుపొచ్చింది. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించ తలబెట్టిన సీతారామకళ్యాణంలో రాముడు పాత్రకు హరనాథ్ ను ఎంపిక చేశారు.
హరనాథ్ స్పోర్డ్స్ పర్సన్ కూడా క్రికెట్, వాలీబాల్ లాంటి ఆటలు ఆడేవారాయన. ఆయన జీవన విధానంలోనూ క్రీడా స్ఫూర్తి కనిపిస్తుంది. ఆయన ఏనాడూ దేనికీ ఖంగారు పడ్డ వ్యక్తి కాదు. ఏ సందర్భాన్నైనా విషయాన్నైనా స్పోర్టివ్ గానే తీసుకునేవారు. అది కెరీర్ కు సంబంధించిన అంశాలైనా సరే .. దీన్ని కేర్లెస్ నెస్ అన్నవారూ ఉన్నారు. అది ఒకరకంగా వాస్తవం కూడా.
‘మనుషులు మారాలి’ శతదినోత్సవ సభ హైద్రాబాద్ లోనే జరిగింది. ఆ సభలో పాల్గొనడానికి మద్రాసు నుంచీ వచ్చిన హరనాథ్ తాగి పడిపోయి ఫంక్షన్ లో పాల్గొనలేకపోవడం విచారకరం కాక మరేమిటి? హరనాథ్ స్థితిమంతుల కుటుంబం నుంచే వచ్చాడు. స్నేహానికి ప్రాణం పెట్టేవారు. సంపాదించడం కోసం ఆయన నటనా రంగంలోకి రాలేదు. సరదాగానే వచ్చారు.
అవకాశాలు వచ్చినప్పుడు నటించారు. అవకాశాలు రావడం లేదు కనుక అంటూ ఎవరి దగ్గరకూ పోయి పాత్రలు అడగలేదు. తన దగ్గరకు వచ్చి సాయం అడిగిన వారికి కాదనకుండా సాయం చేయడం ఆయన ఆచరించిన సూత్రం.కెరీర్ మీద సీరియస్ దృష్టి లేకపోవడమే ఆయన వెనుకబడడానికి కారణం. తాగుడు ఇవన్నీ కేవలం కారణాలు మాత్రమే. సీతారామ కళ్యాణం సినిమా తర్వాత వరుసగా ఎన్టీఆర్ తో చాలా అవకాశాలు వచ్చాయి.
భీష్మలో శ్రీ కృష్ణుడి వేషం హరనాథ్ తోనే చేయించారు ఎన్టీఆర్. నాదీ ఆడజన్మే , పుణ్యవతి, కలసి ఉంటే కలదు సుఖం, చిట్టిచెల్లెలు , గుండమ్మ కథ ఇలా ఎన్టీఆర్ కాంబినేషన్ లో హరనాథ్ చేసిన సినిమాలన్నీ హిట్టే … తెలుగు తెరకు ఎన్టీఆర్ తర్వాత పురాణ పాత్రలు చేయాలంటే హరనాథే అనే అభిప్రాయాన్ని ఎన్టీఆరే ప్రమోట్ చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనూ హరనాథ్ విఫలయ్యారు.
ఎన్టీఆర్ తోనే కాదు … ఏఎన్నార్ తోనూ కలసి నటించారు హరనాథ్. అక్కినేని తొలి కలర్ సినిమా అమరశిల్పి జక్కన లో హరనాథ్ ఆయన కొడుకు పాత్రలో కనిపించారు. సోలోగానూ అనేక విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడుగా నటించారాయన. అయితే … కేవలం హీరో పాత్రలే చేస్తాను అనే రకం కాదు హరనాథ్ … నటనకు అవకాశం ఉన్న ఏ పాత్ర అయినా చేసేవారు. అది ఆ తర్వాత జనరేషన్ హీరోల్లో కనిపించదు.
డెబ్బైల్లో హరనాథ్ హీరోగా ఆడజన్మ సినిమా వచ్చింది. ఆ సినిమాకు ఆయన జీవితంలో ఓ ప్రత్యేకత ఉంది. ఆ సినిమా నిర్మాత జీవీఎస్ రాజు తో హరనాథ్ కు చాలా సన్నిహిత స్నేహ సంబంధాలుండేవి. . హరనాథ్ ను చాలా అభిమానించిన ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆ చిత్రాన్ని ప్రారంభించారు. ఆడజన్మ నిర్మాత జీవీఎస్ రాజుగారి కుమారుడికే తర్వాత రోజుల్లో తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించారు హరనాథ్ …
హరనాథ్ సినిమా కోసం పనిచేసిన రోజులు తక్కువే. హరనాథ్ కెరీర్ కేవలం పదిహేనేళ్లు. యాభై తొమ్మిది ప్రాంతాల్లో ప్రారంభమై డెబ్బై రెండు నాటికి దాదాపు చివరకు వచ్చేసింది. సినిమా పరిశ్రమలో నిరంతరం కెరీర్ మీద దృష్టి సారించాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తర్వాత తరం తనను దాటి వెళ్లిపోతుంది. హరనాథ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందంటారు దర్శకుడు పి.సిరెడ్డి.
హరనాథ్ తర్వాత స్థానం కోసం పోటీలో ఉన్న శోభన్ బాబు ,కృష్ణ , రామ్మోహన్ తదితరులందరూ హరనాథ్ కాస్త ఏమరుపాటుగా ఉన్న సమయంలో ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత తిరిగి చూసుకునే సరికి వయసు ముంచుకు వచ్చేయడం ఎలానూ తప్పదనుకోండి. తాగుడు కారణంగా షేప్ అవుట్ అయిపోవడం జరిగాయి తప్ప నటుడుగా హరనాథ్ ఫెయిల్ అయిన సందర్భం కనిపించదు. ఆయన నటనను చాలా సందర్భాల్లో ఎస్వీఆర్ కూడా మెచ్చుకోవడం విశేషం.
హరనాథ్ ఏనాడూ స్టార్ డమ్ కోసం పరితపించలేదు. నలుగురితో కల్సిపోయేవారు. నటుడుగా తనను నిలబెట్టే పాత్రలనే ఎంచుకునేవాడు. ఎన్టీఆర్ లో మాత్రమే కనిపించే తెగింపు ఇది. ఆ తెగింపుతోనే సుఖదుఃఖాలులో నెగెటివ్ కారక్టర్ హాయిగా చేసేశారు.
అవును … హరనాథ్ అనగానే తాగుడు గుర్తొస్తుంది. తాగుడు అనగానే హరనాథ్ గుర్తొస్తారు అనే అభిప్రాయం బలంగా ఉండేది. తాగి సెట్స్ మీదకు వచ్చేవారనే మాట కూడా ఉండేది … చాలా పాటల్లో ఆయన చాలా లూజ్ గా కనిపించేవారు. అదంతా మందు ప్రభావమే అని జనమూ అనుకునేవారు. ఆయనతో నటించిన సహ నటీనటులకూ ఈ విషయం అనుభవమే … అయితే హరనాథ్ తండ్రిగా పిల్లలతో చాలా ప్రేమా ఆప్యాయతలతో ఉండేవారు.
ఆయన భార్య భానుమతి కూడా జమీందారీ కుటుంబం నుంచీ వచ్చిన వారే. పెళ్లి నాటికి హరనాథ్ సినిమా హీరోగా నిలదొక్కుకున్నారు.. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు పుట్టారు. పిల్లల పెళ్లిళ్లూ అన్నీ దగ్గరుండే చూసుకున్నారు హరనాథ్ … హరనాథ్ కెరీర్ అరవై దశకం చివరి నాటికే ప్రమాదంలో పడిపోయింది. కొత్త హీరోలు దూసుకువచ్చారు.
కొత్త జానర్లు వచ్చాయి. జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల స్థానంలో క్రైమ్ , కౌబాయ్ చిత్రాలు వచ్చాయి. అయితే … హరనాథ్ ఈ కొత్త జానర్లలోకి ప్రవేశించలేదు. కృష్ణ దాదాపు కొత్త జానర్ల సినిమాలకు అందివచ్చిన హీరోగా దూసుకుపోయాడు. సాంఘిక , పౌరాణిక చిత్రాలతో అగ్రహీరోలు ఎన్టీఆర్ ఎఎన్నార్ బిజీగా ఉండేవారు. హరనాథ్ నెమ్మదిగా తన స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది…
హరనాథ్ కెరీర్ మహా అయితే పదిహేనేళ్లు … డెబ్బై ధశకం ప్రారంభానికే హరనాథ్ పక్కకి వెళ్లిపోయారు. నిజానికి ఆయన అందం నటన బాలీవుడ్ కి సైతం ఆకర్షించింది. ఫిల్మిస్తాన్ వారు నితిన్ బోస్ దర్శకత్వంలో తీసిన ‘హమ్ కహా జా రహా’ సినిమాలో హరనాథ్ హీరో రోల్ చేశారు. అయితే బాలీవుడ్ వారు ఆయన పేరును ప్రకాశ్ గా మార్చారు. …అలా ప్రకాశ్ గా ఆయన నార్త్ ఆడియన్స్ కు గుర్తుండిపోయారు. అంతటి ఇమేజ్ నుంచీ ఆయన ఎందుకు కిందకి జారిపోయారు అనేది అంతుచిక్కని ప్రశ్న.
తాగుడు అనేది ఒక సాకు మాత్రమే అనిపిస్తుంది. స్టేజ్ అనుభవం లేని నటి అని జమున నుంచీ అవార్డు పుచ్చుకోడానికి అంగీకరించని నటుడాయన. ఒక వేళ మారిన సినిమా ధోరణలు నచ్చక దూరమయ్యారా అనే కోణంలోనూ కొందరు ఆలోచనలు చేశారు. తన శరీరంలో వస్తున్న మార్పుల మీద కూడా ఆయన శ్రద్ద పెట్టలేదు. ఆడజన్మ ప్రారంభం నాటికే ఆయన శరీరంలో మార్పులు ప్రారంభమయ్యాయి. హరనాథ్ సొంత నిర్మాణ ప్రయత్నాలూ చేశారు.
గోదావరి జిల్లాలకు చెందిన నెల్లూరుకు చెందిన మిత్రుల సహకారంతో ‘పగడాల పడవ’ సినిమా తీశారు. అది విడుదలకు నోచుకోలేదు. ఈ పడవ గొడవ తో ఎస్వీ క్రిష్ణారెడ్డి గారికీ సంబంధం ఉన్నది . అదో గొడవ. అలాగే మా ఇంటి దేవత సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామ్యం తీసుకున్నారు. ఆ సినిమా కూడా చాలా ఆలస్యంగా విడుదలైంది. కృష్ణ ఆ సినిమాలో ఉచితంగా నటించారు.
విజయనిర్మల తీసిన శంకుతీర్ధంలో ఆయన అతిధి పాత్రలో కనిపిస్తారు. ఆయన చివరి చిత్రం మాత్రం చిరంజీవి నటించిన నాగు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆయన కన్నుమూశారు. హరనాథ్ కెరీర్ అలా ముగిసింది. ఆయన డిసిప్టీన్ తో ఉండి ఉంటే కృష్ణ, శోభన్ బాబులకు అవకాశం ఉండేదా కాదా అనే చర్చలోకి పోనవసరం లేదుగానీ … ఓ మంచి హీరోని మిస్సైయ్యేవాళ్లం కాం అంటారు హరనాథ్ ను అభిమానించేవారు. ప్రేక్షకులకు ఆయనో అందమైన జ్ఞాపకం … ఇండస్ట్రీకి ఓ గుణపాఠం … అలా ఎప్పటికీ చెరిగిపోని సంతకం హరనాథ్.

