కఠారి పుణ్యమూర్తి..…………………………………….
Tennis Star …………………………….
పేపర్లో క్రీడా వార్తలు చదవడం అలవాటు అయ్యాక టెన్నిస్ రంగంలో పరిచయమైన మొదటిపేరు స్టెఫీ…1988లో టీవీలు అందరికీ లేకపోవడంతో, ఆమె ఆట చూడటానికి భీమడోలులో, చుట్టుప్రక్కల అన్ని వీధుల్లో టీవీల కోసం వెతుకుతూ ఉండేవాడిని.. కానీ అప్పట్లో ఎవరూ టెన్నిస్ చూసేవారు కాదు.
అలా వెతుకుతూ ఉండగా మా ఇంటికి రెండు వీధులవతల “జక్కంశెట్టి” వారి ఇంట్లో టెన్నిస్ చూడటం గమనించా… గుమ్మం బయటనుండి బెదురు బెదురుగా లోపలికి చూస్తుంటే, టెన్నిస్ మీద నాకున్న ఇష్టాన్ని గమనించిన ఆ ఇంటివారు నన్ను లోపలికి వచ్చి కూర్చుని చూడమన్నారు.అంతే అప్పటినుంచీ రెండేళ్ల పాటు ప్రతీ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ వాళ్ళింట్లో ఖచ్చితంగా చూసేవాడిని.
ఆడవాళ్లలో స్టెఫీ గ్రాఫ్ తో పాటు గాబ్రియెలా సబాటిని, మార్టీనా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్, మోనికా సెలెస్…మగవారిలో ఇవాన్ లెండిల్, స్టీఫెన్ ఎడ్బర్గ్, బోరిస్ బెకర్, జాన్ మెకన్రో, ఆండ్రీ అగస్సీ, పీట్ సంప్రాస్… ఇలా చాలామంది ఆటగాళ్లు తెలిసారు.
ఇక స్టెఫీ గ్రాఫ్ విషయానికి వస్తే అంత జెంటిల్ ఉమన్ అసలు ఉండనే ఉండరు… వ్యక్తిత్వంతో పాటు టెన్నిస్ ఆటలో అత్యంత ఉన్నత స్థాయి ఆమెది.. కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవం ఆమె… ఎంతలా అంటే, అప్రతిహతంగా గెలుపు బాటలో సాగిపోతున్న ఆమెకి సడన్ గా అడ్డుపడిన మోనికా సెలెస్ ని ఒక దుండగుడు (స్టెఫీ అభిమాని) కత్తితో పొడిచాడు. ఆ సమయంలో స్టెఫీ చాలా బాధ పడింది.
ఆమె నాలుగు సంవత్సరాల వయసులో కోర్టులో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది. ఐదు సంవత్సరాల వయసులో మొదటి టోర్నమెంట్లో ఆడింది. 1982లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లు 12 … 18లను గెలుచుకున్న ఆమె జూనియర్ టోర్నమెంట్లలో సత్తా చాటుకుని బహుమతులు సాధించడం ప్రారంభించింది. తండ్రి పీటర్ గ్రాఫ్ ఆమెకు తొలి కోచ్.
22 గ్రాండ్ స్లామ్ పతకాలు, ఒకే ఏడాది (1988) లో నాలుగు గ్రాండ్ స్లామ్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) సాధించిన అద్భుతమైన ఘనత… అంతేనా… అదే ఏడాది సియోల్ ఒలింపిక్స్ లో బంగారుపతకం నెగ్గి చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన “గోల్డెన్ స్లామ్” కూడా సాధించింది.
తాను జర్మన్ అయినా, తోటి అమెరికన్ ఆటగాడు ఆండ్రీ అగస్సీని పెళ్లి చేసుకుని ఆటకు దూరమయింది…ఈ దంపతులు ‘చిల్డ్రన్ ఫర్ టుమారో’ తో సహా వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. యుద్ధం, ఇతర సంక్షోభాల వల్ల ప్రభావితమైన పిల్లలు వారి కుటుంబాలకు సహాయం చేయడానికి గ్రాఫ్ 1998లో ఎన్జీవో స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
చరిత్రలో ఎంత మంది గొప్ప ఆటగాళ్లు వచ్చినా వాళ్లందరినీ మించిన లెజెండ్ స్టెఫీ గ్రాఫ్ కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు…