భలే పోలీస్ !

Sharing is Caring...

Arrow of criticism………………………….

పోలీస్ వ్యవస్థ పనితీరు పై సంధించిన అస్త్రం ఈ రైటర్ సినిమా. కొత్త కథాంశం. పోలీస్ వ్య‌వ‌స్థ‌లోని లోతు పాతుల‌ను బాగా స్టడీ చేసి తీసిన చిత్ర‌మిది. పోలీస్ అధికారులు అధికార మదంతో కింది స్థాయి ఉద్యోగులను ఎంత హీనంగా చూస్తారో కళ్ళకు కట్టినట్టు చూపారు.

ఉన్న‌తాధికారుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది పోలీసులు ఏ విధంగా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారో ? పోలీస్ డిపార్ట్మెంట్ లో సామాజిక అంత‌రాలు, వివ‌క్ష‌త ఎంత విశృంఖలంగా ఉన్నాయో వివరిస్తూ కథను తెరకెక్కించిన విధానం బాగుంది. అధికారులు త‌మ త‌ప్పులు బ‌య‌టకి రాకుండా అమాయ‌కుల‌పై అక్ర‌మ కేసులుపెట్టి వారిని ఎలా వేధిస్తుంటారో అన్న పాయింట్ ను ఎలివేట్ చేస్తూ ఈ సినిమా కథ నడుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో యూనియన్ ఉండాలని కోరుకున్న రంగరాజే కథలో ప్రధాన పాత్రధారి.

సినిమా మొదట్లో కొంచెం బోర్ అనిపించినా అసలు కథ లోకి వెళ్ళాక ఆసక్తికరంగా సాగుతుంది.కథలో ఊహించని మలుపులు .. ట్విస్టులు ఉన్నాయి. దర్శకుడు పా రంజిత్ నిర్మాతలలో ఒకరు కాబట్టి ఆయన మార్క్ సినిమా లో కనిపిస్తుంది.

పోలీస్ వ్యవస్థలో చెడ్డ వాళ్ళు .. మంచి వాళ్ళు కూడా ఉంటారని చెబుతూ కథను బ్యాలన్స్ చేశారు.
రంగరాజు క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. డీసీపీ క్యారెక్టర్ ను అదే విధంగా పట్టుకొచ్చారు. పోలీసుల ప్రవర్తన ఎలా ఉంటుంది ? వారి మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి? పై అధికారుల మాటను కాదనలేక కింది స్థాయి ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడతారో కూడా బాగా చూపారు.

డైరెక్టర్  పాత్రలను చక్కగా మలుచుకున్నారు. సన్నివేశాలు .. డైలాగులు సహజంగా ఉన్నాయి.
ఈ సినిమాతో ఫ్రాంక్లిన్ జాకబ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా కు మంచి కథాంశం ఎంచుకున్నారు.

విలక్షణ నటుడు సముద్ర ఖని రంగరాజు పాత్రలో జీవించాడు. ఆ పాత్రకు ఆయన కరెక్ట్ గా సూట్ అయ్యాడు. డీసీపీ క్యారెక్టర్ చేసిన కవిన్ జయబాబు కూడా విలనీ ని బాగా పండించాడు. దర్శకుడు ఆ రెండు క్యారెక్టర్ల పై ఫోకస్ పెట్టారు. ఇతర పాత్రధారులు తమ పరిథిలో బాగా నటించారు.

చివరి ముప్పై నిమిషాలు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. మ్యూజిక్ .. ఫోటోగ్రఫీ బాగున్నాయి.
గత ఏడాది డిసెంబర్ లో తమిళనాడులో విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతోంది. చూడని వాళ్ళు చూడవచ్చు. మసాలా లేని సినిమా కాబట్టి అందరికి నచ్చదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!