రెండేళ్ల క్రితం విడుదలైన ఈ రణసింగం సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే …..
చిన్నపల్లెటూర్లో ఉండే రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఊరిలో సమస్యల కోసం తను ముందుండి పోరాడుతుంటాడు.అతని తీరు నచ్చడం తో హీరోయిన్ ఐశ్యర్వ రాజేష్ రణ సింగం ను ప్రేమిస్తుంది. తర్వాత ఇద్దరి పెళ్లి అవుతుంది.
ఒక బిడ్డ పుట్టిన తర్వాత…..రణసింగం దుబాయ్ కి ఉద్యోగం కోసం వెళతాడు. అక్కడ అనుకోని పరిస్థితులు ఎదురు అవుతాయి. రణసింగం పనిచేసే పరిశ్రమ లో గొడవల వలన అతను చనిపోతాడు. అతగాడి మృతదేహాన్ని తిరిగి రప్పించాలంటే అది కుదరదు… మరి హీరోయిన్ ఎలా పోరాడింది.. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది అన్నదే కథ. క్లైమాక్స్ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఊహించని ట్విస్ట్ కూడ పెట్టారు.
సినిమా కోసం రచయిత దర్శకుడు బాగానే వర్క్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు ఎంత ఘోరంగా పని చేస్తుంటాయో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఆ సన్నివేశాలన్నీ ఆకట్టుకునే విధంగా దర్శకుడు తెరకెక్కించారు. అక్కడక్కడా డ్రామా పాళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాలో అనవసరమైన పాత్రలు ఎక్కడా కనిపించవు.
గల్ఫ్ దేశాలలో పనిచేసే భారతీయ పౌరులు ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాన్నిఇండియా కు తీసుకురావడం లో ఎదురయ్యే సమస్యల చుట్టూ కథ అల్లుకుని 3 గంటల సినిమాను నడిపించడం అంటే మాటలు కాదు. దర్శకుడు ఆ సాహసం చేయడం గొప్పవిషయమే.
రణసింగం పాత్రలో విజయ్ సేతుపతి బాగా నటించాడు. రోల్ చిన్నదే అయినా కథ అంతా అతని పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అతని భార్య పాత్రలో ఐశ్యర్వ రాజేష్ జీవించింది. కరెక్ట్ గా ఆ పాత్రకు ఆమె సూట్ అయింది. రెండో భాగం అంతా కథను ఐశ్యర్వ రాజేష్ నడిపిస్తుంది. ఒక విధంగా వన్ విమెన్ షో అనే చెప్పుకోవాలి. సంగీతం.. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉన్నాయి.
సామాన్యుడు ఎదుర్కొనే కొన్ని ముఖ్యమైన సమస్యలను కథలో చొప్పించారు దర్శకుడు పి విరుమండి. అయితే సినిమా నిడివి ఎక్కువ గా ఉంది. కొంత తగ్గించి తీస్తే బాగుండేది. రొటీన్ మసాలా సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా నచ్చదు. సీరియస్ సినిమాలు చూసే వాళ్లకు నచ్చుతుంది. రొటీన్ మూవీస్ చూసే వాళ్ళు కూడా ఒకసారి చూడొచ్చు. ఐశ్యర్వ రాజేష్ పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి సినిమా చూడొచ్చు.
యు ట్యూబ్ లో తెలుగు వెర్షన్ ఉంది. జీ లో కూడా ఉంది. ఆసక్తి గల వారు చూడొచ్చు.