“కుంభకోణం డిగ్రీ కాఫీ “వెనుక కథేమిటి ?

Sharing is Caring...

Tasty Coffee……………………… 

కుంభకోణం డిగ్రీ కాఫీ.ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యానికి నోచుకుంది. ఎందరో ఈ డిగ్రీ కాఫీ తాగుతున్నారు కానీ చాలామందికి దాని ప్రత్యేకత ఏమిటో తెలియదు. ఈ డిగ్రీ కాఫీ గురించి పలు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ మూలాలు  తమిళనాడులోని కుంభకోణం లో ఉన్నాయి.

తంజావూరు జిల్లా లో ఈ కుంభకోణం ఉంది. 1950—1960 మధ్యకాలంలో పంచమి అయ్యర్ అనే ఒకతను కుంభకోణంలో హోటల్ నడిపే వాడు. ఆయన తన కస్టమర్లకు రుచికరమైన కాఫీని అందించేవాడు. కాఫీలో ప్రధానంగా మూడు పదార్థాలు ఉంటాయి. అవి పాలు, డికాషన్, చక్కెర. ఇవన్నీ తగుపాళ్లలో కలిస్తేనే కాఫీ రుచికరంగా తయారవుతుంది. 

పంచమి అయ్యర్ పాలలో నీరు కలపకుండా నాణ్యమైన పాలను కాఫీ కలపడానికి ఉపయోగించేవాడు. అతని హోటల్ పెరట్లో చాలా ఆవులు ఉండేవి.నాణ్యమైన పాలకోసం అతగాడు ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ నుంచి ఆవులను తీసుకొచ్చాడు. టేబుల్ మీద లాక్టోమీటర్ పెట్టుకునేవాడు. పాల నాణ్యతపై అనుమానం వస్తే స్వచ్ఛతను తెలుసుకోవడానికి లాక్టోమీటర్‌ను ఉపయోగించేవాడు.

పంచమి అయ్యర్ కాఫీ తయారు చేయడానికి ఆవు పాలు మాత్రమే ఉపయోగించేవాడు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ పాలు వాడేవాడు. అలాగే  నాణ్యమైన కాఫీ గింజలను పొడి చేయించి .. తగుపాళ్లలో చికోరీ మిశ్రమాన్నికలిపి ఇత్తడి ఫిల్టర్ లో వేసి డికాషన్ తయారు చేసేవాడు. అయ్యర్ మంచి రుచి కోసం పరిమిత పరిమాణంలో చక్కెరను కలిపేవాడు.

అయ్యర్ దగ్గర కాఫీ తాగేందుకు ఆరోజుల్లోనే పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఆలా అలా ఆ కాఫీ కి కుంభకోణం కాఫీ అనే పేరు వచ్చింది. ఇక డిగ్రీ అనే పేరు రావడానికి ఒక చిన్న వివరణ ఉంది. స్వచ్ఛమైన పాలను డిగ్రీ పాలు అంటారు. అంటే లాక్టో మీటర్ తో నాణ్యతను నిర్ణయించిన పాలు అని అర్ధం. ఇక డిగ్రీ కాఫీ అంటే  స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన కాఫీ అని అర్ధం. కాగా మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. కాఫీ పొడిలో కలిపే చికోరీ ని టికేరి అని ఉచ్ఛరిస్తారు. అదే కాలక్రమంలో డిగ్రీ అయిందని అంటారు.

మొత్తం మీద ఆ విధంగా కుంభకోణం డిగ్రీ కాఫీ చాలా రాష్ట్రాల్లోకి ప్రవేశించింది. ఆ కాఫీ కి ఒక బ్రాండ్ కూడా ఏర్పడింది. కుంభకోణం పేరిట కాఫీ పౌడర్ కూడా మార్కెట్లోకి వచ్చింది. కుంభకోణం డిగ్రీ కాఫీ పేరిట స్టాల్స్ పెట్టిన వారిలో చాలామందికి కూడా ఈ బ్రాండ్ వెనుక కథ పూర్తిగా తెలియదు. ఈ డిగ్రీ కాఫీ హోటళ్లు ఎక్కువగా హైవే మీద కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ డిగ్రీ కాఫీ షాపులు వెలిశాయి. 

Note……… కాఫీ రుచికరంగా ఉండటానికి కొన్ని చోట్ల పొడిలో నల్లమందు కలుపుతారని కూడా అంటారు 

——KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!