తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ సారి 150 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని కమల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టారు. పార్టీకి తమిళనాట పెద్దగా బలం లేకపోయినా కొన్ని చోట్ల చోటామోటా లీడర్లు ఉన్నారు.
వీరందరితో కమల్ చర్చలు కూడా జరుపుతున్నారు. సొంతంగా గెలిచే అవకాశాలు తక్కు వగా ఉన్న దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే యోచన కూడా కమల్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అన్నాడీఎంకే , డీఎంకే లను మినహాయించి ఇతర చిన్నపార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చని కమల్ భావిస్తున్నారు. మిత్రుడు రజనీకాంత్ పెట్టె పార్టీ తో కూడా పొత్తు పెట్టుకుంటామని ఇదివరకే ఆయన చెప్పారు. అలాగే విజయకాంత్ సారధ్యంలోని డీఎండీకే ను కూటమిలో చేర్చుకోవాలని యోచిస్తున్నారు. ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమౌతున్నారు.
అయితే కూటమి వర్కౌట్ కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో కమల్ కొంత డైలామాలో ఉన్నారు. ఒక వేళ కూటమి కి ఇతర పార్టీలు సై అని ముందుకొస్తే మొత్తం 234 స్థానాలకు గాను 150 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి మిగిలినవి ఇతరులకు ఇవ్వాలని కమల్ యోచన. పార్టీ విజయావకాశాలపై సర్వే చేయించగా 50 చోట్ల అనుకూల వాతావరణం ఉందని ఫలితాలు వచ్చాయట. కాగా ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాకపోతే సొంతంగా పోటీ చేయాలని కమల్ భావిస్తున్నారు.
ఇక గత మూడేళ్లుగా అధికార అన్నాడీఎంకే పైనే గురిపెట్టి విమర్శలతో దుయ్యబట్టిన కమల్ డీఎంకే పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. ఆ పార్టీ పై ఒకటి అరా సందర్భాల్లో తప్ప పెద్దగా విమర్శలు చేయలేదు. ఆ మధ్య స్టాలిన్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో ఉండగా కమల్ వెళ్లి పలకరించి వచ్చి వచ్చారు. ప్రస్తుతానికి కమల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా…. పైకి ఎన్ని మాటలు చెప్పినా .. ఎన్నికల నాటికి డీఎంకే తో పొత్తుకు వెళ్లవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్ సయోధ్యకు అనుమతిస్తే కమల్ పంట పండినట్టే. పార్టీ మనుగడ సాధించాలంటే కనీసం నలుగురైదుగురు ఎమ్మెలు ఉండాలి కదా. అదే లక్ష్యంగా కమల్ డీఎంకే తో కలసి పనిచేస్తారని అంటున్నారు. రెండు మూడు ఆప్షన్స్ ను పెట్టుకుని చివరికి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు.
కాగా అభిమానులున్న చోట ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ని అభివృద్ధి చేయాలని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎన్నికల ఇంచార్జ్ లను కూడా నియమించారు. వారితో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. ఆర్ధిక బలం ఉండి ,పార్టీ కార్యకర్తలను కలుపుకొని దూసుకుపోగల నేతలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక 2019 లోక సభ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసికనీస ప్రభావం చూపలేకపోయింది . పార్టీ 36 చోట్ల పోటీ చేసి డిపాజిట్లు దక్కించుకోలేకపోయిం ది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కమల్ ఈ సారి ఆటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆయన సన్నిహితులు కూడా డీఎంకే తో పొత్తు మంచిదని చెబుతున్నారట. అన్నాడీఎంకే సర్కార్ పట్ల జనంలో అసంతృప్తి ఉంది కాబట్టి ఈ సారి స్టాలిన్ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇవన్నీ కమల్ గమనిస్తున్నారు. రజనీ కాంత్ అయితే అదిగో ఇదిగో అంటున్నారు కానీ పార్టీ ప్రకటించే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. రజనీ తో పోలిస్తే కమల్ ముందంజలో ఉన్నట్టు లెక్క. ఓటర్లు ఆయనను ఆదరిస్తారో ? లేదో ? చూడాలి.
Read also Rajani kanth పొలిటికల్ ఎంట్రీ పై డైలమా !
———— KNMURTHY