మనసుకు హత్తుకునే సినిమా !

Sharing is Caring...

Police atrocities against tribals……………………………………..

కొన్ని సినిమాలు మనస్సుకి హత్తుకుంటాయి .. కొన్ని సినిమాలు ఆకట్టుకుంటాయి . మొదటి కోవకు చెందిన సినిమా ఈ జైభీమ్. గిరిజనులపై పోలీసుల అరాచకాలు .. లాకప్ డెత్ వంటి కథాంశం తో నిర్మించిన చిత్రం ఇది. 1993 లో తమిళనాడులో జరిగిన న్యాయ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పుట్టుకతోనే నేరప్రవృత్తి కలిగిన జాతి అని ముద్రపడిన అణగారిన వర్గాల కోసం .. ఒక గిరిజన మహిళ కు న్యాయం చేసేందుకు చంద్రు అనే సీనియర్ న్యాయవాది చేసిన నిజ జీవిత పోరాట కథే ఈ జై భీమ్ సినిమా.

సూర్య ఇందులో చంద్రు పాత్ర పోషించారు. సూర్య వంటి పాపులర్ హీరో నటించడంతో ఈ సినిమా పట్ల ఓ క్రేజ్ ఏర్పడింది. దర్శకుడు జ్ఞానవేల్ తా సే కథను అద్భుతంగా తెరపై కెక్కించారు. గిరిజన తెగకు చెందిన రాజన్న పొలాల్లో పాములు ..ఎలుకలు పడుతుంటాడు.గ్రామంలోని ఓ ప్రముఖుడి ఇంట్లో పాము దూరితే దానిని పట్టుకుని అడవుల్లో వదులుతాడు.

ఆ తర్వాత రాజన్న పని కోసం వేరే వూరు వెళతాడు. ఓ రోజు ప్రముఖుడి ఇంట్లో దొంగలు పడతారు. నగలు దోచుకెళతారు. రాజన్నపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులు రాజన్న బంధువులను.. భార్యను చావ చితకగొడతారు. ఈక్రమంలోనే  ఊరు నుంచి వచ్చిన రాజన్నను పోలీసులు చేయని నేరాన్ని ఓప్పుకోవాలని లాకప్‌లో చిత్రహింసలు పెడతారు.

ఆ తర్వాత రాజన్నతోపాటు మరో ఇద్దరు లాకప్‌ నుంచి పారిపోయారని కేసు నమోదు చేస్తారు.తన భర్త రాజన్న కనిపించడం లేదని సినతల్లి అడ్వకేట్ సూర్య ను కలుస్తుంది. అక్కడ నుంచి కథ పలు మలుపులు తిరుగుతుంది. గర్భిణీ అని కూడా చూడకుండా పోలీసులు సినతల్లి ని హింసిస్తారు. ఈ పాత్రలో లిజో మోల్ జొస్ చక్కగా ఒదిగిపోయింది. అత్యంత సహజంగా నటించింది. సినిమాలో ఇదే ప్రధాన పాత్ర. కథ అంతా సినతల్లి చుట్టూనే తిరుగుతుంది. 

ఇక లాకప్ లో రాజన్నపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీన్లు గుండెను మెలిపెడతాయి. హింస పాళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా వాస్తవాలకు దగ్గరగానే ఉంది. కొన్ని సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కోర్టు విచారణ సన్నివేశాలు మరి బోర్ కొట్టకుండా .. వాదనలు ఆసక్తికరంగా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. కథా గమనం పై దర్శకుడు బాగా కసరత్తు చేశారు. సన్నివేశాల కూర్పు బాగుంది.

దర్శకుడు సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ .. కథ బిగి సడలకుండా నడిపారు. పోలీసుల అకృత్యాలను కళ్ళకు కట్టినట్టు చూపారు. అలాగే మంచి పోలీసులు ఉంటారు అని ఒక పాత్రను చూపారు. హీరో సూర్య చంద్రు పాత్రకు న్యాయం చేసాడు. తానే నిర్మాత అయి కూడా  పాటలకు .. ఫైట్స్ కు అవకాశం ఉన్నప్పటికీ వాటిని స్కిప్ చేయడంతో సినిమాలో సీరియస్ నెస్ కంటిన్యూ అవుతుంది.

ప్రకాష్ రాజ్ పాత్ర నిడివి తక్కువైనా చక్కని హావభావాలను ప్రదర్శించాడు. రావు రమేష్ పాత్ర కూడా బాగుంది. రాజన్న పాత్రలో మణికందన్ సహజంగా నటించాడు.  షాన్‌ రొనాల్డ్‌ సంగీతం ఎస్‌.ఆర్‌. కాదిర్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న జైభీమ్ ను కుటుంబ సమేతంగా చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!