Funny Articles …………………………………… అపుడెప్పుడు ఆర్కే బహు తమాషా కథనాలు వండించి వడ్డిస్తుంటారు. వాటిలో ఇదొకటి. “టీకొట్టు దగ్గరో, రచ్చబండ దగ్గరో జనం మాట్లాడుకునే విషయాల్లోకి ఒక అపరిచితుడు జొరబడతాడట . రాజకీయాల ప్రస్తావన తెచ్చి ముందుగా .. జగన్‌ను విమర్శిస్తాడు. అవతలి వారి మూడ్‌ను గమనించి ..‘జగన్‌కు ఒక్క చాన్స్ ఇచ్చి తప్పు చేసేశాం . చంద్ర బాబు మంచి నాయకుడు. ఆయన వల్లే రాష్ట్రం బాగుపడుతుంది అంటాడట.
ఈసారి ఎన్నికల్లో ఆయనే రావాలి’ అనే దిశగా చర్చ సాగితే మటుకు ఆ అపరిచితుడు మళ్ళీ గొంతు సవరించుకుని ‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కానీ… చంద్రబాబుకు వయసు అయిపొయింది. ఈసారి గెలిచినా సీఎం గా ఉండడు. కుమారుడు లోకేశ్‌ను సీఎం చేస్తాడు!’ అని ఓ మాట అలా వదులుతాడట . చర్చలో మిగిలిన వాళ్లు ఆలోచనలో పడి… అదే మాట మరో పదిమందికి చెబుతారు!
ఇందులో అసలు విషయం ఏమిటంటే… ఆ ‘అపరిచితుడు’ మరెవరో కాదు! వైసీపీ వారి వ్యూహకర్త పీకే బృందంలో సభ్యుడు! గతంలో సోషల్ మీడియా, తప్పుడు ప్రచారం అనే వ్యూహాన్ని అనుసరించిన ఆ బృందం ఈసారి నేరుగా జనంలోకి దిగి ‘మౌత్ పబ్లిసిటీ’ పేరిట ఈ తరహా అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందట. ఒకే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం! సోషల్ మీడియాలో లక్షల కొద్దీ ఖాతాలు సృష్టించి… తప్పుడు ప్రచారం చేయడం! సొంత మీడియాను ఉపయోగించుకుని అసలు విషయాలను వక్రీకరించి బాబు అధికారంలోకి రాకుండా చేయడానికి వైసీపీ కుట్ర చేస్తుందని ఆర్కే అభియోగం.”
పైకథనం చదివితే .. నిజంగా పీకే కి ఈ ఐడియా ఉందొ లేదో తెలీదు కానీ ఆర్కే నే ఇలా చేయండి అని చెప్పినట్టుంది ..చంద్రబాబు పెద్ద వాడు అయ్యాడన్నది జగమెరిగిన సత్యం. మళ్ళీ ఆవిషయాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా ? ఆ వయసు వాళ్ళు సీఎం గా చేయలేదా ? జ్యోతి ఏదో రాయబోయి మరేదో రాసేసింది.
సహజంగా ఇలాంటి కథనాలు ఆర్కే అనుమతి లేకుండా బయటికీ రావు. అందులో సందేహమే లేదు. జ్యోతి రాసిన కథనం స్లగ్ “టార్గెట్ బాబు”.. కానీ టార్గెట్ అయింది యువ నాయకుడు లోకేష్. పార్టీ గెలిస్తే లోకేష్ పగ్గాలు చేపడితే ఏమవుతుంది ? ప్రజలు ఎన్నుకుంటే ఏదైనా జరగవచ్చు. అతగాడేదొ కష్టపడుతూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతున్నాడు.
పాద యాత్ర కూడా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఈ టైం లో లోకేష్ ఉత్సాహం పై నీళ్లు పోశారు. ఈ కథనం ద్వారా ఏం చెప్పారు. లోకేష్ సీఎం కాడు .. పార్టీ గెలిస్తే చంద్రబాబే సీఎం అవుతారు అని ఇన్ డైరెక్టుగా రాసుకొచ్చారు. పాపం లోకేష్ తప్పేమి చేశారు. మధ్యలో అతగాడిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉన్నదా ? అతగాడి పేరు లేకుండానే వార్తా కథనం రాయొచ్చు.
ఎన్నికలు రాకుండానే .. పోటీ చేయకుండానే లోకేష్ అసమర్ధుడు అనే ముద్ర వేశారు. ఈ కథనం చదివి లోకేష్ తండ్రి తో గొడవ పడేలా చేశారు.తండ్రిపై కోపం పెంచుకునేలా చేశారు. లోకేష్ వర్గీయులు ఈ కథనం పై భగ్గు మంటున్నారట పీకే వ్యూహం సంగతి పక్కన బెడితే ఆర్కే వ్యూహాలతోనే చంద్రబాబు నష్టపోయేలా ఉన్నాడు.
గత ఎన్నికల్లోనూ తప్పు దారి పట్టించారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఎన్నికల్లో రకరకాల వ్యూహాలు పార్టీలు అనుసరిస్తాయి. మిగిలిన సమయాల్లోనూ వ్యూహాత్మకంగానే విమర్శలు చేస్తుంటాయి. జగన్ లక్ష కోట్లు కాజేసాడు. అతగాడొక ఉగ్రవాది అంటూ బాబు రోజూ విమర్శలు చేస్తుంటారు. ఎన్నికల్లోనూ అదే చెప్పారు. జనం నమ్మారా ? సోషల్ మీడియాలో ఖాతాలు కేవలం వైసీపీకి మాత్రమే ఉన్నాయా ? టీడీపీ కి లేవా ? ఎవరో ఏదో చేస్తారని ముందుగా లేనిపోని కథనాలు రాసి పార్టీ కి ఆర్కే డ్యామేజ్ చేస్తున్నారని పార్టీ నాయకుడు ఒకరు వాపోయాడు.