Bharadwaja Rangavajhala………………………………………..
మన తెలుగు సినిమాల్లో ప్రవేశించిన నెల్లూరు వస్తాదు నెల్లూరు కాంతారావుగారి గురించి కాసేపు మాట్లాడుకుందామే …జనవరి 24 , 1931 లో నెల్లూరులో పుట్టిన కాంతారావు చిన్నప్పట్నించి వ్యాయామం చేస్తూ … బాడీ బిల్డర్ గా పాపులార్టీ సాధించారు. అనేక కుస్తీపోటీల్లో పాల్గొన్నారు. ఎందరో వస్తాదులతో ఆయన తలబడ్డారు. ఆయనకి ఆంధ్రా టైగర్ అనే బిరుదు ఉండేది.
ఆనక ఆయన సినిమాలు తీయాలనుకున్నప్పుడు బేనర్ పేరు టైగర్ ఫిలింస్ అని పెట్టుకోడానికి అదే కారణం …1950 ప్రాంతాల్లో నెల్లూరు వీఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన అనేక మల్లయుద్ద పోటీల్లో ఆయన విజయం సాధించారు. కింగ్ కాంగ్ , దారాసింగ్ లాంటి మల్లయోధులు సైతం ఈ పోటీల్లో పాల్గొన్నారని కాళిదాసు పురుషోత్తంగారి ఉవాచ.
నేను నెల్లూరు కాంతారావును మొదటి సారి చూసింది …బొబ్బిలియుద్దం సినిమాలో …అందులో విజయనగరం తరపున కుస్తీపోటీల్లో పాల్గొని బొబ్బిలి మల్లయోధుల్ని మట్టి కరిపించే వస్తాదు అప్పలస్వామి గా కనిపిస్తారు. ఫైనల్ గా బొబ్బిలిపులి తాండ్రపాపారాయుడు ఎస్వీరంగారావు నెల్లూరు కాంతారావును మట్టి కరిపిస్తాడనుకోండి ..అది వేరు విషయం.
ఇలా కుస్తీ పోటీల్లో పాల్గొంటూన్న కాంతారావు ని సినిమాల్లోకి ప్రవేశపెట్టినది .. ఎన్టీఆర్ కు చెందిన నిర్మాణ సంస్థ స్వస్తిశ్రీ ఫిలింస్ ..ఈ బ్యానర్ లో రేచుక్క పగటిచుక్క అనే ఒక్క చిత్రాన్నే నిర్మించారు ఎన్టీఆర్. ఈ బ్యానర్ వెనుక కథేంటంటే … విజయానాగిరెడ్డిగారు ఎన్టీఆర్ తో భాగస్వామ్యం కల్సి ఈ బ్యానర్ ప్రారంభించారు.
ఆ మైత్రి ఈ ఒక్క సినిమాకే పరిమితం కావడం విషాదం.లాభం వస్తే వాటాలేయండి నష్టం వస్తే మాత్రం మీరే భరించాలి అని నాగిరెడ్డిగారు అన్నారని … అందుకే ఆ బ్యానర్ లో రెండో సినిమా రాలేదనీ అనేవాళ్లూ ఉన్నారుగానీ …నాకు పెద్దగా తెల్దు. అదిగో మళ్లీ కాంట్రోవర్సీల్లోకి పోతున్నా … వద్దు వద్దు … మనం మన నెల్లూరు కాంతారావు దగ్గరకు వచ్చేద్దాం.
అలా రేచుక్క పగటి చుక్క సినిమాతో 1959 లో చిత్ర ప్రవేశం చేసిన నెల్లూరు కాంతారావుగారు చేస్తే వస్తాదు పాత్రలో లేక విలన్ పాత్రలో చేశారు.68 తర్వాత తెలుగులో జానపదాల హవా కాస్త తగ్గి క్రైమ్ సినిమాల హడావిడి మొదలైంది.సరిగ్గా ఇక్కడే నెల్లూరు కాంతారావు అవసరం ఇండస్ట్రీకి పెరిగింది.
క్రైమ్ సినిమాల్లో నెల్లూరు కాంతారావు గుండుబాస్ లాంటి పాత్రలు చేయడం మొదలెట్టారు.లో యాంగిల్ లో నున్నటి గుండుతో నెల్లూరు కాంతారావు కొంత విచిత్రంగా భయమేసేలా కనిపించేవారు. రేచుక్క పగటి చుక్క తర్వాత నర్తనశాల చిత్రంలో నటించారు.
ఆ తర్వాత డూండీగారు వి.మధుసూదనరావు దర్శకత్వంలో తీసిన వీరాభిమన్యు చిత్రంలో ఘటోత్కచుడుగా కనిపిస్తారు నెల్లూరు కాంతారావు. జానపదాల్లో మాంత్రికుడు తరహా పాత్రల్లోనూ నటించే ప్రయత్నం చేసినా క్రైమ్ సినిమాలే ఆయనకి బాగా గిట్టుబాటయ్యాయి.
నెల్లూరు కాంతారావు పైకి గంభీరంగా కనిపించినా చాలా స్నేహ హృదయుడు. క్రైమ్ సినిమాల హవా మొదలయ్యాక డూండీ , క్రిష్ణలతో స్నేహం మొదలైంది. ఆ స్నేహంతోనే నెల్లూరుకు చెందిన తన స్నేహితుడు హుస్సేన్ భాగస్వామ్యంలో సొంత చిత్ర నిర్మాణం ప్రారంభించారు.
నెల్లూరులో చాలా పాపులర్ థియేటర్ కనకమహల్ భాగస్వాముల్లో నెల్లూరు కాంతారావు కూడా ఒకరు. జనం మాత్రం నెల్లూరు కాంతారావు సినిమా హాలుగానే చెప్పుకునేవారు.అలా ఎగ్జిబిటర్ గానూ సినిమా నిర్మాతగానూ ఆయన ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
కృష్ణ హీరోగా అసాధ్యుడు, అఖండుడు సినిమాలు తీశారు. అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన తమిళ అనువాద చిత్రం సర్వర్ సుందరం ఆయన నేతృత్వంలో డబ్ అయినదే.
చాలా పెద్ద విజయం సాదించిందా సినిమా. దక్షిణ భారత నిర్మాతలు తీసిన హిందీ చిత్రాల్లో కూడా నెల్లూరు కాంతారావు నటించారు. అలాగే కొన్ని తమిళ సినిమాల్లోనూ ఆయన కనిసిప్తారు. నెల్లూరు కాంతారావుగారు వామపక్షవాది. మొదట ఉమ్మడి కమ్యునిస్ట్ పార్టీతో ప్రయాణించిన ఆయన తర్వాత పార్టీ చిలినప్పుడు సిపిఎం వైపు వచ్చారు.
ఈ పరిణామాల్లో సహజంగానే ఆయన వారసులు నక్సల్బరీ రాజకీయాల వైపు వచ్చారు. నెల్లూరు కాంతారావు సోదరుడి కుమారుడు పురంధర్ పీపుల్స్ వార్ పార్టీకి నెల్లూరు జిల్లాలో పెద్దదిక్కు. జననాట్యమండలి బాధ్యతలు చూసేవారు.
ఈ మధ్యనే అమరులైన పురంధర్ ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపుల్స్ వార్ నిర్వహించిన అనేక సభలకు భోజన సదుపాయాలు కల్పించారు. చాలా స్నేహశీలి. అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. నిర్బంధాలు ఎదురైనా చివరి వరకూ ఆయన నమ్మిన సిద్దాంతం వైపే ఉన్నారు.
ఆ మధ్య ఎపిసిఎల్సి ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరిగినప్పుడు పురంధర్ ను చివరిసారి కల్సాను. అప్పట్లో పురంధర్ కు ఉత్తరాలు రాసేవాళ్లం కదా … అడ్రస్ చాలా ఈజీ…. కేరాఫ్ కనకమహల్ అంటే ఉత్తరం వెళ్లిపోయేది.
నెల్లూరు కాంతారావుగారితో కల్సి సినిమాలు తీసిన హుస్సేన్ చాలా గ్యాప్ తర్వాత కృష్ణతోనే ఎనభై దశకంలోప్రేమనక్షత్రం సినిమా తీశారు. కొమ్మూరి వేణుగోపాల్రావుగారి నవల ఆధారంగా తీసిన ఈ సినిమకు పర్వతనేని సాంబశివరావుగారు దర్శకత్వం వహించారు. జంధ్యాల డైలాగులు బాగా రాశారు.
క్రిష్ణ , శ్రీదేవి ఉన్నప్పటికీ సినిమా పెద్దగా ఆడలేదు. దాదాపు అలాంటి లైన్లోనే వచ్చిన పెళ్లి పుస్తకం హిట్ అవడం విశేషం. మిస్సమ్మ పోలికలు ఈ పెళ్లి పుస్తకాన్ని విజయపథంలో నడిపించిందేమో అని అనుమానం.ఈ సినిమాకు కథకుడు రావి కొండలరావు.
నెల్లూరు కాంతారావు గారు సామాన్యుడైన మల్లయోధుడు కాదు. 1952లో ఇండియా ఒలింపిక్ గేమ్స్ కు మద్రాసు రాష్ట్ర ప్రతినిధిగా హాజరయ్యారు. అలాగే … 1956లో పోలాండ్ దేశం వార్సాలో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్‌కు భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు. 1970 అక్టోబర్ నెల ఎనిమిదో తేదీన నూజివీడు ఆసుపత్రిలో మరణించారు. స్క్రీన్ మీద ఆయన ప్రజెన్స్ భలే ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఆ తర్వాత అంత షార్ప్ లుక్స్ తో ఎవరూ కనిపించలేదు.
పెద్ద పెద్ద పాత్రలు చేయకపోయినా … నటుడుగా ఆయన తక్కువ వాడేం కాదు. ఆయన తీసిన అసాధ్యుడు సినిమాలో ఓ పాటలో కృష్ణ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారు. ఆ స్పిరిట్ తోనే తర్వాత ఆయన అల్లూరి సీతారామరాజు తీశారు. తను తీసే చిత్రాల కథల విషయంలోనూ, పాటల దగ్గర నుంచీ దగ్గరుండి చూసుకునేవారు నెల్లూరు కాంతారావు.
ముళ్లపూడి వెంకటరమణ కోతి కొమ్మచ్చిలో నెల్లూరు కాంతారావుగారి ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. తన పెళ్లికే వెడుతూ … రైలు బయల్దేరాక ప్లాట్ ఫామ్ మీదకు వచ్చిన రమణగారు పరుగెత్తుకెళ్లి ఓ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎక్కేశారట.ఆ తర్వాత ఆ కంపార్ట్ మెంటు నుంచీ దిగాల్సి వచ్చింది..
డబ్బులున్న బ్యాగు భోగీలోనే మర్చిపోవడంతో … ఆ బ్యాగు అదే కంపార్ట్ మెంట్లో ఉన్న నెల్లూరు కాంతారావుగారు భద్రంగా నెల్లూరు చేర్చి కనకమహల్ లో పడేశారు. ఆ తర్వాత రమణగారు ఆ బ్యాగును కనకమహల్ దగ్గరే సాదించి అందులో డబ్బులు భద్రంగా ఉండడం చూసి హాశ్చర్యం పడిపోవడం … తిరిగి పెళ్లి మండపం దిశగా పరుగులు పెట్టడం కథంతా అందులో చదవవచ్చు.
అసలు ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే … నెల్లూరు మాస్టారు పురుషోత్తం కాళిదాసుగారు తన జ్ఞాపకాలు ఏదో వెబ్ పత్రికలో రాస్తున్నారు కదా … అందులోకి నెల్లూరు కాంతారావు ఫొటోలు కావాలని అడిగితే పంపాను…అప్పుడు ఈ కుర్రాడి గురించోసారి ప్రపంచకానికి గుర్తు చేస్తే బావుంటుంది కదా అని అనిపించి ఇలా మీతో పంచుకుంటున్నానన్నమాట .
అన్నట్టు మర్చిపోయా విఎస్సార్ స్వామి ని ఇండస్ట్రీ కి పరిచయం చేసింది నెల్లూరు కాంతారావు గారే… అసాధ్యుడు సిన్మా తో…
ఈ పక్కన ఉన్న ఫొటోలో ఆయన అంతస్తులు సిన్మా లో భానుమతి, రేలంగి, రమణారెడ్డి లతో ఉన్నది…