రోడ్ల మరమ్మతుకు ఆయనలా ముందుకొచ్చే వారెందరు ??

Sharing is Caring...

రోడ్డు పై వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుంతలు కనిపిస్తే మనమైతే వాటిని దాటుకుంటూ వెళతాం. వాటి గురించి పెద్దగా పట్టించుకోము. కానీ ఆయన అలా కాదు. ఎక్కడ గుంతలు తన కంటపడినా వాటిని బాగుచేసి వెళతారు. ఆయన పేరే గంగాధర్ తిలక్ రత్నం. సోషల్ మీడియాలో ఆయన చాలామందికి పరిచితులే. గత పదేళ్ల నుంచి గంగాధర్ తన పెన్షన్ సొమ్ముతో హైదరాబాద్ నగరం లో రహదారులపై ఏర్పడిన గుంతలు .. గతుకులు పూడ్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆయన తన కారులో అవసరమైన పార,పలుగు వంటి సామానులు సిద్ధంగా పెట్టుకుంటారు. వెళ్ళేదారిలో రోడ్డు సరిగ్గా లేదని గమనిస్తే వెంటనే రంగంలోకి దిగి మరమత్తు చేస్తారు. గంగాధర్ కు ఆయన సతీమణి కూడా సాయం చేస్తుంటారు. ఈ గంగాధర్ ను రోడ్ ఆఫ్ డాక్టర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ నెల పద్నాలుగున తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ డాక్టర్ దంపతులను పిలిచి సన్మానించారు. వారి సేవలు స్ఫూర్తి దాయకమని అభివర్ణించారు.

అదే సమయంలో పింఛను సొమ్ముతో తిలక్‌ దంపతులు గుంతలు పూడుస్తున్నారని ఓ పత్రికలోవచ్చిన కథనంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వృద్ధ దంపతులు రోడ్ల మరమ్మతులు చేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు అక్షింతలు వేసింది. రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్‌ఎంసీకి సిగ్గుచేటని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్‌ఎంసీ అధికారుల వేతనాలను తిలక్‌ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది.

ఇక గంగాధర తిలక్ రత్నం గారి గురించి చెప్పుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లా యర్నగూడెం లో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. పదో తరగతి వరకు సొంత ఊర్లో చదువుకున్న గంగాధర్ పై చదువులకు ఏలూరు వెళ్లారు. smvm పాలిటెక్నిక్ కళాశాల లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు. తర్వాత ఇండియన్ రైల్వేలో ఉద్యోగంలో చేరారు. అసిస్టెంట్ సిగ్నల్ ఇనెస్పెక్టర్ గా పదవీ విరమణ చేశారు.

రిటైర్ అయ్యాక ఇన్ఫోటెక్ సంస్థలో డిజైన్ ఇంజనీరింగ్ సలహాదారుడిగా పనిచేశారు. రైల్వే నుంచి వచ్చే పెన్షన్ సొమ్మును రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడానికి వినియోగిస్తున్నారు. పదేళ్ల క్రితం ఒక రోజు గుంతల కారణంగా ఒక ఆర్టీసీ బస్ ఆటో ను ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన ను ప్రత్యక్షంగా చూసిన గంగాధర్ ఆ క్షణానే రోడ్డు పై గుంతలను పూడిస్తే ప్రమాదాలను నివారించవచ్చని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచే అదే పని లో నిమగ్నమైనారు.

ఎవరూ చేసేందుకు ముందుకు రాని ఈ పనులను గంగాధర్ అమిత ఆసక్తి తో చేస్తారు. మొదట్లో కేవలం వారాంతాల్లో ఈ పని చేసేవారు. తర్వాత ఫుల్ టైం అదే పని చేస్తున్నారు. కొన్నివేల గుంతలను ఆయన పూడ్చారు. ఆయన కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. గంగాధర్ చేపడుతున్న ఈ సామాజిక సేవకు కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు.

——–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!