What are the disadvantages of this black fungus?…………………కరోనా దెబ్బకే జనాలు బెంబేలెత్తి పోతుంటే పులిమీద పుట్ర లా బ్లాక్ ఫంగస్ మరోవైపు వణుకు పుట్టిస్తోంది. దీని వలన కరోనా నుంచి కోలుకున్నామనే ఆనందం ఆవిరై పోతోంది.శరీరంలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లితే ఈ బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్) బారిన పడే ప్రమాదం ఉంది. ఇది ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ప్రమాదకారి. దీని వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్ (డీఎంఈఆర్)అధిపతి డాక్టర్ తాత్యారావు ఈ బ్లాక్ ఫంగస్ మూలంగా దృష్టి లోపం కలగవచ్చని అంటున్నారు.కరోనా నుంచి కోలుకున్నవారికి రెండు మూడు రోజుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది సోకిన వారిలో ముఖం వాపు,తలనొప్పి,జ్వరం,కళ్ళవాపు,ముక్కుమూసుకుపోవడం, వంటిపై నల్లటి మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీని మూలంగా పలువురు అంధులుగా మారుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ , గుజరాత్ రాష్ట్రాల్లో ఈ తరహా బాధితుల కోసం ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఈ ఫంగస్ బాధితులు ఆసుప్రతుల్లో చేరుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ఒకరినుంచి మరొకరికి సోకదని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తే బాధితులను కాపాడవచ్చు అంటున్నారు. అయితే దీని నియంత్రణకు వాడే మందుల కొరత వలన చికిత్స సవాల్ గా మారుతోంది.
గతంలో బ్లాక్ ఫంగస్ కేసులు చాలా తక్కువగా ఉండేవి. కరోనా వచ్చాక ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా చికిత్సలో ఇచ్చే స్టెరాయిడ్ మూలంగా బాధితులు కోలుకునే సమయానికి బలహీన పడతారు. దీనికి తోడు ఇతర వ్యాధులు ఉంటే ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడతారని అంటున్నారు. కరోనా సోకినా వారంతా కాదు కానీ బలహీనంగా ఉన్నవారు .. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు. మన చుట్టూ ఉండే వాతావరణంలో నుంచే ఈ ఫంగస్ శరీరంలోకి చేరుతుందని చెబుతున్నారు.