తమిళనాడులో నేతల భవితవ్యం ఏప్రిల్ ఆరున తేలనుంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే .. దశాబ్దం పాటు అధికారానికి దూరం గా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. నటుడు కమలహాసన్ పార్టీ కూడా చిన్నాచితకా పార్టీలతో కల్సి బరిలోకి దిగింది. ఈ మూడు కూటములు కాక మరో రెండు కూటములు పోటీలో ఉన్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో ఉండగా … కాంగ్రెస్ డీఎంకే కూటమిలో ఉంది.
పళని స్వామి గెలిచే అవకాశాలు ఎక్కువ
అన్నాడీఎంకే నేత, ప్రస్తుత సీఎం పళని స్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఐదో సారి బరిలోకి దిగారు. 1989,1991,2011,2016 అసెంబ్లీ ఎన్నికల్లో పళని స్వామి ఇక్కడినుంచే గెలిచారు. నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. వన్నీయర్లు పెద్ద సంఖ్యలో ఎడప్పాడిలో ఉన్నారు. వారికి ఇటీవల 10 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించడం పళని స్వామి కి ప్లస్ అవుతుంది. డీఎంకే ఇక్కడ 1967,1971 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. వన్నియార్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తాలి మక్కల్ కచ్చి (పిఎంకె) తో పొత్తు కూడా అన్నాడీఎంకే కి కలసి వస్తుంది. ఇక్కడ పళని స్వామి కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కూటమి కూడా సత్తా చాటుతుందని పళని స్వామి గట్టి నమ్మకం తో ఉన్నారు. సర్వేలలో మటుకు అన్నాడీఎంకే ఇప్పటివరకు వెనుక బడింది.
స్టాలిన్ హ్యాట్రిక్ కొడతారా ?
కొలతూర్ నియోజకవర్గం నుంచి స్టాలిన్ మూడో సారి పోటీ చేస్తున్నారు. 2011 లో డీ లిమిటేషన్ తర్వాత ఈ కొలతూర్ నియోజకవర్గం ఏర్పడింది. 2011 లో స్టాలిన్ ఇక్కడ 2,734 ఓట్ల తేడాతో గెలిచారు. 2016 ఎన్నికల్లో స్టాలిన్ మెజారిటీ 37,730 ఓట్లకు పెరిగింది. ఈ సారి అన్నాడిఎంకె అభ్యర్థి అధీరాజారాం ఇక్కడ స్టాలిన్ ను ఢీ కొంటున్నారు. బరిలో మొత్తం 36 మంది అభ్యర్థులున్నారు. స్టాలిన్ కే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. డీఎంకే కూటమి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్టు ఇప్పటి వరకు వెల్లడైన సర్వేల సారాంశం.
గట్టి పోటీలో కమల్
కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్‌లో కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులనుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి ఇక్కడ 5177 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2016 ఎన్నికల నాటికీ అవి 33,113 ఓట్లకు పెరిగాయి. 2016లో పోటీ చేసి ఓడిపోయిన వనతి శ్రీనివాసన్ మళ్ళీ బరిలోకి దిగారు. పొత్తులో లేనప్పుడే అన్ని ఓట్లు సాధించిన బీజేపీ అన్నాడీఎంకే తో పొత్తు కుదుర్చుకుని పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో అన్నా డీఎంకే కు 59788 ఓట్లు వచ్చాయి. అవన్నీ గంపగుత్తగా బదిలీ కాకపోయినా కొంతమేరకు అయినా పడతాయని భావిస్తున్నారు. వినతి బలమైన గౌండర్ కమ్యూనిటీకి చెందినవారు. ఇక్కడ వారి ఓటు బ్యాంక్ పెద్దదే. ఈ క్రమంలో బీజేపీ నేతలు విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ బీజేపీ కమల్ హాసన్ ను నాన్ లోకల్ అభ్యర్థి అని ప్రచారం చేస్తున్నాయి. ఆయన సినీ గ్లామర్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. కమల్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుందో ఫలితాలు తర్వాత కానీ చెప్పలేం. కమల్ కూడా అధికారంలోకి వస్తామని అనుకోవడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో ?
——————-KNMURTHY

