అరుణ్ సాగర్ ……………………….
కుక్కలు అంటే డాగ్స్. పప్పీస్ అని కూడా అనొచ్చు. గిట్టనోళ్లు కుత్తే అంటారు. మరీ విద్వేషంతో రగిలిపోయేవాళ్లేమో నీచ కమీనుల సరసన కుక్కలను నిలబెడతారు. యూజువల్లీకుక్కలు చాలామంచివి. అవి వీధివైనా వినువీధి హర్మ్యాలలోవైనా బేసిగ్గా మంచివి. విశ్వాసము వాటిప్రాధమిక లక్షణము.
నిజానికి మనుషులనూ కుక్కలనూ వేరుచేసేది ఇదే అన్నట్టు. అయితే మనం తరచిచూస్తే కుక్కలకు కూడా క్లాసూ మాసూ తేడాలు ఉంటవి. కొందరు వాటిని ఎన్నెన్నో లక్…క్షలు పెట్టి కొందురు. జుబిలీహిల్స్ ఎమ్మెల్యేకాలనీలో వాటికైఒక ఫైవ్‌స్టార్ హోటల్ కూడా కలదు. సారీ హోటల్ కాదు, హాస్పిటల్. అందులో కుక్కలకు ఐసిసియు ఉన్నది. అయితే కొన్ని సామాజిక గణములలో వాటిని కుక్కలు అనుట నిషేధము. ఎయిదర్ వాటికి గౌరవప్రదమైన పేర్లైనా ఉంటాయి లేదంటే పప్పీలు అని పిలవాలి.
వీడెవడ్రా బాబూ మధ్యలో….ఏయ్ వాచ్మాన్, వీడెవడో పాడేరూ, పెద్దపల్లి ట్రైబల్కుక్కంట, అఫ్టరాల్ పారాసెటమోల్ లేక పిచ్చి జ్వరానికి చచ్చిపోయిన కుక్కల లిస్టు తెచ్చాడు. మనమిక్కడ `పాషు`కోలు కబుర్లు చెప్పుకుంటుంటే అడ్డమొచ్చాడు. సెక్యూరిటీ డాగ్స్వీడినిక్కడినుంచి తోలేయండి, జల్దీ! ఛీఛీ కుక్కనాయాళ్లు, మూడు పాడు చేశారు. ఇన్ ది వేక్ ఆఫ్ వీకే సింగ్ గారి భాషణ(దుర్భాషణ?) మనం ఇప్పుడు ఈ చెత్తటాపిక్ మీద టైం వేస్ట్ చేసుకోవాల్సివస్తున్నది.
సారీ, సరే ఏంచెబుతున్నానూ, యా, కుక్కమీద వ్యాసం! ఓకే, ఎనీవేస్ జెనెరల్లీ మనుషులు సాటిమనుషుల సంగతేమోగానీ కుక్కల్ని మాత్రం (నాట్ ఆల్ డాగ్స్) ప్రేమిస్తారు.ఎందుకంటే కుక్కలు మనుషులకంటే ఖరీదైనవి. ఫరెగ్జాంపుల్, ఒక పగ్ (అంటే హచ్చికుక్క) కొనాలనుకోండి. హుమ్….ఎంతా….ఒక వన్ లాక్! అంటే ఎంతంటే ఒక రైతుకూలీ ఆత్మహత్య చేసుకోడానికి ఎంత అప్పు కారణం కాగలదో అంతన్నట్టు.
ఓకే? మరి గ్రేట్‌డేన్, షెపర్డ్, అల్సేషియన్, దాల్మేషియన్….బై ద వే, మీరు 100 దాల్మేషియన్స్ మూవీచూశారా? దాని సీక్వెల్ 101 దాల్మేషియన్స్? వెరీ గుడ్, అలా వంద పప్పీలను మెయింటైన్ చేయగలిగితే మీరు హాలీవుడ్ లెవెల్‌కి ఎగురుతారన్నట్టు. గ్లెన్క్లోజ్కి క్లోజ్గాఎదుగుతారన్నట్టు. అయితే అందుకు బాగా బలుపు అవసరం.
సరే ఇక పోతే, శునక ఎకానమీ గురించి చెప్పుకోవాలంటే…ఓకే ఎకానమీ అంటే కొంచెం పెద్దపదం అనిపిస్తుందా అయితే మార్కెట్ అందాం! పప్పీ కుక్కల పెట్ మార్కెట్ అన్నట్టు.ఇండియాలో 2010 కుక్కలెక్కల ప్రకారం 2.2 మిలియన్ల ఇంటికుక్కలు ఉన్నాయి. వాటి జనాభా ఏటా 26% పెరుగుతున్నది. ఒకొక్క పప్పీ యావరేజ్ కాస్ట్ పాతికవేలు వేసుకున్నామీకు మార్కెట్ ఫిగర్ కళ్లముందు నిలుస్తుంది. ఇండియా పెట్ డాగ్స్ మార్కెట్ వేల్యూ 2019 నాటికి 32.3 మిలియన్ డాలర్లు.
2014లో అంచనా ప్రకారం కుక్కల ఫుడ్డు మార్కెట్ సైజు 1700 కోట్లు. ఫుడ్, డాగ్ హెల్త్‌కేర్, గ్రూమింగ్, యాక్సెసరీస్ కలిపి ఇదిఅయిదేళ్లలో శునకవేగంతో 10 వేలకోట్ల విలువకు చేరుతుందని ప్రొజెక్షన్. ఢిల్లీలో బౌవౌ క్లబ్ అని కుక్కలకు స్పెషల్ రెస్టారెంట్ పెట్టారు. ముంబైలో డాగ్ డబ్బావాలా సర్వీస్ కూడా ఉంది.ఒక మీల్‌కు 120 రుపాయలు! హైదరబాద్‌లో హైదరబాద్ పాస్ అని స్పెషల్ గ్లోసీ మేగజైన్ నడుస్తోంది. తొక్కలోది ఈ పప్పీ కుక్క ఎకనమిక్స్ మనకెందుకు గానీ…మనం సీరియస్గామాట్లాడాల్సింది కుక్కల సోషియాలజీ గురించి.
భారతీయ సమాజములో కుక్కలు చాలా సందర్భాలలో మనుషులతో పోలిక నోచుకుంటాయి. పందులు, గొర్రెలు, ఎద్దులకంటే మిన్నగా. పందులు ఎద్దులు గొర్రెలు ప్రవర్తనకు సంబందించిన అంశాలలో ఎక్కువ పోలికలకు నోచుకుంటే, కుక్కలు సామాజిక స్థాయికి చెందిన పోలికలకు తరచుగా నోచుకుంటాయి. పైన మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి, మీకు ఈపాటికే కుక్కలలోని వర్ణవ్యవస్ థస్వరూపం అర్ధమైఉంటుంది.
అయితే మానవజాతికీ శునకజాతికీ తేడా ఏమిటంటే పాపం కుక్కలకు తమజాతిలో ఇన్నితేడాలున్నవని వాటికి తెలియదు. మానవుడే తమను బ్రీడునుబట్టి తేడాపాడాగా చూస్తున్నడని వాటి కాన్షస్కు తెలియదు. అవి ఏ జాతివైననూ విశ్వాసమూ, కాపలా మరియూ వాసన చూచుట: ఇవి మాత్రమే వాటి కార్యకలాపములు. అయితేవీధికుక్కలు వేటకుక్కలై భైరవులై వర్తించుట మనము మూలవాసుల గ్రామీణ సముదాయములో మాత్రమే చూడగలము.
అవి అందంగా దృఢంగా చురుకుగా ఉంటాయి. ఆరోగ్యంగాకూడా ఉంటాయి. అయితే గిరిజనులు అడవులను కోల్పోతున్న కొద్దీ అవికూడా పక్కనున్న మైదానప్రాంతములలోనికి వచ్చి వ్యర్ధపదార్ధములూ చెత్తేర్చెదారేర్ తిని నీచులూ కామీనుల సరసన చేరుట వాటికి సంబంధించినంతవరకూ ఒక సామాజిక విషాదము.
ఇక మనం శునక జనాభాలో అత్యధికులైన వీధి కుక్కల గురించే మాట్లాడుకుందాం. మొన్నమంత్రిగారు చెప్పిన కుక్కలు కూడా ఇవే. (ఇంటికుక్కల మీద రాయి కాదుకదా పుల్లవేసినా కాళ్లిరగ్గొడ్తారు మరి) ఈ కుక్కలు మందలుమందలుగా తిరుగుతాయి. వీటికి షెల్టెర్ఉండదు. పుట్టిన పిల్లలలో ఎక్కువ చచ్చిపోతాయి. అయినా వీటినే జీహెచ్ఎంసీ వాళ్లు ఎక్కువగా చంపేస్తూ ఉంటారు. జంతుప్రియురాళ్లు సంతాన నిరోధక ఇంజెక్షన్లు చేయించేది కూడావీటికే.
ఎందుకంటే వీటిని పెంచుకోడానికి ఎవరూ ముందుకు రారు. (అదే ఏ స్మాల్ స్టేచర్ పొమేరియనో అయినా చాలు పుట్టిన పిల్లలను ఎదురుడబ్బులిచ్చి మరీ కొనుక్కుంటారు).పైగా వీటిని అసహ్యించుకుంటారు. అంటుకోరు. ముట్టుకోరు. పొరపాటున వాకిట్లోకి వస్తే ఛీకొడతారు. ఒకవేళ దయతో ఏమైనా తిండిపెట్టినా కొంచెం దూరంగా విసిరేస్తారు. ఈ కుక్కలేమానవులలోని అధమజాతితో పోటీ పడుతుంటాయి. కుక్కలపై రాళ్లేస్తే కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అని అయనెవరూ వీ ……డాష్ డాష్ డాష్ యా వీకే సింగ్ అన్నమాటల అంతరార్ధం అదే అన్నట్టు.
పోతే, ఇక్కడ ఒక ప్రశ్న! కుక్కలైనంత మాత్రాన రాళ్లతో కొడతారా, కుక్కలైనంత మాత్రాన బట్టలూడదీసి నడిరోడ్డున నిలబెడతారా, కుక్కలై పుట్టినపాపానికి తమకు అలవాటున్న తిండితిన్నందుకు అడ్డంగా నరికి చంపుతారా, కుక్కజన్మ ఎత్తిన నేరానికి కూచికూచి కూనపిల్లల్ని గుడిసెలో బజ్జున్నప్పుడు నిప్పుపెట్టి కాల్చిబూడిదచేస్తారా. అసలు మీ కర్మసిధ్ధాంతం ప్రకారము మరో జన్మలో మీరెవరూ కుక్క పుటక పుట్టకుండా పోతారా? పోనీ కొన్ని కుక్కలు, తమపై సాగుతున్న ఈ వివక్షను గుర్తించి చైతన్యమై భాస్కరుని వెలుగులో విముక్తమై మందలు మందలుగా సమూహమై సైన్యమై మీ కండలు పీకి కావరము దించవని మీరు భ్రమపడుతున్నారా.
కుక్కపిల్ల అని హీనంగా చూడకు దేన్నీ, అవి గానీ ఒకసారి గానీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటేనా! ఒరేయ్ నాయనా రాళ్లేసి కొడితే ఊరుకోడానికి అవేమీ నీ పెంపుడు పప్పీలు కావురా, నువు వెటకారము చేసినట్టు అవి గ్రామ సింహాలు కావు రేచుకుక్కలు. వేట మొదలైతే పంచెల్ పైకెత్తుకుని పోరారే పరారిష!
`Rise like Lions after slumber
In unvanquishable number–
Shake your chains to earth like dew
Which in sleep had fallen on you–
Ye are many — they are few.’
P.B. shelley
ఈ వ్యాసము రాసిన పిదప, ఎండిపోయిన పిచ్చిపార్కులో మధ్యాహ్నము కునుకు తీస్తున్న కుక్కను పిలిచి చదివి వినిపించగా అది పడీపడీ నవ్వి ఇలా అన్నది గురూ “పిచ్చివాడా,ఎంత టైము వేస్టు చేసుకున్నావురా…మన మంత్రిగారు అన్నది మా కుక్కల గురించి కాదు. ఈ సమాజము కుక్కలవలె ట్రీట్‌చేసే మా తోటి మనుషుల గురించి”!
కుక్కల వెటకారము మామూలుగా ఉండదు చిచ్చా, వామ్మో గోళ్లతో రక్కేసినట్టుంటది. హూ లెట్ ద డాగ్స్ ఔట్? హూ! హూ! సరేగా నీ డాగ్మాటిక్ అప్రోచ్ అంటే ఏందన్నా?