Can’t we stop bad practices?……….
రకరకాల వస్తువులను,వాహనాలను, ఇండ్లను అద్దెకివ్వడం గురించి మనం విని ఉంటాం. కానీ అక్కడ మహిళలను అద్దెకిస్తుంటారు.ఆ మహిళలు పెళ్లి అయిన వారు కావచ్చు.. యువతులు కావచ్చు. బాలికలు కావచ్చు. ఈ దురాచారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లా శివపురిలో ఎప్పటినుంచో కొనసాగుతుందట. ఈ ప్రాంతంలో డబ్బులు ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు.
వారు పేద కుటుంబాల్లోని మహిళలను ఇంత సొమ్ముకని బేరం కుదుర్చుకుని అద్దెకు తీసుకువెళ్తారు. చిత్రంగా ఆ మహిళల తాలూకు భర్తలు కూడా ఇందుకు అంగీకరిస్తారు. చాలామంది భర్తలే ఈ దురాచారాన్ని సాగిస్తున్నారు.
దీనికి అక్కడి వారు “ధడీచా ప్రాత ” అనే పేరు కూడా పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం సీజనల్ గా ఈ కార్యక్రమాన్ని చేపడతారట. వీటి గురించి మీడియాలో కూడా చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఇలా మహిళలను అద్దెకివ్వడంలో అమ్మాయి అందానికి, వయసుకే ప్రాముఖ్యత ఉంటుంది. 16 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మహిళలను ఇలా అద్దెకిస్తుంటారు వారి భర్తలు. ఇలా అద్దెకివ్వడం లో మహిళల అభిప్రాయాలకు కానీ, వారి ఆత్మాభిమానానికి కానీ ఎలాంటి విలువ ఉండదు. ఉన్నా వాటిని భర్తలు లెక్కచేయరు. ఆ మహిళకు నచ్చినా, నచ్చకున్నా సొమ్ము చెల్లించిన వ్యక్తితో వెళ్లాల్సిందే.
అమ్మాయి అందం, వయసును బట్టి, అద్దెకు తీసుకునే కాలాన్ని బట్టి 10 రూపాయల నుంచి లక్ష, రెండు లక్షల వరకు మహిళలకు ధర నిర్ణయిస్తారు. స్టాంపు పేపర్లపై కూడా అగ్రిమెంట్ రాసుకుని ఇరు పార్టీలు సంతకాలు చేసుకుంటారు.
ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకునే వారు లేరట.ఇలాంటి ఒప్పందాలను ఒకే మహిళతో ఎంతమంది మగవారైనా, ఎన్ని సార్లయినా చేసుకోవచ్చు. ఈ విధానానికి ఇక్కడి మహిళలు కూడా అలవాటు పడిపోయారు.
నిర్దేశిత కాల పరిమితి ముగిసిన తర్వాత ఆ మహిళ తిరిగి తన పుట్టింటికి వచ్చేయాలి. ఒకవేళ ఆ పురుషుడు అదనపు డబ్బు చెల్లిస్తే, ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించుకునే (Renew) సదుపాయం కూడా ఉంటుంది.
ఇక్కడి కుటుంబాల్లో పుట్టిన కొందరు యువతులు వేరే ప్రాంతాల్లో చదువుకుని అక్కడే స్థిర పడి పోతున్నారు. తద్వారా కొంతమేరకు ఈ దురాచారం నుంచి బయటపడుతున్నారు. తమ కుటుంబాలను కూడా ఈ దురాచారం నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
మీడియాలో వార్తలు వచ్చినపుడు సైలెంట్ అయి కొంతకాలం ఆగాక మళ్ళీ గుట్టు చప్పుడుగా అద్దె కిచ్చే కార్యక్రమం నడుస్తుంటుంది. అధికారులు అదే తీరులో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు కూడా బ్రోకర్లతో ఒప్పందం కుదుర్చుకుంటారు.
ఆడపిల్లలను ధనవంతులకు ఇచ్చి వివాహం చేస్తుంటారు. ధనవంతుల నుండి బ్రోకర్లు లక్షల్లో సొమ్ము వసూలు చేస్తారు. గిరిజనులకు కొంత సొమ్ము ఇస్తుంటారు.పోలీసులకు ఇలాంటి పద్ధతుల గురించి తెలిసినప్పటికీ, ఫిర్యాదులు లేనందున చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు.
ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక మార్కెట్ లాంటి వేడుక జరుగుతుంది.ధనవంతులైన పురుషులు లేదా పెళ్లిళ్లు కాని వారు ఇక్కడికి వచ్చి మహిళలను, వారి వయసు, రూపం ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.ఈ అద్దె ధర సగటున రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు ఉంటుంది. కొన్నిసార్లు వర్జిన్ అమ్మాయిలకు 2 లక్షల రూపాయల వరకు కూడా ధర పలుకుతుంది
మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఇదొక వ్యాపారంగా మారింది.పేదరికం,నిరక్షరాస్యత తదితర అంశాల కారణంగా ఇలా మహిళలను అద్దెకిస్తున్నారు,అమ్మేస్తున్నారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుండి కూడా బాలికలను ఈ విధంగా అక్రమ రవాణా చేస్తున్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో పురుషుల సంఖ్యతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనివల్ల పెళ్లిళ్లు కాని పురుషులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. స్థానిక తెగలలోని పేద కుటుంబాలు అప్పులు తీర్చడానికి, జీవనోపాధి కోసం తమ సొంత కూతుళ్లను ఒక వస్తువులాగా వేరొకరి చేతిలో పెడుతున్నారు.
పోలీసుల నిఘా పెరగడంతో ఇప్పుడు ఈ వ్యాపారాన్ని బహిరంగంగా కాకుండా, చాలా రహస్యంగా ఇళ్లల్లోనే ముగించేస్తున్నారు.చట్టం నుండి తప్పించుకోవడానికి వీరు “లివ్-ఇన్ రిలేషన్షిప్” (Live-in Relationship) ఒప్పంద పత్రాలు సృష్టిస్తున్నారు. నోటరీ లాయర్ల దగ్గరకు వెళ్లి “మేము ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటున్నాము” అని రూ. 10 లేదా రూ. 100 స్టాంప్ పేపర్లపై రాసుకుని, దాని వెనుక లక్షలాది రూపాయల నగదు చేతులు మారుస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఈ పద్ధతి పూర్తిగా చట్టవిరుద్ధం. నేరం. ఇది మానవ అక్రమ రవాణా (Human Trafficking) మహిళల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం,మహిళా సంఘాలు దాడులు చేస్తూ అడ్డుకుంటున్నప్పటికీ, స్థానికులు దీనిని ఒక సాంప్రదాయంగా భావించి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఆధునిక సమాజంలో మహిళలను కేవలం ఒక వస్తువులాగా చూసే ఈ “ధడీచా ప్రాత” భారతదేశంలోనే అత్యంత చీకటి ఆచారాలలో ఒకటిగా నిలిచింది.
————– KNM

