ఒక గ్యాంగ్‌స్టర్ కథ !!

Sharing is Caring...

Action crime drama…….

‘కాపా’ (Kaapa) 2022 నాటి యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. తిరువనంతపురం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంది. ‘శంఖుముఖి’ అనే నవల ఆధారంగా దర్శకుడు షాజీ కైలాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  

కథ ఏమిటంటే ?

ఆనంద్ (ఆసిఫ్ అలీ) గర్భవతి అయిన భార్య బిను (అన్నా బెన్)తో కలిసి తిరువనంతపురం నగరానికి బదిలీపై వస్తాడు. అయితే, అక్కడకు రాగానే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. కేరళ ప్రభుత్వం రౌడీలు, గూండాలను అణచివేయడానికి ఉపయోగించే KAAPA (Kerala Anti-Social Activities Prevention Act) చట్టం కింద బ్లాక్‌లిస్ట్‌లో బిను పేరు ఉంటుంది.

గతంలో ఒక గ్యాంగ్ వార్ కారణంగా జరిగిన హత్య కేసులో ఆమెకు సంబంధం ఉందనే కారణంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వెతుకుతుంటారు. తన భార్య ఏ తప్పూ చేయలేదని నమ్మే ఆనంద్, ఆమెను ఆ ఊబిలోంచి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ నగరంలోనే అత్యంత శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ ‘కొట్ట మధు’ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఆశ్రయం పొందుతాడు.

మధు శత్రువుల నుండి తన భార్యను కాపాడుకునే క్రమంలో ఆనంద్ కూడా తెలియకుండానే ఆ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. చివరికి బిను గూండా లిస్ట్ నుండి బయటపడిందా? కొట్ట మధుకు, ఈ దంపతులకు ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగిలిన కథ.

సినిమా అంత పృథ్వీరాజ్ వన్-మ్యాన్ షోగా సాగుతుంది. ఒక సాధారణ రౌడీ నుండి తిరుగులేని డాన్‌గా ఎదిగిన వ్యక్తిగా, ముఠా కక్షల మధ్య నలిగిపోయే నాయకుడిగా ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, నటన సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. తన శత్రువులు ఎప్పుడు ఎటువైపు నుండి దాడి చేస్తారో తెలియని మానసిక సంఘర్షణను పృథ్వీరాజ్ తన కళ్లల్లో అద్భుతంగా పండించారు.పృథ్వీరాజ్ కెరీర్‌లో ఇదొక అత్యుత్తమ పవర్‌ఫుల్ రోల్.

ఒక సాదాసీదా ఐటీ ఉద్యోగి తన భార్య కోసం గ్యాంగ్‌స్టర్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు పడే భయాన్ని, ఆ తర్వాత అతనిలో వచ్చే మార్పును ఆసిఫ్ అలీ చాలా సహజంగా పండించారు.ఈ కథ మొత్తం ఆనంద్ కోణంలోనే సాగుతుంది.

సినిమా కేరళలోని గ్యాంగ్ వార్స్‌ను, అక్కడి స్థానిక రాజకీయాలను,  రౌడీయిజం వెనుక ఉండే సామాజిక కోణాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించింది. అతిగా అనిపించని ఫైట్స్, రా అండ్ రస్టిక్ విజువల్స్ ఆకట్టుకుంటాయి.

మొదటి భాగం పాత్రల పరిచయంతో నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్…  క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ఇస్తాయి. ముఖ్యంగా అపర్ణ బాలమురళి పాత్ర ఇచ్చే మలుపు బాగుంటుంది. ప్రమీలగా అపర్ణ బాలమురళి బాగా చేశారు.బినుగా అన్నాబెన్ నటించారు. ఈ పాత్రలో మంచి ఎమోషనల్ స్కోప్ ఉన్నప్పటికీ,పరిథి తక్కువ.  

మధుకి ప్రధాన శత్రువు లతీఫ్,పత్రికా ఎడిటర్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను దిలీష్ పోతన్ చాలా సహజంగా, అద్భుతంగా పండించారు.

కథలో కొత్త దనం లేదు ..ఇలాంటి సినిమాలు గతంలో బోలెడు వచ్చాయి. సినిమా ముగింపులో వచ్చే ట్విస్ట్ , క్లైమాక్స్ సీన్స్ పాత సినిమాల  ప్రభావంతో తీసినట్లు అనిపిస్తుంది.దర్శకుడు సీక్వెల్ (పార్ట్-2) కోసం సినిమాను ముగించిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. 

ఒక గ్యాంగ్‌స్టర్ కథలో యాక్షన్ ఎంత ముఖ్యమో, పాత్రల మధ్య ఉండే ఎమోషన్ కూడా అంతే ముఖ్యం. కానీ ఈ సినిమాలో కొట్ట మధు పాత్ర తప్పు చేస్తున్నాననే గిల్ట్ (భయం/బాధ)తో బాధపడుతున్నట్లు చూపించినప్పటికీ, ఆ ఎమోషన్ ప్రేక్షకుడికి సరిగ్గా కనెక్ట్ అవ్వదు. కథలో చాలా చోట్ల ‘డ్రామా’ పక్కకు పోయి కేవలం రౌడీల మధ్య కొట్లాటలే మిగులుతాయి.

సినిమాటోగ్రాఫర్ జోమోన్ టి. జాన్ విజువల్స్‌ను చాలా రా అండ్ డార్క్ టోన్‌లో చూపించారు. సినిమాలో రాత్రి వేళల్లో జరిగే గ్యాంగ్ వార్స్, చేజింగ్ సీన్స్, సందులలో వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లను కెమెరాలో చాలా సహజంగా, అద్భుతంగా క్యాప్చర్ చేశారు.

డాన్ విన్సెంట్ బిజీఎమ్ (BGM) పృథ్వీరాజ్ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేసింది.యాక్షన్ , ముఠా కక్షల సన్నివేశాలలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా, హై-వోల్టేజ్‌తో సాగుతూ సీన్లలో తీవ్రతను పెంచింది.ఈ సినిమా Netflix లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!