ఓ మాదిరి ఇన్వెస్టిగేటివ్ హారర్ మూవీ !!

Sharing is Caring...

Not a mind-bending thriller…….

“బారాముల్లా” ఇదొక సూపర్ నేచురల్ ఇన్వెస్టిగేటివ్ హారర్ మూవీ. కాశ్మీర్ లోయ తీవ్రవాదం,ఉగ్రశక్తులు, అతీంద్రియ శక్తులు వంటి అంశాలను మేళవించి తెరకెక్కించిన సినిమా. ఆదిత్య ధర్ (ఉరి ఫేమ్) కథ, నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. 2025 నవంబర్ లో నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రధాన కథాంశం …

కథ కాశ్మీర్‌లోని ‘బారాముల్లా’ అనే ప్రాంతం లో సాగుతుంది. అక్కడ స్థానిక మంత్రగాడు ఒక మ్యాజిక్ షో చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొడుకైన 10 ఏళ్ల బాలుడు అదృశ్యమైపోతాడు. ఈ మిస్సింగ్ కేసును పరిశోధించడానికి డీఎస్‌పీ రిజ్వాన్ సయ్యద్ (మానవ్ కౌల్) బారాముల్లాకు బదిలీపై వస్తాడు.

విచారణ సాగుతున్న కొద్దీ, అక్కడ పిల్లలు మాయమవడం వెనుక కేవలం మనుషులు లేదా మిలిటెంట్లు మాత్రమే కాకుండా, కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయని రిజ్వాన్‌కు అర్థమవుతుంది. అదే సమయంలో, ప్రభుత్వం అతనికి కేటాయించిన పాత విల్లాలో కూడా కొన్ని భయంకరమైన శక్తులు దాగి ఉండి, కుటుంబానికి ముప్పుగా మారుతాయి.

గత 35 ఏళ్లుగా కాశ్మీర్ లోయ ఎదుర్కొంటున్న హింస, నిగూఢమైన గాయాలకు ఈ సంఘటనలకు ఉన్న లింక్ ఏంటి? రిజ్వాన్ తన కుటుంబాన్ని, బారాముల్లా లో శాంతిని ఎలా కాపాడాడు ? అనేదే మిగతా కథ.

డీఎస్‌పీ రిజ్వాన్‌గా మానవ్ కౌల్ అద్భుతమైన నటనను కనబరిచారు. కేసును ఛేదించే కఠినమైన ఆఫీసర్‌గా, మరోవైపు తన కుటుంబానికి వస్తున్న ముప్పును చూసి ఆందోళన చెందే తండ్రిగా ఆయన బాగా నటించారు. గుల్నార్‌గా భాషా సుంబ్లి కూడా ఎమోషనల్ సీన్లలో చక్కటి పట్టును ప్రదర్శించారు.మాయమైపోయే బాలుడిగా,రిజ్వాన్ కూతురిగా,కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టులు భయానక సన్నివేశాల్లో చాలా సహజమైన నటనను కనబరిచారు.

సినిమాలోని వాతావరణాన్ని, పాత్రల భావోద్వేగాలను ఎలివేట్ చేయడానికి దర్శకుడు ఫస్టాఫ్‌లో ఎక్కువ సమయం తీసుకున్నారు. దీనివల్ల కథనం కొన్ని చోట్ల చాలా స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కథలోకి అతీంద్రియ శక్తులు ప్రవేశించినప్పుడు, కొన్ని సన్నివేశాలలో సమాధానాల కంటే మరికొన్ని కొత్త సందేహాలు తలెత్తుతాయి. కొన్ని చోట్ల లాజిక్స్ కాస్త పక్కదారి పట్టినట్లు అనిపిస్తుంది. పేరుకే హరర్ కానీ అంత భయపెట్టే సన్నివేశాలు ఏమీ లేవు.

సినిమా ఒకవైపు కాశ్మీర్‌లో పిల్లల అదృశ్యం, ఉగ్రవాదం, రాజకీయ గొడవల చుట్టూ సాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌గా మొదలవుతుంది. కానీ కథ ముందుకు వెళ్లేకొద్దీ అది హఠాత్తుగా దెయ్యాలు, ఆత్మలు ఉండే ‘సూపర్‌నేచురల్ హారర్’ డ్రామాగా మారిపోతుంది. ఈ రెండు విభిన్న అంశాలను దర్శకుడు పూర్తిగా ఒకదానితో ఒకటి సరిగ్గా ముడిపెట్టలేకపోయారు, దీనివల్ల కథలో క్లారిటీ కొరవడింది.

సినిమా మొదటి భాగం చాలా నెమ్మదిగా, ఉత్కంఠగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి ఒకేసారి పొలిటికల్ మెసేజ్,ఆత్మల ఫ్లాష్‌బ్యాక్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ ఒకేసారి చూపించడానికి ప్రయత్నించారు. దీనివల్ల క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ కథ చాలా త్వరత్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది.

ఆత్మలు పిల్లలను వేరే ‘ఆస్ట్రల్ ప్లేన్’ (మరో ప్రపంచం) లో బంధించడం లాంటి హారర్ఎలిమెంట్స్, వాస్తవంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పక్కపక్కనే నడవడం ప్రేక్షకులకు కొంచెం నమ్మశక్యంగా అనిపించదు. కథలో అన్ని ఎలిమెంట్స్‌ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో స్క్రీన్‌ప్లే పరంగా కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.

సినిమాటోగ్రాఫర్ ఆర్నాల్డ్ ఫెర్నాండెజ్ కాశ్మీర్ అందాలను కేవలం రంగులమయంగా చూపించకుండా, అక్కడి శీతాకాలపు మంచు, చీకటి, ఒక రకమైన నిశ్శబ్ద భయాన్ని అద్భుతంగా స్క్రీన్‌ పైకి తెచ్చారు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలకు సౌండ్ డిజైన్ చాలా ముఖ్యం. ఈ సినిమాలో అనవసరమైన పెద్ద శబ్దాలు (Jump Scares) లేకుండా, సీన్‌కు తగ్గట్టుగా వచ్చే నిగూఢమైన సంగీతం ప్రేక్షకుడిలో భయాన్ని, సస్పెన్స్‌ను కొనసాగిస్తుంది.

దర్శకుడు ఆదిత్య సుహాస్ జంబాలే ఈ కథను కేవలం ఒక సాధారణ కిడ్నాప్ డ్రామాలా కాకుండా, దానికి కాశ్మీర్ లోయలోని నమ్మకాలు, ఆచారాలు, అతీంద్రియ శక్తులను జోడించి ఒక “మైండ్ బెండింగ్ థ్రిల్లర్” గా మలచాలని ప్రయత్నించారు.కానీ వర్కౌట్ కాలేదు.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!