ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ !!

Sharing is Caring...

Newton’s 3rd Law….

“న్యూటన్స్ థర్డ్ లా” ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.నటుడు సుమంత్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం  ETV Win, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సినిమా కథాంశం  ఏమిటంటే ?

కర్మ బేస్డ్ కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. కథ 1999 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ప్రమాదంలా కనిపించేలా రెండు హత్యలు జరుగుతాయి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ (సుమంత్) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభిస్తాడు. ఈ విచారణ ప్రక్రియలో  కథ అనేక మలుపులు తిరుగుతుంది.

ఈ క్రమంలోనే  ‘న్యూటన్స్ థర్డ్ లా’ నవలలో రాసిన విషయాలకు, ఈ మర్డర్ మిస్టరీకి ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ నేరం వెనుక ఉన్నది ఎవరు? న్యూటన్ మూడో సూత్రం ప్రకారం చర్యకు సమానమైన ప్రతిచర్య (కర్మ సిద్ధాంతం) ఎలా ఈ కథలోని పాత్రలపై ప్రభావం చూపించింది? అనేదే ఈ సినిమా.

ఈ సినిమాకు అతిపెద్ద బలం దాని క్లైమాక్స్ ట్విస్ట్‌లే. చివరి 20 నిమిషాలలో కథ వేగం అందుకోవడమే కాకుండా, ఊహించని మలుపులతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. చాలా రోజుల తర్వాత సుమంత్ ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మెప్పించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బాగా సెట్ అయింది.

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతి బాబు (స్టీఫెన్ మెర్క్యురీ) ఆందోళన చెందే వృద్ధుడిగా అవసరాల శ్రీనివాస్ తమ నటనతో ఆకట్టుకున్నారు. వినయ్ పాత్రలో నటించిన త్రినాథ్ వర్మ చక్కటి  నటనను కనబరిచారు.గౌతమ్ పండిట్ కార్తీక్ పాత్రలో బాగా నటించారు.

వినయ్ తండ్రి ‘గంగాధర్’ పాత్రలో నటుడు రవివర్మ నటించారు. ఒక మధ్యతరగతి తండ్రిగా తన కొడుకు అకాల మరణం పాలైనప్పుడు అతను పడే వేదనను ఈ పాత్రలో చూపించారు. వినయ్ తల్లి ‘పార్వతి’ పాత్రను షెల్లీ కిషోర్ పోషించారు. మదర్ సెంటిమెంట్ , భావోద్వేగాలను బాగా ప్రదర్శించారు.ఇతర నటులు కూడా బాగానే చేశారు.

ఫస్టాఫ్, సెకండాఫ్ ప్రారంభంలో సినిమా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం,  కేసు విచారణ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది.. ఈ సినిమా పూర్తిగా కథ ఆధారంగా నడుస్తుంది. లౌడ్ యాక్షన్ సీక్వెన్స్, మాస్ ఎలిమెంట్స్, కామెడీ ట్రాక్‌లు ఆశించే సాధారణ ప్రేక్షకులకు కొంత బోర్ కొట్ట వచ్చు.

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్‌గా చూసే వారికి కొన్ని సీన్లు, ట్విస్ట్‌లు ముందే ఊహించేలా ఉంటాయి. కథలో అక్కడక్కడా లాజికల్  లోపాలున్నాయి.  దర్శకుడు రాజేష్ కర్ణ రాసుకున్న ఈ మైండ్-గేమ్ థ్రిల్లర్‌కు, వేద వ్యాస్ విజువల్స్, సింజిత్ నేపథ్య సంగీతం రెండూ ప్రాణం పోశాయి.

కెమెరా పనితనం (Cinematography)నేపథ్య సంగీతం (BGM) రెండూ కూడా కథలోని మూడ్‌ను నిలబెట్టడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి. ఒక మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌కు కావలసిన టెక్నికల్ బలాన్ని ఇవి చేకూర్చాయి.

మాస్ ఎలిమెంట్స్ లేకుండా, కేవలం కథ, సస్పెన్స్ మీద ఆధారపడి స్లో గా నడిచే  మైండ్‌-గేమ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ను ఒక సారి చూడవచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!