Movie to watch with patience……
‘ఐ, నోబడీ’ (I, Nobody) ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం …..
రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) సెక్రటేరియేట్‌లో పనిచేసే మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి. అతని భార్య మీరా (పార్వతి తిరువోతు) కూడా ఉద్యోగే.. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఒకరోజు రాజీవ్ ఒక బ్యాంక్‌కు వెళ్తాడు. అదే సమయంలో ముగ్గురు దొంగలు ఆ బ్యాంక్‌లో చొరబడి రూ. 17 కోట్లు దోపిడీ చేస్తారు.
దొంగతనంతో పాటు రాజీవ్‌ను కూడా వారు బంధించి తీసుకెళ్తారు. అయితే, ఆ ముగ్గురు దొంగలు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతారు. ఆ రూ. 17 కోట్ల డబ్బు మాయమవుతుంది. ఈ రాబరీ వెనుక రాజీవ్ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తుంటారు. డబ్బు కోసం కొంతమంది రాజీవ్ ని వేధిస్తారు. తనపై పడిన నింద నుండి, ఇబ్బందుల నుండి రాజీవ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు ఆ డబ్బు ఏమైంది? అనేదే మిగిలిన సినిమా కథ.
సినిమా అంతా పృథ్వీరాజ్ వన్ మ్యాన్ షో గా సాగుతుంది. రాజీవ్ పాత్రలో పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. ఎక్కడా స్టార్‌లా కాకుండా, గాయాలు తింటూ, ఫ్యామిలీ కోసం తాపత్రయపడే ఒక సామాన్యుడిగా జీవించారు.భార్య పాత్రలో పార్వతి తిరువోతు ఎంతో సహజంగా నటించింది.
పృథ్వీరాజ్ కూతుళ్లుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమాలో సస్పెండ్ అయ్యి, కిడ్నాపర్లతో చేతులు కలిపే పోలీస్ పాత్రలో నటుడు హకీమ్ షాజహాన్ కూడా బాగా చేశారు.వాచ్‌మెన్ జాకబ్ గా అశోకన్ కూడా బాగా చేశారు.
ఫస్ట్ హాఫ్‌లో బ్యాంక్ రాబరీ, రూ. 17 కోట్ల డబ్బు ఏమైంది అనే సస్పెన్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఆ థ్రిల్ ఉండదు. సోషల్ మీడియా ,మీడియా ట్రయల్స్‌ను ఒకే పాయింట్ చుట్టూ తిప్పుతూ చాలా సేపు సాగదీశారు. దీనివల్ల ఫస్ట్ హాఫ్‌లో ఉన్న వేగం, ఉత్కంఠ సెకండ్ హాఫ్‌లో పూర్తిగా తగ్గిపోయాయి.
సోషల్ మీడియా వల్ల ఒక సామాన్యుడి జీవితం ఎలా నాశనమవుతుంది అనే పాయింట్ మీదే మేజర్ ఫోకస్ పెట్టారు. ఇది రిపీట్ అవడం వలన ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతారు. నిజానిజాలు తెలియకముందే కేవలం అనుమానంతో సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని ఎలా విలన్‌గా మార్చేస్తారు, స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు.
దానివల్ల ఒక సాధారణ కుటుంబం ఎంతలా మానసిక క్షోభ అనుభవిస్తుందో దర్శకుడు నిస్సాం బషీర్ గట్టిగానే ప్రెజెంట్ చేశారు.సినిమా సెకండ్ హాఫ్‌లో బ్యాంక్ దొంగతనం ట్రాక్ పక్కకు పోయి, ఈ సోషల్ మీడియా విమర్శలు – పొలిటికల్ డ్రామా చుట్టూనే కథ ఎక్కువగా తిరుగుతుంది. కిడ్నాప్ ఎపిసోడ్ బాగుంది. అది కూడా నిడివి పెరిగింది.
ఒక గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగాల్సిన ఈ సినిమాను, చివర్లో బలవంతంగా పెద్ద సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ గా మార్చడం వల్ల సినిమా ఒరిజినల్ ఫ్లో కాస్త దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది.ఒక పక్కా కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకున్న ప్రేక్షకులకి, చివర్లో బలవంతంగా ఒక పెద్ద సోషల్ మెసేజ్ క్లాస్ పీకినట్లు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్‌లు కూడా పెద్దగా థ్రిల్ ఇవ్వవు.
సోషల్ మీడియా డ్రామాను తగ్గించి, బ్యాంక్ దొంగతనం చుట్టూనే సస్పెన్స్ నడిపి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. సినిమా నిడివి 2 గంటల 48 నిమిషాలు .. ఒక 30 నిమిషాలు నిడివిని తగ్గించి ఉంటే బాగుండేది.
దర్శకుడు నిస్సాం బషీర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లేను మరింత ఉత్కంఠభరితంగా రాసుకోవాల్సింది. ఏదేమైనా ఒక సామాన్యుడిని పోలీసులు, మీడియా, రాజకీయనాయకులు తమ స్వార్థం కోసం ఎలా వాడుకుంటారు అనే కోణంలో సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.
దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా, అద్భుతంగా ఉంది. జేక్స్ బిజాయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది. లిఫ్ట్‌లో వచ్చే ఫైట్ సీన్, స్ట్రీట్ ఫైట్స్, మాల్‌లో జరిగే యాక్షన్ బ్లాక్స్ హాలీవుడ్ రేంజ్‌లో మైండ్ బ్లోయింగ్‌గా డిజైన్ చేశారు. ఫైట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి.
‘ఐ, నోబడీ’ ఒక గొప్ప మాస్టర్‌పీస్ కాకపోయినా.. యాక్షన్ థ్రిల్లర్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను ఇష్టపడేవారు, ముఖ్యంగా పృథ్వీరాజ్ నటన కోసం ఈ వీకెండ్‌లో ఒకసారి తప్పకుండా చూడదగ్గ చిత్రం.

