Psycho story …….
‘వదలా’ (Vadalaa) ప్రస్తుతం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తూ నటించిన సినిమా ఇది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించారు .
కథాంశం ఏమిటంటే ?
ప్రియ (లయ) ఒక మధ్యతరగతి గృహిణి. తన భర్త యోగి (జగపతిబాబు) ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అయితే, ఒకరోజు వారి జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే ఒక అపరిచిత యువతి ప్రవేశిస్తుంది. మొదట్లో ఎంతో మంచిదానిలా నటించిన అముద, క్రమంగా ప్రియ కాపురంపై కన్నేసి, ఆ భార్యాభర్తలను విడదీయాలని సైకోలా ప్రవర్తిస్తుంది.
మరోవైపు, 10 ఏళ్ల క్రితం దీపావళి నాడు జరిగిన ఒక ప్రమాదం కేసును పోలీసులు మళ్లీ ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఆ పాత కేసుకు, ఈ హ్యాపీ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటి? అముద అసలు ఎవరు? ప్రియ తన కుటుంబాన్ని ఆ సైకో నుండి ఎలా కాపాడుకుంది? అనేదే మిగతా కథ.
చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన లయ తన నటనతో ఆకట్టుకున్నారు. ఒక మధ్యతరగతి గృహిణిగా, తన సంసారాన్ని కాపాడుకోవడానికి పోరాడే తల్లిగా ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం.
విలన్ షేడ్స్ ఉన్న అముద పాత్రలో హృతిక శ్రీనివాస్ బాగానే నటించారు.ఆమె ముఖంలో చూపించే సైకో హావభావాలు బాగున్నాయి. లయ (ప్రియ) తండ్రి పాత్రను సీనియర్ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జెన్ని బాగా చేశారు.
డాక్టర్‌గా జగపతిబాబు చాలా హుందాగా, క్లాస్ లుక్‌లో కనిపించి మెప్పించారు.కుటుంబాన్ని ప్రేమించే భర్తగా.. ఓ సైకో యువతి చేతిలో చిక్కుకుని ఇబ్బంది పడే సగటు తండ్రిగా జగపతి బాబు పాత్రలో ఒదిగిపోయాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రను మరీ డమ్మీ ని చేశారు.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా సాదాసీదాగా, ఒక పాత కాలపు టీవీ సీరియల్‌లా సాగుతుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా ఆలస్యంగా మొదలవుతాయి. విలన్ అముద అసలు అలా ఎందుకు ప్రవర్తిస్తుంది అనేదానికి చూపించిన కారణం అంత బలంగా, ఆకట్టుకునేలా లేదు.
ఇలాంటి సైకో థ్రిల్లర్ కథలు మనం గతంలో చాలా చూశాం. కాబట్టి కథనం చాలా చోట్ల ఊహించేలా సాగుతుంది. చివరి 20 నిమిషాలలో వచ్చే ట్విస్ట్‌లు, ఎమోషనల్ ముగింపు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది.
అముద,జగపతి బాబులు ఒకరిమీద ఒకరు మనసు పడ్డారనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇద్దరి హావభావాలు విభిన్నంగా ఉంటాయి. లయను చాలా కాలం తర్వాత ఒక మధ్యతరగతి గృహిణి పాత్రకు ఎంచుకోవడం, అలాగే జగపతిబాబును క్లాస్ లుక్‌లో చూపించడం దర్శకుడి మంచి ఎంపిక. నటీనటుల నుండి ఆయన రాబట్టుకున్న నటన బాగుంది.
ఒక అపరిచిత యువతి ప్రశాంతంగా ఉన్న కాపురంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే పాయింట్‌ను ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ముడిపెట్టి చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించారు.సినిమా మొదటి అర్ధభాగం లో కథను చాలా నిదానంగా నడిపించారు. దీనివల్ల ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కంటే ఒక పాత కాలపు ఫ్యామిలీ డ్రామా లేదా టీవీ సీరియల్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
దర్శకుడు స్క్రీన్‌ప్లేలో సరికొత్త ట్విస్టులు లేదా మైండ్ గేమ్స్ పెట్టకుండా చాలా రొటీన్ ఫార్ములాలోనే కథను ముగించారు. విలన్ పాత్రకు ఇచ్చిన బ్యాక్ స్టోరీని కూడా ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది.
సినిమాకు టెక్నికల్ విభాగాలు కథలోని సస్పెన్స్‌ను, సైకలాజికల్ మూడ్‌ను బిల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి..చోటా కె. నాయుడు ఈ సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశారు. కథలో ఎక్కువ భాగం ఒకే ఇల్లు లేదా నాలుగు గోడల మధ్యే సాగుతుంది. అయినప్పటికీ, ఇంట్లోకి వచ్చే ఆ సైకో క్యారెక్టర్ వల్ల కలిగే భయాన్ని, టెన్షన్‌ను చూపించడానికి ఆయన ఉపయోగించిన లైటింగ్, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి.
ఈ సినిమాకు కార్తీక్ బి. కొడకండ్ల సంగీతం అందించారు.ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను తీసుకురావడానికి సహాయపడింది. కథ , స్క్రీన్‌ప్లే కాస్త పాత పద్ధతిలో ఉన్నప్పటికీ, చోటా కె. నాయుడు విజువల్స్ , కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓటిటి వీక్షకులకు ఒక మోస్తరుగా చూసేలా నిలబెట్టాయి.
లక్ష్మి భూపాల డైలాగ్స్ చాలా సింపుల్‌గా, నిజ జీవితంలో మనం మాట్లాడుకునే భాషకు దగ్గరగా ఉన్నాయి.కథపై మరింత కసరత్తు జరిపితే బాగుండేది. ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు.

