సైకో సీరియల్ కిల్లర్ స్టోరీ!!

Sharing is Caring...

Revenge Drama …….

‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’  విజయ్ రాఘవేంద్ర నటించిన ‘సీతారామ్ బెనోయ్ కేస్ నెం. 18’ (2021) సినిమాకు ఇది సీక్వెల్.  ఈ సినిమాకు దేవీప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించారు. 

కథ ఏమిటంటే ?

‘ఆనెగద్దె’ అనే ఊళ్ళో వరుసగా ఘోరమైన హత్యలు జరుగుతుంటాయి. ఒక సైకో సీరియల్ కిల్లర్ మధ్య వయస్కులను టార్గెట్ చేసి, వారి కాళ్లు చేతులను ఫెన్సింగ్ వైర్లతో కట్టేసి క్రూరంగా చంపేస్తుంటాడు.ఈ కేసును ఛేదించడానికి ఇన్‌స్పెక్టర్ సీతారామ్ (విజయ్ రాఘవేంద్ర) రంగంలోకి దిగుతాడు.

దర్యాప్తు సాగుతున్న కొద్దీ అనుమానితుల సంఖ్య పెరుగుతుంది కానీ హత్యలు మాత్రం ఆగవు. అసలు ఆ కిల్లర్ ఎవరు? ఆ హత్యల వెనుక ఉన్న అసలు మోటివ్ ఏంటి? చాలా కాలంగా దూరమైన తన సోదరిని సీతారామ్ కలవగలిగాడా? అనేదే మిగతా కథ.

సినిమా మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, కథ మలుపులు తిరిగే విధానం బాగుంది.కథలో హీరోయిన్ లేదు ..డ్యూయెట్స్ లేవు .కిల్లర్ ఎవరనే సస్పెన్స్ కంటే, ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడనే బ్యాక్‌స్టోరీ,  మోటివ్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తుంది.

ఇన్‌స్పెక్టర్ సీతారామ్‌గా విజయ్ రాఘవేంద్ర ఎక్కడా ఓవర్ యాక్టింగ్ లేకుండా చాలా సహజమైన పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇతర పాత్రధారులు కూడా వారి పరిధిలో బాగా నటించారు. చివరి నిమిషాల్లో సీరియల్ కిల్లర్ ఎవరో రివీల్ అయ్యే సీన్, ఎమోషనల్ ఎండ్ సినిమాకు పెద్ద అసెట్. 

సినిమా మొదటి 30 నిమిషాలు చాలా పాత పద్ధతిలో, రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలాగే సాగుతుంది.ఫోరెన్సిక్ రిపోర్టులు, కిల్లర్ పోలీసుల కంటే రెండు అడుగులు ముందుండటం వంటి సీన్లు క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్‌గా చూసేవారికి కాస్త అంచనా వేసేలా అనిపిస్తాయి.కొన్ని చోట్ల కథనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

ఈ తరహా కథల్లో హంతకుడు ఎవరనే అనుమానం కొన్ని పాత్రల పైకి వెళ్లేలా.. ప్రేక్షకుడి ఆలోచనను పక్కదారి పట్టించేలా కథనాలు సాగుతాయి. ఇందులో కూడా అదేవిధంగా కథ సాగుతుంది.  తన కూతురుని  వేధిస్తున్నాడని ఓ ఉపాధ్యాయుడు పోలీసుల చుట్టూ తిరగడం, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత గతంలో ఇదే తరహాలో జరిగిన హత్య కేసులు బయట పడతాయి.

ప్రేమజంటకు సంబంధించిన మరో ఉప కథ.. ఇలా ప్రధాన కథతోపాటు, కొన్ని ఉప కథలను చెబుతూ, అసలు కథకు వీటిని లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. అయితే స్లో గా సాగుతున్న తీరు అందరికి నచ్చదు. సినిమా నిడివి తగ్గితే బాగుండేది. 

హంతకుడు ఎందుకు సైకోగా ఎందుకు మారాడో బలంగా చెప్పలేకపోయారు. అక్కడక్కడా లాజిక్ లోపించింది. కథనంలో బలం లేనప్పుడు కూడా, సంగీత దర్శకుడు నవనీత్ శామ్ కొన్ని ఉత్కంఠభరితమైన సన్నివేశాలలో అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించి ఆ సీన్లను నిలబెట్టారు.

అలాగే, హేమంత్ ఆచార్య కెమెరా పనితనం ఆ భయాందోళనలను,ఉత్కంఠను ప్రేక్షకులు ప్రత్యక్షంగా ఫీల్ అయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది. డార్క్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు  ‘Second Case of Seetharam’ ని ఒకసారి చూడవచ్చు.ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!