Murder mystery story ……….
తమిళంలో రూపొందిన ‘తీయవర్ కులై నడుంగ’ చిత్రాన్ని తెలుగులో “మఫ్టీ పోలీస్” టైటిల్‌తో విడుదల చేశారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా. యాక్షన్ కింగ్’ అర్జున్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ ఏమిటంటే ?
చెన్నై నగరంలో ‘జెబా’ అనే ప్రముఖ రచయిత అర్ధరాత్రి దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మాగుడపతి (అర్జున్) రంగంలోకి దిగి అనుమానితులను తనదైన శైలిలో విచారించడం ప్రారంభిస్తాడు.
మరోవైపు, అదే నగరంలో మీరా (ఐశ్వర్య రాజేష్) బధిరుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఆమెకు ఆది (ప్రవీణ్ రాజా) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఆది తన మానసిక స్థితి సరిగ్గా లేని తల్లిని ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంచి చూసుకుంటూ ఉంటాడు.
రచయిత జెబా హత్యకు, మీరా-ఆదిల జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు హంతకుడు ఎవరు? మాగుడపతి ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు? అనేదే మిగిలిన కథ.
పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ తన గంభీరమైన నటనతో వన్-మ్యాన్ షో చేశాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఐశ్వర్య రాజేష్ పాత్ర సినిమాలో కీలకమైనది. పాత్రలో ఒదిగి పోయి తన పరిధి మేరకు చక్కటి నటనను కనబరిచింది. కథను మలుపు తిప్పే బాలిక పాత్రను ‘అనిక’ పోషించారు. కేవలం ఒక సాధారణ క్యారెక్టర్‌లా కాకుండా, రచయిత జెబా మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్‌లో ఒక కీలకమైన లింక్‌గా మారుతుంది.
ఆటిజం ఉన్న పిల్లల బాడీ లాంగ్వేజ్, వారి ప్రవర్తన, సమాజంతో వారు కమ్యూనికేట్ చేసే విధానాన్ని ‘అనిక’ చాలా అద్భుతంగా, ఎక్కడా అతిగా అనిపించకుండా ఎంతో సహజంగా పండించారు. సాధారణంగా ఇలాంటి డిజార్డర్ ఉన్న పాత్రల్లో నటించడం కష్టం, కానీ చిన్న వయసులోనే ‘అనిక’ ఈ సినిమాలోని సస్పెన్స్ మూడ్‌కు తగ్గట్టుగా చాలా చక్కగా నటించి మెప్పించారు. ఇతర నటులు కూడా బాగా చేశారు.
కథలో ఊహించని ట్విస్టులు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. ట్విస్టులు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫస్టాఫ్‌లో కథనాన్ని కొద్దిగా స్లోగా నడపడం మినహాయిస్తే, ఒక సామాజిక అంశాన్ని క్రైమ్ థ్రిల్లర్‌కు ముడిపెట్టి చక్కటి సినిమాను అందించడానికి దినేష్ లక్ష్మణన్ ప్రయత్నించారు.
ఒక సాధారణ మర్డర్ మిస్టరీలా సినిమాను ప్రారంభించి, అపార్ట్‌మెంట్‌లోని ప్రతి క్యారెక్టర్‌పై అనుమానం కలిగేలా స్క్రీన్‌ప్లేను నడిపించడంలో దర్శకుడిగా మంచి ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
బిజీగా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. ఈ చిత్రానికి సుందరమూర్తి కేఎస్ సంగీతాన్ని అందించారు. ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు పాటల కంటే నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. ఆ విషయంలో ఆయన మంచి మార్కులు కొట్టేశారు.
ఈ సినిమాకు విఘ్నేష్ రాజ్ కెమెరామెన్‌గా పనిచేశారు. థ్రిల్లర్ సినిమాలకు లైటింగ్, ఫ్రేమింగ్ చాలా ముఖ్యం.ఇన్వెస్టిగేషన్ సమయంలో నటీనటుల ముఖాల్లోని అనుమానాన్ని, భయాన్ని చూపించడానికి వాడిన క్లోజప్ షాట్స్ చాలా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. మొత్తంగా చెప్పాలంటే, నెమ్మదైన కథనానికి ఈ రెండు సాంకేతిక విభాగాలు (సంగీతం, కెమెరా) తమ పనులతో మంచి సపోర్ట్ ఇచ్చి సినిమాను నిలబెట్టాయి.
ఈ సినిమా చాలా పరిమితమైన బడ్జెట్‌తో, తక్కువ ప్రమోషన్లతో థియేటర్లలోకి వచ్చింది. థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా దేశవ్యాప్తంగా దాదాపు ₹6 కోట్ల నుండి ₹6.8 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చిన్న బడ్జెట్ సినిమా కావడం వల్ల పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్‌కు చేరింది.
నటీనటుల ప్రదర్శన, క్లైమాక్స్ బాగున్నప్పటికీ, కథనం కాస్త ముందే ఊహించేలా ఉండటంతో థియేటర్లలో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. థియేటర్ల కంటే కూడా ఆహా , సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైన తర్వాత ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌కు ఆడియన్స్ నుండి మంచి వ్యూస్‌తో కూడిన సానుకూల స్పందన లభిస్తోంది.యూట్యూబ్ లో కూడా ఉంది ..ఆసక్తి ఉన్నవారు చూడ వచ్చు.

