Sai Vamshi……….
భాగ్యరాజా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘సువరిల్లాద చిత్తిరంగల్’ సినిమా ఇవాళ చూశాను. ‘సువరిల్లాద చిత్తిరంగల్’..అంటే ‘కాన్వాస్ లేని చిత్రాలు’ అని అర్థం. మన తెలుగు నటుడు సుధాకర్ ఇందులో హీరో. అందులో భాగ్యరాజా సెకండ్ హీరో వేషం వేశారు.
చూసి తీర్చాల్సిన సినిమా. విషాదాంత ప్రేమకథ. జనాలు హిట్ చేశారు. ఇదే సినిమా తెలుగులో ‘పేదల బ్రతుకులు’గా రీమేక్ అయ్యింది. ఇక్కడ సుధాకర్ హీరోగా చేస్తే.. నారాయణరావు సెకండ్ హీరో వేషం వేశారు.
శ్రీధర్, కె.బాలచందర్, భీమ్‌సింగ్, మహేంద్రన్, భారతీరాజా..ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమిళ సినిమాకు నుడికారం..కట్టుబొట్టు..పలుకు పద్ధతి నేర్పుతున్నారు. ముత్యాల్లాంటి సినిమాలు వస్తున్నాయి. జనం చూస్తున్నారు. ఆదరిస్తున్నారు.
మహేంద్రన్, భారతీరాజా సినిమాను నేరుగా జనాల మధ్యకు తీసుకెళ్లారు. చేలల్లో, పొలాల్లో, గొడ్ల సావిట్లో భారతీరాజా కెమెరా పెడితే.. అందమైన పార్క్‌ల్లో, జనసంచారం లేని రోడ్లలో, గంభీరమైన ఊరి రచ్చబండల మధ్య మహేంద్రన్ కథ నడుపుతున్నారు. అంతా బాగుంది.
కానీ ఏదో కొత్తదనం కావాలి. అది లేకపోతే జనాలు మెచ్చరు. జనం మెచ్చని సినిమాకు కాసుల వర్షం కురవదు. నిర్మాత ఒడ్డున పడడు. తమిళ సినిమాకు కొత్త ‘కమర్షియల్ ఫార్ములా’ కావాలి. అది పట్టుకుని వచ్చినవాడు భాగ్యరాజా. భారతీరాజా దగ్గర అసిస్టెంట్‌గా చేరి ‘పదినారు వయదినిలే’, ‘కిళక్కే పోగుమ్ రైల్’ సినిమాలకు పనిచేశారు.
‘కిళక్కే పోగుమ్ రైల్’, ‘టిక్ టిక్ టెక్’ సినిమాలకు స్క్రిప్ట్, ‘సిగప్పు రోజాకల్’ సినిమాకు డైలాగులు కూడా రాశారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశారు. భారతీరాజా..భాగ్యరాజా.. భలే కాంబినేషన్. అక్కడున్నప్పుడే తన సినిమాకు అన్నీ సిద్ధం చేసుకొని 1979లో ‘సువరిల్లాద చిత్తిరంగల్’ సినిమాతో డైరెక్టర్ అయ్యారు. అదే సంవత్సరం భారతీరాజా దర్శకత్వంలో ‘పుదియ వార్పుగల్’ సినిమాతో హీరోగా కూడా మారారు.
ఒకే ఏడాది..రెండు కెరీర్లలో తొలి అడుగు.భాగ్యరాజా అంటే బ్రహ్మాండమైన స్క్రీన్‌ప్లే. భారతదేశంలో ఉన్న బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్స్‌లో ఆయన ఒకరు. ఆయన సినిమా అంటే ఫుల్ ఎంటర్టైనింగ్. ఆద్యంతం వినోదాత్మకం. ‘చెప్పే కథ ఏదైనా కానీ.. వినోదంతో కలిపి చెప్తే జనం చూస్తారు’ అనేది ఆయన సక్సెస్ ఫార్ములా. అలాగని కథలు గాలికొదిలేసే రకం కాదు. కథ బలంగా ఉన్నప్పుడే స్క్రీన్‌ప్లే సరిగ్గా ఉంటుందని నమ్మిన రచయిత.
ఒక నాయీబ్రాహ్మణ అబ్బాయి బ్రాహ్మణుల ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడమనేది చాలా సీరియస్ అంశం. కానీ ఆ కథ భాగ్యరాజా చేతిలో పడ్డాక బోలెడంత హ్యూమర్ కలిసింది. కొత్త క్యారెక్టర్స్ పుట్టాయి. సెంటిమెంట్ బలంగా పండింది. సినిమా బ్రహ్మాండమైన హిట్టయ్యింది. అదే ‘ఇదు నమ్మ ఆలు’ సినిమా. దానికి ఆయన దర్శకుడు కాదు. కానీ అన్నీ ఆయనే చూసుకున్నారు.
ఈ సినిమాను తెలుగులో ‘నేనూ మీ వాడినే’ పేరుతో డబ్ చేశారు. ఇక్కడా బాగా ఆడింది. ఆ తర్వాత అదే కథతో మోహన్‌బాబు హీరోగా ‘అదిరింది అల్లుడు’ సినిమా తీశారు.ఒక వ్యక్తికి భార్య బతికుండగా మరొకరితో సంబంధం ఉండటం తప్పు. పెళ్లి చేసుకోవడాన్ని చట్టం ఒప్పదు. అయితే మాత్రం మగబుద్ధి ఆగుతుందా? పరిపరివిధాల పోతుంది. ఆ బుద్ధిని తమకు అనుకూలంగా మార్చుకునే మనుషులు ఎల్లప్పుడూ ఉంటారు.
అటువంటివాళ్ల నుంచి భర్తను కాపాడుకునే భార్య కథ సినిమా తీస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు? సెన్సార్ కన్నెర్ర చేయదా? భాగ్యరాజా ఉండగా భయమేల? ‘చిన్నవీడు’ సినిమా చేసి చూపించారు. ఇదే తెలుగులో ‘చిన్న ఇల్లు’ పేరుతో డబ్ అయ్యింది. రెండు చోట్లా మంచి హిట్. తర్వాత కాలంలో వచ్చిన ‘కితకితలు’ సినిమాకు ఇదే ప్రేరణ. ‘చిన్న ఇల్లు’ అనే పదం తెలుగులో పాపులర్ అవ్వడానికి ఈ సినిమా కారణం కావొచ్చు.
ఎన్ని సినిమాల గురించి చెప్పుకున్నా భాగ్యరాజా అంటే టక్కున గుర్తొచ్చేది ‘ముందానై ముడిచ్చు’. అంటే ‘కొంగుముడి’ అని అర్థం. పల్లెటూరి గడుసు పిల్ల తన ఊరికి వచ్చిన మాస్టారును ప్రేమించి..అతణ్ని సాధించి..పెళ్లి చేసుకొని..తన కాపురాన్ని చక్కదిద్దుకోవడం కథ. మొత్తం పల్లె వాతావరణం. 14 ఏళ్ల ఊర్వశి హీరోయిన్. ‘ఈ సినిమా ఎవరు చూస్తారబ్బా?’ అని అందరూ పెదవి విరిచారు.
భాగ్యరాజా ధైర్యంగా నిలబడ్డారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో ‘మూడు ముళ్లు’ పేరుతో రీమేక్ అయ్యింది. కన్నడ, హిందీ భాషల్లోకి కూడా వెళ్లింది. భాగ్యరాజా చక్కటి నటుడు. అమాయకత్వం, గడుసుదనం కలగలిసిన ముఖం. ఆయన నవ్వితే మనకూ నవ్వొస్తుంది. ఏడిస్తే మనకూ ఏడుపొస్తుంది.
తనకు ఎలాంటి పాత్రలు సూట్ అవుతాయో తెలుసుకొని..అలాంటి పాత్రల్ని డిజైన్ చేసుకొని నటించారు. అందుకే దర్శకుడిగా ఎంత బలంగా నిలబడ్డారో..హీరోగానూ అంత చక్కటి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో నేరుగా హీరోగా చేయలేదు కానీ, ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయిన కారణాన తెలుగు కుర్రకారు కూడా ఆయన మీద అభిమానం పెంచేసుకుంది.
‘భాగ్యరాజా లాంటి మొగుడు రావాలి’ అని అమ్మాయిలు కోరుకునే కాలమొకటి నడిచింది. ఒకవైపే చెప్పుకుంటే ఎలా? పంటికింద రాళ్లని కూడా ప్రస్తావించాలి. సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగుల పరంపరకు భాగ్యరాజా ఆద్యుడు కాకపోయినా..ఆ పద్ధతిని బలంగా వాడిన వ్యక్తిగా ఆయన మీద కొందరికి కినుక.
కొందరు హీరోయిన్లను అవసరానికి మించి గ్లామర్‌గా చూపించడం.. సెక్సీ సాంగ్స్ పెట్టడం.. ‘మునక్కాయ తింటే మగాడు మంచం మీద విజృంభిస్తాడు’ లాంటి డైలాగులు..‘సబ్బు మీద కాలేసి జారితే కౌగిట్లో పడటం’ లాంటి ఎక్స్ప్రెషన్స్..అన్నీ ఆయన సినిమాల్లో ఉన్నాయి. అక్కడక్కడా శృంగారం మితిమీరినట్టు ఉంటుంది.
పిల్లలున్న బ్రహ్మచారులు కొంచెం ఇబ్బంది పడుతూ సినిమా చూశారు. ‘భాగ్యరాజా భలే తీస్తాడురా’ అనుకుంటూ మామూలు మనుషులు సంతోషంగా సినిమా చూశారు. మొత్తానికి సినిమాను ఆసాంతం వినోదాత్మకంగా తీయడం భాగ్యరాజాకు తెలుసని ఏకగ్రీవంగా అంగీకరించారు.
బాపు గారు తీసిన ‘రాధాకల్యాణం’, ఇ.వి.వి తీసిన ‘అబ్బాయిగారు’, కె.రాఘవేంద్రరావు తీసిన ‘సుందరాకాండ’..ఇలా చాలా సినిమాలకు భాగ్యరాజా సినిమాలే మూలం. విశేషంగా చెప్పుకోవాల్సింది ‘మగధీర’ తమిళ డబ్బింగ్ సినిమా ‘మావీరన్’ గురించి. మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు ‘మావీరన్’ పేరుతో తమిళంలోకి డబ్ అయిన ‘మగధీర’ సినిమాకు మాటలు రాశారు.
భాగ్యరాజా తన జీవితంలో డబ్బింగ్ సినిమాకు మాటలు రాయడం అదే మొదలు..అదే చివర.భాగ్యరాజా నమ్మ ఆళు. అంటే మనవాడని అర్థం. ఆయన మూలాలు తెలుగు నేల మీద ఉన్నాయి. తాతముత్తాతల కాలంలోనే అంతా తమిళనాడుకు వలస వెళ్లిపోయారు. ‘మా ఇంట్లో తెలుగు కలిసిన తమిళం మాట్లాడతామని’ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పుకున్నారు.
తమిళనాడు కమ్మవారి ఫంక్షన్లలో కూడా పాల్గొన్నారు. ఆయన భార్య పూర్ణిమ తెలుగులో ‘మంత్రిగారి వియ్యంకుడు’లో చిరంజీవి పక్కన నటించారు. కొడుకు శాంతను భాగ్యరాజ్ కూడా హీరోగా నటించారు. కూతురు శరణ్య. అజాతశత్రువుగా బతికిన భాగ్యరాజా ఆఖరిగా ’35 చిన్నకథ కాదు’, ‘కుబేర’ అనే రెండు తెలుగు సినిమాల్లో నటించారు. రెండూ చక్కటి పాత్రలు.
తెలుగువాళ్లకు అలా చివరి వీడ్కోలు చెప్పారు.తన గురువు భారతీరాజా మరణించిన కొద్ది రోజులకే భాగ్యరాజా కూడా మరణించడం ఊహించని విషాదం. ఆయనకు నివాళి.

