Village Love Story …….
‘ఆరాధన’ (1987) మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, లెజెండరీ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం. యాక్షన్ హీరోగా అలరించే చిరంజీవి, తన మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఒక క్లాసిక్ లవ్ స్టోరీలో నటించిన సినిమా ఇది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం, భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ క్లాసిక్ ‘కడలోర కవితైగళ్’ (1986) కు రీమేక్.
కథేంటి?
పులిరాజు (చిరంజీవి) ఒక చదువురాని, ఊరి ప్రజలను వేధించే ఒక పల్లెటూరి రౌడీ. అదే గ్రామానికి జెన్నీ (సుహాసిని) అనే ఒక క్రైస్తవ యువతి స్కూల్ టీచర్‌గా వస్తుంది. పులిరాజు ప్రవర్తనను చూసి మొదట్లో అసహ్యించుకున్న జెన్నీ, ఆ తర్వాత అతనిలోని మంచిదనాన్ని గుర్తించి అతనిని మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ప్రభావంతో పులిరాజు తన రౌడీయిజం వదిలేసి చదువుకోవడం మొదలుపెడతాడు, అలాగే ఆమెను అమితంగా ఆరాధిస్తాడు.
పులిరాజును చిన్నప్పటి నుండి బావ అని పిలుస్తూ, అతనినే పెళ్లి చేసుకోవాలనుకునే గంగమ్మ (రాధిక) ఒకవైపు.. జెన్నీ తండ్రి ఆమెకు పెళ్లి చేయాలనుకునే లారెన్స్ (డాక్టర్ రాజశేఖర్) మరోవైపు ఉంటారు. ఈ విభిన్నమైన వ్యక్తుల మధ్య పులిరాజు-జెన్నీల ‘ఆరాధన’ ఏ తీరానికి చేరింది అనేదే మిగిలిన కథ.
చిరంజీవి కెరీర్‌లో ఆయన చేసిన బెస్ట్ పాత్రల్లో ‘పులిరాజు’ పాత్ర ఒకటి. ఒక తాగుబోతు రౌడీగా ప్రథమార్ధంలో మాస్ మేనరిజమ్స్ చూపిస్తూనే, ద్వితీయార్ధంలో ఒక టీచర్ పట్ల ఉండే గౌరవాన్ని, ప్రేమాభిమానాలను తన కళ్లలోనే పలికించి అద్భుతంగా నటించారు.
స్కూల్ టీచర్ జెన్నీగా సుహాసిని ఎంతో హుందాగా నటించారు. రౌడీ బావను అమాయకంగా ప్రేమించే పల్లెటూరి పడుచుగా రాధిక నటన కూడా సినిమాకు పెద్ద అసెట్.
సినిమాలో చిరు ఎంట్రీ బాగుంటుంది. రాధిక తలుపు చాటునుంచి చిరును చూసే సీన్,చిరు స్కూల్ కి వచ్చే సీన్, టీచర్ చదువు చెప్పండి అంటూ సుహాసినిని అడిగే సీన్ బాగుంటాయి. చిరు ఒంటికాలిపై నిలబడే సీన్,సుహాసిని పరుగెత్తుకుంటూ వచ్చే సీన్ అభిమానులను ఆకట్టుకుంటాయి. రాజశేఖర్ దగ్గర చిరు ఇంగ్లిష్ మాటాడే సీన్ తమాషాగా ఉంటుంది.
‘పులిరాజు నువ్వు సగం మృగానివి..సగం మనిషివి ..అది నీపేరులోనే ఉంది.” పాల సీసాలు తాగే వయసులో నేర్చుకోవలసిన బాలశిక్ష ..సారా సీసాలు తాగే వయసులో నేర్చుకోకూడదు.” ఈ మేక నాలా అనాధ ..నాలా దానికి ఇంగ్లిష్ రాదు. వంటి డైలాగులు బాగున్నాయి. జమకజమజంజం ,,, టముకు టమా టం టం … చిరు ఊతపదమది.
ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం బాగుంటుంది. అరె ఏమైంది పాట ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ ..మిగతా పాటలు కూడా బాగానే ఉంటాయి. సముద్రతీర వాతావరణాన్నివిజువల్ గా చూపించడంలో భారతీరాజా మార్కు స్పష్టంగా కనిపిస్తుంది.
అప్పట్లో చిరంజీవి నుంచి కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలు ఆశించే ప్రేక్షకులకు, ఈ క్లాస్ లవ్ స్టోరీ కాస్త భిన్నంగా అనిపించి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే స్పీడ్ ఇందులో లోపించింది.
‘ఆరాధన’ అనేది అప్పట్లో కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినా, కాలక్రమేణా ఒక ‘కల్ట్ క్లాసిక్’ గా రూపాంతరం చెందింది. చిరంజీవిలో కేవలం యాక్షన్ హీరోనే కాకుండా నటుడిని చూడాలనుకునే వారికి, ఇళయరాజా మ్యూజిక్ ప్రేమికులకు ఈ సినిమా ఒక అద్భుతమైన దృశ్యకావ్యం.
సముద్రతీర నేపథ్యంలో సాగే ఈ క్లాసిక్ ప్రేమకథలో కన్నన్ ఫోటోగ్రఫీ అద్భుతమని చెప్పుకోవచ్చు. కన్నన్ ఎక్కువగా ఇండోర్ సెట్స్ కాకుండా అవుట్‌డోర్ లొకేషన్లలో, ముఖ్యంగా సముద్రతీర గ్రామీణ వాతావరణంలో సహజమైన సూర్యకాంతి ని వాడుకుని తీసిన విజువల్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి.
ఉదయం పూట వచ్చే లేత ఎండ, సాయంత్రం వేళల్లో సముద్రపు అలలపై పడే సూర్యాస్తమయం కాంతులను ఆయన కెమెరాలో బంధించిన విధానం సినిమాకు ఒక రొమాంటిక్, రియలిస్టిక్ లుక్‌ను తీసుకొచ్చింది.చిరంజీవి ఒంటరిగా సముద్రతీరంలో కూర్చుని సుహాసినిని తలుచుకునే సీన్లు, ఆయన పక్కనే ఒక మేక పిల్ల ఉండే షాట్స్.. ఆ పాత్రలోని ఏకాంతాన్ని, అమాయకత్వాన్ని మాటలు లేకుండా కేవలం విజువల్స్ ద్వారానే ప్రేక్షకుడికి కనెక్ట్ చేస్తాయి.
ఇళయరాజా అందించిన మెలోడీ సాంగ్స్ విజువల్ గా అంత గొప్పగా పండటానికి కన్నన్ కెమెరా వర్కే ప్రధాన కారణం ..చిరంజీవి మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఆయనలోని ‘నటుడిని’ హైలైట్ చేయడంలో కన్నన్ క్లోజప్, మిడ్-షాట్స్ బాగా ఉపయోగపడ్డాయి.
సుహాసినిని ఒక దేవతలా చిరంజీవి ‘ఆరాధించే’ ప్రతి సన్నివేశంలోనూ, ఆయన కళ్లలో కనిపించే ప్రేమను కెమెరా యాంగిల్స్ ద్వారా చాలా ఇంటెన్సివ్‌గా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రాఫర్ బి. కన్నన్ ఈ చిత్రానికి కేవలం కెమెరామెన్‌గా మాత్రమే కాకుండా, భారతీరాజా భావాలకు ఒక ‘దృశ్య రూప శిల్పి’గా వ్యవహరించారు.
ఇళయరాజా సంగీతం ఎంతగా హృదయాన్ని తాకుతుందో, కన్నన్ విజువల్స్ అంతే హాయిగా కంటికి విందు చేస్తాయి. సినిమాలో తెలుగు నేటివిటీ లోపించింది ..తమిళ పోకడ ఎక్కువ ..క్లయిమాక్స్ కొంచెం సాగదీసి నట్టు అనిపిస్తుంది. యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది ..ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు.

