కైలాష్ పరిక్రమ అక్కడ నుంచే మొదలవుతుందా ?

Sharing is Caring...

Kailash Parikrama ………..

కైలాష్ పర్వతం చుట్టూ తిరిగే పవిత్ర పరిక్రమ టిబెట్‌లోని ‘దార్చేన్’ అనే గ్రామం నుండి మొదలవుతుంది.దార్చేన్‌కు కొద్ది దూరంలో ఉండే ‘యమద్వార్’ నుండి ప్రారంభమై, తిరిగి దార్చేన్ వద్దే ముగుస్తుంది.కైలాష్ పర్వతం చుట్టూ ఉండే మొత్తం 52 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి ఖచ్చితంగా 3 రోజులు సమయం పడుతుంది.

మొదటి రోజు పరిక్రమ యమద్వార్ నుండి దిరాపుక్ (20 కి.మీ) వరకు సాగుతుంది. యమద్వార్ వద్ద నడక మొదలవుతుంది. ఇది సాపేక్షంగా కాస్త సులువైన మార్గం. ఇక్కడ నుండి కైలాష్ పర్వతం  పశ్చిమ, ఉత్తర ముఖాల అద్భుతమైన దర్శనం లభిస్తుంది. రాత్రికి దిరాపుక్ లో బస చేస్తారు. 

రెండవ  రోజు పరిక్రమ దిరాపుక్ నుండి జుతుల్పుక్ (22 కి.మీ) వరకు సాగుతుంది. ఇది ఈ యాత్రలోనే అత్యంత కష్టమైన,కఠినమైన రోజు. పరిక్రమ లో అత్యంత ఎత్తైన ప్రాంతమైన ‘డోల్మా లా పాస్’ (Dolma La Pass – 5,636 మీటర్లు) ను దాటాల్సి ఉంటుంది. నిటారైన కొండలు ఎక్కడం, దిగడం వల్ల దాదాపు 10-11 గంటల సమయం పడుతుంది. రాత్రికి జుతుల్పుక్ లో బస చేస్తారు.

మూడవ రోజు పరిక్రమ జుతుల్పుక్ నుండి దార్చేన్ (10 కి.మీ) వరకు సాగుతుంది. ఇది  సులువైన మైదాన మార్గం. దాదాపు 3-4 గంటలు నడిచి తిరిగి దార్చేన్ బేస్ క్యాంప్‌కు చేరుకోవడంతో పరిక్రమ విజయవంతంగా ముగుస్తుంది.

పరిక్రమ సాగే దిరాపుక్ , జుతుల్పుక్  ప్రాంతాలలో హోటళ్లు ఉండవు. అక్కడ కేవలం అత్యంత సాధారణమైన టెంట్ హౌస్ లు, చిన్న లాడ్జీలు మాత్రమే ఉంటాయి . ఒకే గదిలో 4 నుండి 6 బెడ్స్ ఉండే డార్మిటరీ తరహా వసతి ఉంటుంది. అందరూ కలిసి గ్రూప్‌గా పడుకోవాల్సి ఉంటుంది. భోజన సదుపాయాలు ఉంటాయి.  

ఈ 3 రోజులు కేవలం కైలాష్ పర్వతం చుట్టూ తిరగడానికి మాత్రమే సరిపోతుంది.  భారతదేశం లేదా నేపాల్ నుండి బయలుదేరి, వీసాలు, మెడికల్ చెకప్స్, వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసుకునే రోజులు కలిపితే నేపాల్ (ఖాట్మండు) రూట్ ద్వారా దాదాపు 14 నుండి 16 రోజులు పడుతుంది. భారత్ లోని లిపులేఖ్ లేదా నాథూలా పాస్ రూట్ ద్వారా దాదాపు 20 నుండి 22 రోజులు పడుతుంది.

మొత్తం యాత్ర ఖర్చు ఎంచుకునే రూట్, ప్రయాణ పద్ధతిని బట్టి మొత్తం ప్యాకేజీ ఖర్చు మారుతుంది. రోడ్డు మార్గం ₹1,75,000 నుండి ₹2,35,000 బస్సు లేదా జీపుల ద్వారా ప్రయాణం. శారీరక శ్రమ ఎక్కువ గా ఉంటుంది. 

హెలికాప్టర్ మార్గం (via Nepal)₹2,85,000 నుండి ₹3,50,000 కాట్మండు నుండి హెలికాప్టర్ ద్వారా బోర్డర్ వరకు వెళ్తారు. సమయం ఆదా అవుతుంది.భారత ప్రభుత్వం ద్వారా (MEA Route)₹1,85,000 నుండి ₹3,30,000ఇది లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. లగేజీ, మెడికల్ సపోర్ట్ బాగుంటుంది. ప్యాకేజీ కాకుండా పైన ఇరవై వేల వరకు ఖర్చు కావచ్చు.

కైలాష్ మానససరోవర్ యాత్ర రూట్ మ్యాప్ ప్రకారం, యాత్రికులందరికీ మొదట మానస సరోవర దర్శనం, అక్కడ పూజలు పూర్తయిన తర్వాత అక్కడ నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దార్చేన్ బేస్ క్యాంప్‌కు వాహనాల్లో తీసుకువస్తారు.

మరుసటి రోజు ఉదయం వాహనాలలో యమద్వార్ కు తీసుకువెళ్తారు. అక్కడ నుంచి పరిక్రమ మొదలవుతుంది.బాగా నడవగలినవారు మాత్రమే యాత్రలో పాల్గొనడం మంచిది.. లేదంటే నడవలేని వారు గుర్రాలపై వెళ్ళ వచ్చు. అది కూడా వద్దనుకుంటే  బేస్ క్యాంప్‌ లో ఉండవచ్చు. మూడు రోజుల తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన యాత్రీకులతో కలసి తిరుగు ప్రయాణం చేయవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!