ఎవరీ “నటరాజు వెంకటేశ్వరరావు”?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala …..

ఈ ఫొటోలో కనిపించే ఆయన పేరు నటరాజు కె.వెంకటేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఆయన ఊరనుకుంటాను. ఆయన బెజవాడ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రైల్వే ఉద్యోగులతోనే రసన సమాఖ్య పేరుతో ఓ నాటక సంస్ధ నిర్వహించేవారు. అలా కొంత కాలం విజయవాడలో ఉద్యోగం చేశారు.

ఆ సమయంలో డి.వి.నరసరాజు రాసిన నాటకం లో రామానుజం పాత్ర లో నటించారు వెంకటేశ్వరరావు.నిజానికి అప్పటికే ఆయన నటుడుగా తనేంటో నిరూపించుకున్నారు.’కీర్తిశేషులు’, ‘కన్యాశుల్కం’ తదితర నాటకాలతో పాపులర్ అయ్యాడు కూడా.

నటన మీదా నాటకం మీదా విపరీతమైన ఆరాధన ఉన్న నటుడు ఆయన. సినిమాల్లోకీ ప్రవేశించారాయన. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఒకటి రెండు సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలూ చేశారు.
అయితే ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమా పాత్ర మాత్రం ‘కన్నెవయసు’లో రోజారమణి తాగుబోతు తండ్రి పాత్ర. ఆ సినిమా తయారై ఇంకా విడుదల కాకముందే వెంకటేశ్వరరావు కన్నుమూశారనుకోండి.

నటన మీదున్న మమకారంతోనే రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీలోని డ్రామా స్కూల్ లో ట్రైనింగ్ తీసుకోడానికి వెళ్లారు వెంకటేశ్వరరావు. ఆయనతో పాటు పొట్టి ప్రసాద్ కూడా వెళ్లాడు. తర్వాత విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రిజిష్టార్ గా కె.వి.గోపాలస్వామి నియమితులయ్యారు.

ఆయన కె.వెంకటేశ్వరరావును డిపార్ట్ మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కు స్టేజ్ డైరక్టర్ గా తీసుకున్నారు. వెంకటేశ్వరరావు నటుడుగానే కాదు … తోటి నటుల్ని తీర్చిదిద్దడంలోనూ ఘనుడు. ఆయన తర్ఫీదులోనే పొట్టి ప్రసాదు నటుడుగా రాటుదేలాడు, దేవదాసు కనకాల, సాక్షి రంగారావు, మిశ్రో, కృష్ణ చైతన్య, వంకాయల సత్యనారాయణ తదితరులు కె.వెంకటేశ్వరరావుగారి దగ్గర శిష్యరికం చేశారు.

వీళ్లల్లో మిశ్రో, కృష్ణ చైతన్యలు బాలచందర్ , జంధ్యాల, విశ్వనాథ్ తదితర దర్శకుల చిత్రాల్లో మంచి పాత్రలే కాదు … గుర్తుండిపోయే పాత్రలే చేశారు. ఈ మధ్యే కన్నుమూసిన చాట్ల శ్రీరాములు కూడా కె.వెంకటేశ్వర్రావుగారితో పాటు రైల్వేలో పనిచేసేవారు. వీరిద్దరూ సన్నిహితులే కాదు … కలసి నాటకాలు ఆడిన వాళ్లు కూడా.

మాటలు లేని నాటకం ‘బెత్తం మనిషి’, కేవలం రెండున్నర గంటల నిడివికి కుదించిన ‘కన్యాశుల్కం’, ‘మహానటుడు’ వంటి ఎన్నో వినూత్న నాటక ప్రయోగాలకు ఆయన ఊపిరి పోశారు. డైలాగులు చెప్పడంలోనే కాదు, నటనలో నిశ్శబ్దాన్ని, కళ్ల ద్వారానే హావభావాలను ఎలా పలికించవచ్చో గొల్లపూడి మారుతీరావు రాసిన ‘రాగరాగిణి’ నాటకంలో ‘రఘు’ పాత్ర ద్వారా ఆయన నిరూపించారు.

All India Radio లో ప్రసారమై అత్యంత ప్రజాదరణ పొందిన ‘కన్యాశుల్కం’ నాటకంలో ఆయన పోషించిన ‘గిరీశం’ పాత్ర ఒక సంచలనం. ఆ గిరీశం పాత్రకు ఆయన చెప్పిన డైలాగులు, నటన ఇప్పటికీ ఆడియో సీడీల రూపంలో లభ్యమవుతున్నాయి.

కె.వెంకటేశ్వరరావు స్వయాన రచయిత నటుడు గణేశ్ పాత్రో మామగారు. పాత్రో రాసిన ‘పావలా’ తదితర నాటకాలను కూడా వెంకటేశ్వరరావుగారు రంగస్థలం మీద ప్రదర్శించారు. ‘పావలా’ ‘కొడుకు పుట్టాల’ నాటకాలు మిక్స్ చేసి ఆ తర్వాత రోజుల్లో ‘నాకూ స్వతంత్రం వచ్చింది’ పేరుతో సినిమాగా వచ్చింది. ఈ సినిమా తీసింది నటుడు కథకుడు దర్శకుడు అయిన ప్రభాకరరెడ్డి గారే!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!