ఆ ఇద్దరి కాంబినేషన్ లో సరికొత్త ప్రయోగం !!

Sharing is Caring...

 Innovative and entertaining film ….

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దాదాపు 94 ఏళ్ల వయసులో మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన అద్భుత ప్రయోగం ‘సింగ్‌ గీతం’ (Sing Geetham).ఈ చిత్రానికి సృజనాత్మక దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఇదొక సరికొత్త ప్రయోగం. ఈ సినిమాలో సాధారణ సంభాషణలు ఉండవు. కథలోని పాత్రలన్నీ తమ మాటలను కూడా పాటల రూపంలోనే మాట్లాడుకుంటాయి. మ్యూజిక్‌ను, మ్యాజికల్ రియలిజంను మిక్స్ చేసి సరికొత్త జోనర్‌లో ఈ చిత్రాన్ని డిజైన్ చేశారు.

కథాంశం ప్రకారం… ఒక మారుమూల గ్రామంలోని వ్యక్తులంతా ఒకరితో ఒకరు పాటల రూపంలోనే మాట్లాడుకుంటూ వింతగా ప్రవర్తిస్తుంటారు. ఆ గ్రామంలోకి ‘ప్రతాప్’ అనే యువకుడు అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అసలు ఆ గ్రామస్థులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అనే పాయింట్‌ను ఫుల్ కామెడీ అండ్ సస్పెన్స్‌తో తెరపై చూపుతారు.

సినిమా అంతా పాటల రూపంలోనే సాగడం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి కెరీర్‌లోనే అతిపెద్ద మ్యూజికల్ ఛాలెంజ్‌గా నిలిచింది. సినిమాలో సంగీతం నాన్-స్టాప్‌గా వస్తున్నప్పటికీ ఎక్కడా రొటీన్ మ్యూజికల్ సినిమా చూస్తున్నట్లు కాకుండా కథలో భాగమైపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ రోజుల్లో పెద్ద సినిమాలు పూర్తి కావడానికి ఏళ్ల సమయం పడుతుంటే, 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు షూటింగ్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనుల వరకు మొత్తం సినిమాను కేవలం 3 నుండి 4 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి పరిశ్రమను ఆశ్చర్యపరిచారు.

ఈ ప్రయోగాత్మక చిత్రంలో ఎక్కువ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కోసం అయాన్, అహల్యా బమ్రూ, సోషల్ మీడియా ఫేమ్ శాలిని కొండేపూడి వంటి యంగ్ యాక్టర్స్‌ను ప్రధాన పాత్ర లకు ఎంచుకున్నారు. 

“ప్రపంచంలోనే ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు, ప్రేక్షకులు ఈ సినిమాను మరో పదేళ్ల వరకైనా గుర్తుపెట్టుకుంటారు” అని నాగ్ అశ్విన్ ఎంతగానో ప్రశంసించిన ఈ వినూత్న వినోదభరిత చిత్రం కోసం సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

‘జాతిరత్నాలు’ సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా ఆద్యంతం హిలేరియస్ వినోదాన్ని అందిస్తుందని నిర్మాత గట్టి నమ్మకంతో ఉన్నారు. ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్‌ను అందించిన సింగీతం ఆధునిక ఆలోచనలతో ఈ సినిమాను రూపొందించారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!