చెట్లలోనే తల్లిని చూసుకుంటున్న సాయాజీ షిండే !!

Sharing is Caring...

A new perspective ……

వెండితెరపై క్రూరమైన విలన్‌గా, పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించిన విలక్షణ నటుడు సాయాజీ షిండే నిజజీవితంలో పచ్చని అడవులను సృష్టిస్తూ ఒక గొప్ప రియల్ లైఫ్ హీరోగా నిలిచారు. తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆయన చేసిన పర్యావరణ యజ్ఞం, ఇవాళ ఒక పెద్ద ఉద్యమంగా మారింది.  

మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సాయాజీ షిండేకు ప్రకృతి అన్నా, అడవులన్నా ప్రాణం.ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు, తన చివరి రోజుల్లో ఆమె సాయాజీతో “మొక్కలు నాటు.. ఈ భూమి రుణం తీర్చుకో” అన్నది.ఆ సమయంలో ఆమెకు 5,000 మొక్కలు నాటుతానని సాయాజీ మాట ఇచ్చారు.

కోట్ల విలువైన ఆస్తిపాస్తులు ఉన్నా కన్నతల్లిని కాపాడుకోలేకపోయాననే బాధ ఆయనను వెంటాడింది. అప్పుడే, తల్లి రూపానికి సమానమైన విగ్రహాన్నో, సమాధినో కట్టడం కంటే… పచ్చని చెట్లలో ఆమెను శాశ్వతంగా బతికించాలని నిర్ణయించుకున్నారు.

అమ్మ జ్ఞాపకార్థం ఏదైనా వినూత్నంగా చేయాలనే సంకల్పంతో, తన తల్లి బరువుకు సమానమైన బరువు గల స్వదేశీ విత్తనాలను సేకరించి రాష్ట్రవ్యాప్తంగా నాటడం ప్రారంభించారు. ప్రారంభంలో హైదరాబాద్ నుండి ఏకంగా రెండు ట్రక్కుల నిండా స్వదేశీ మొక్కలను మహారాష్ట్రకు తరలించి తన స్వగ్రామంలో నాటారు. 

పర్యావరణ సమతుల్యత కోసం కేవలం మర్రి , రావి , చింత, వేప, మామిడి వంటి స్థానిక రకాల వృక్షాలను మాత్రమే ఎంచుకున్నారు. ఇవి పక్షులకు, జీవవైవిధ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోడ్ల విస్తరణలో భాగంగా నరికివేయబడుతున్న 200కు పైగా భారీ మర్రి చెట్లను వేరే ప్రాంతాలకు సురక్షితంగా తరలించి, రీ-ప్లాంటేషన్ (పునఃప్రతిష్ఠ) చేసి కాపాడారు.

సాయాజీ షిండే ఒంటరిగా ప్రారంభించిన ఈ ప్రయాణం, క్రమంగా లక్షలాది మందిని కదిలించి ఒక సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలోనే ఆయన “సహ్యాద్రి దేవరాయ్ ” పేరిట NGO ని  స్థాపించారు. ‘దేవరాయ్’ అంటే మరాఠీలో “పవిత్రమైన అడవి” అని అర్థం.

కేవలం నాటడమే కాకుండా, ఆ మొక్కలు వృక్షాలుగా మారే వరకు స్థానిక ప్రజలను, విద్యార్థులను భాగస్వామ్యం చేసి వాటిని సంరక్షించారు. తద్వారా 29కి పైగా ప్రాంతాలలో దట్టమైన మినీ అడవులను సృష్టించారు.తల్లికి కేవలం 5,000 మొక్కలు నాటుతానని మాట ఇచ్చిన సాయాజీ షిండే, ఇప్పటివరకు మహారాష్ట్రలోని సుమారు 48 ప్రాంతాలలో ఏకంగా 6.5 లక్షలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా మార్చారు.

ఒకప్పుడు మహారాష్ట్ర నీటిపారుదల శాఖలో వాచ్‌మెన్‌గా పనిచేసిన ఆయన, ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని కూడా ఒక పెద్ద నర్సరీగా మార్చి గ్రామాలకు ఉచితంగా పచ్చదనాన్ని పంచుతున్నారు.

“ప్రతి చెట్టులోనూ మా అమ్మ బతికే ఉంది, ఆ చెట్ల నీడలోనే నేను మా అమ్మ ఒడిని చూసుకుంటున్నాను” అని సాయాజీ షిండే సగర్వంగా చెబుతారు. కన్నతల్లిపై ఉన్న ప్రేమను పర్యావరణ పరిరక్షణ అనే ఒక సుదీర్ఘ హరిత విప్లవంగా మార్చిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం.

పర్యావరణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం,పలు సామాజిక సంస్థలు ఆయనను ఎన్నో వేదికలపై ఘనంగా సత్కరించాయి.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!