Can’t he follow the party line? …………
రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు. ఇటీవల ఆప్ ఆయనను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించి, ఆ స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమించింది.రాఘవ్ చద్దా రాజ్యసభలో కీలక అంశాల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.
రాఘవ్ చద్దా ఎవరు?
ఆప్ పార్టీ ఆవిర్భావం నుండి ఆయన క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఢిల్లీలోని రాజేందర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పనిచేశారు. 2022లో పంజాబ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాని వివాహం చేసుకున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన సమయంలో రాఘవ్ చద్దా విదేశాల్లో ఉండటం, తిరిగి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యకలాపాలకు, ప్రచారాలకు కొంత దూరంగా ఉండటంపై పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారని, అలాగే రాజ్యసభలో తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. పార్టీ నిర్ణయాలతో ఆయన ఎప్పుడూ ఏకీభవించడం లేదని, క్రమశిక్షణారాహిత్యానికి సంబంధించిన అంశాలు కూడా ఈ మార్పునకు కారణమని భావిస్తున్నారు.
కొత్తగా నియమితులైన అశోక్ మిట్టల్ మాత్రం ఇది ఒక సాధారణ ప్రక్రియ అని, అందరు ఎంపీలకు బాధ్యతలు నేర్చుకునే అవకాశం ఇవ్వడంలో భాగంగానే ఈ మార్పు జరిగిందని చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని, ముఖ్యంగా సమోసాల ధరలు తగ్గించాలని రాఘవ్ చద్దా పార్లమెంటులో ప్రస్తావించారు.
దీనిపై ఆప్ స్పందిస్తూ, “పార్లమెంటులో మనకు లభించే కొద్ది సమయాన్ని దేశాన్ని కాపాడటానికి ఉపయోగించాలి కానీ, విమానాశ్రయాల క్యాంటీన్లలో సమోసా ధరల గురించి చర్చించడానికి కాదు” అని ఎద్దేవా చేసింది.
రాఘవ్ చద్దా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే అంశాలపై దృష్టి పెడుతున్నారని, ఇది కేవలం ఆయన వ్యక్తిగత ప్రచారం కోసమేనని ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
గుజరాత్లో పార్టీ కార్యకర్తల అరెస్టులు, పంజాబ్ రాష్ట్ర సమస్యలు, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం వంటి కీలక రాజకీయ అంశాలపై ఆయన మౌనంగా ఉంటున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. విపక్షాలు సభ నుండి వాకౌట్ చేసినప్పుడు వారితో ఆయన వెళ్ళకపోవడం, ముఖ్యమైన తీర్మానాలపై సంతకాలు చేయక పోవడం వంటి చర్యలు ఆయన మోదీ ప్రభుత్వానికి భయపడుతున్నారనే సంకేతాలు ఇస్తున్నాయని ఆప్ నేత అనురాగ్ ధండా విమర్శించారు.
రాజ్యసభలో పార్టీకి లభించే పరిమిత సమయాన్ని ఆయన పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా, తన ఇమేజ్ పెంచుకునే చిన్నపాటి అంశాలకే వాడుకుంటున్నారని ఆప్ భావించి ఆయనను పదవి నుండి తొలగించింది.ఇటీవల కాలంలో రాఘవ సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందే చిన్నపాటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.. వాటికి ఆదరణ కూడా బాగుంది.
విమానాశ్రయాల్లో టీ ₹250, సమోసా ₹350 వంటి అత్యధిక ధరలకు అమ్ముతున్నారని, వీటిని తగ్గించి ‘ఉడాన్ యాత్రి కేఫ్’ ద్వారా తక్కువ ధరకే అందించాలని ఆయన పట్టుబట్టారు. దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందిస్తూ, “దేశం కోసం పోరాడాల్సింది పోయి, విమానాశ్రయాల్లో సమోసాల రేట్లు, పిజ్జా డెలివరీ గురించి మాట్లాడటం ఏంటి?” అని ప్రశ్నించారు.
టెలికాం కంపెనీలు 28 రోజుల రీఛార్జ్ ప్లాన్లను అమలు చేయడం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, వాటిని పూర్తి క్యాలెండర్ నెల (30 లేదా 31 రోజులు) ఉండేలా చేయాలని ఆయన రాజ్యసభలో ప్రతిపాదించారు. బ్యాంకు ఖాతాలలో కనీస నిల్వ (Minimum Balance) లేనందుకు బ్యాంకులు వసూలు చేసే జరిమానాలను పూర్తిగా రద్దు చేయాలని ఆయన కోరారు.
జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) వంటి సంస్థల డెలివరీ భాగస్వాములకు సామాజిక భద్రత కల్పించాలని, 10 నిమిషాల డెలివరీ మోడల్ వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఉందని ప్రస్తావించారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు, టీచర్ల కంటెంట్‌ను తప్పుగా తొలగించకుండా కాపీరైట్ చట్టాల్లో మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు పెయిడ్ పితృత్వ సెలవులు ఇచ్చేలా చట్టపరమైన నిబంధనలు తేవాలని ఆయన కోరారు.
ఈ అంశాలు సామాన్య ప్రజలకు సంబంధించినవే అయినప్పటికీ పార్టీ లైన్ కూడా ఫాలో అవ్వాలి.అలా జరగకపోతే ఏపార్టీ కైనా సభ్యులపై కోసం వస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, దేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు వంటి కీలక రాజకీయ పోరాటాల సమయాల్లో ఆయన మౌనంగా ఉన్నారు..
రాఘవ చద్దా మాత్రం తాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని పార్టీ పేరుకు (ఆమ్ ఆద్మీ) తగ్గట్టుగానే తాను సామాన్యుల సమస్యలపై దృష్టి పెట్టానని, ఇందులో తప్పేమీ లేదని అంటున్నారు. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది.

