ఆయన పోటీ చేసేది పెరంబూరు నుంచేనా ?

Sharing is Caring...

 A constituency with strong opponents……………..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడైన హీరో విజయ్, చెన్నైలోని పెరంబూర్ (Perambur) నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. తొలుత మధురై ఈస్ట్, వెలచ్చేరి లేదా తిరుచ్చి ఈస్ట్ వంటి పేర్లు వినిపించినప్పటికీ, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పెరంబూర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఒకటి రెండు రోజుల్లో విజయ్ మొత్తం 234 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. DMK  పార్టీ పెరంబూర్ లో బలంగా ఉంది. 2021ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఆర్.డి.శేఖర్ 54,976 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. 2019 లో వచ్చిన ఉప ఎన్నికలో కూడా 68,023 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇక్కడ అన్నా డీఎంకే కి కూడా కొంత బలం ఉంది. విజయ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే బహుముఖ పోటీ ఉండవచ్చు. ఇక్కడైతే గెలుపుకు అవకాశం ఉందని పార్టీ సర్వేలలో తేలిందని అంటున్నారు.
 
పెరంబూర్ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నప్పటికీ, భౌగోళికంగా, సామాజికంగా కొన్ని వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో దళిత ఓటర్ల సంఖ్య చాలా గణనీయంగా ఉంటుంది. మొత్తం జనాభాలో వీరి నిష్పత్తి సుమారు 23.68% గా అంచనా. 1977 నుండి 2006 వరకు ఇది రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉండటం వల్ల కూడా ఇక్కడ వీరి ప్రాబల్యం ఎక్కువ.
 
ఉత్తర చెన్నైలోని ఇతర ప్రాంతాల తరహాలోనే పెరంబూర్‌లో కూడా వన్నియర్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ముదలియార్లు, నాడార్లు కూడా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.  వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవు. వడైయార్ (Wodeyar), తేవార్ (Thevar) సామాజిక వర్గాలతో పాటు క్రైస్తవ మైనారిటీల ఓట్లు కూడా ఇక్కడ కీలకం.

ఈ నియోజకవర్గం ప్రధానంగా కార్మిక, మధ్యతరగతి (Working Class) ప్రజలతో కూడిన ప్రాంతం. ముఖ్యంగా రైల్వే, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు ఇక్కడ ఎక్కువగా నివసిస్తుంటారు. విజయ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న నాయకులకు ఈ తరహా సామాజిక సమీకరణాలు అనుకూలంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) తరపున పెరంబూర్ నియోజకవర్గం నుండి మార్చి 30, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. విజయ్ మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది.2026, ఏప్రిల్ 23. పోలింగ్ జరుగుతుంది.2026, మే 4 ఫలితాలు వెలువడుతాయి.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!