“Lifeline” for Iran’s economy………………..
ఖర్గ్ (Kharg) ద్వీపం ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన చమురు ఎగుమతుల కేంద్రం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపంపై దాడులకు ఆదేశాలు జారీ చేయడంతో దాని పేరు వార్తల్లో కెక్కింది. ఇరాన్ తన మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90% నుండి 95% వరకు ఈ ద్వీపం నుండే నిర్వహిస్తుంది.
ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు “ఆయువుపట్టు” వంటిది. ఇక్కడ భారీ ఆయిల్ టెర్మినల్స్, నిల్వ ట్యాంకులు, పైప్‌లైన్లు, ఒక విమానాశ్రయం ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపం లోతైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది.ఇక్కడ ఉన్నఓడ రేవులు భారీ ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు అనువుగా ఉంటాయి.
ట్రంప్ ఎందుకు దీనిపై కన్నేశాడు?
డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపాన్ని ఇరాన్ ఆర్థిక కిరీటం” (Crown Jewel) గా అభివర్ణించారు. ట్రంప్ ఈ ద్వీపంపై దృష్టి పెట్టడానికి కారణం ఇరాన్ ఆర్ధికంగా దెబ్బ తీయాలన్న ఆలోచనే.ఇరాన్ చమురు రంగాన్ని నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను అడ్డుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ ద్వీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలు, వాయు రక్షణ వ్యవస్థలు, నౌకాదళ కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ప్రస్తుతం చమురు మౌలిక సదుపాయాలను నేరుగా ధ్వంసం చేయనప్పటికీ, ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే వాటిని కూడా లక్ష్యం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
ఈ ద్వీపంపై నియంత్రణ సాధిస్తే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం పెరుగుతుందని, అలాగే చైనాకు వెళ్లే ఇరాన్ చమురును అడ్డు కోవచ్చు. అందుకే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ఖర్గ్ ద్వీపంపై “సరదాగా మరిన్ని దాడులు చేస్తాం” అని వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఇరాన్ దేశంలోని చమురు బావులు (Oil Wells) అన్నీ ఖర్గ్ ద్వీపంలో లేవు. ఖర్గ్ ద్వీపం ప్రధానంగా చమురును నిల్వ చేసే, ఎగుమతి చేసే (Export Terminal) కేంద్రం మాత్రమే. ఇరాన్‌లోని ప్రధాన చమురు బావులు ఎక్కువగా ఆ దేశ భూభాగం (Mainland) మీద, ముఖ్యంగా నైరుతి ప్రాంతంలోని ఖుజెస్తాన్ (Khuzestan) ప్రావిన్స్‌లో ఉన్నాయి.
అలాగే పర్షియన్ గల్ఫ్ సముద్ర గర్భంలో కూడా కొన్ని బావులు ఉన్నాయి.ఆ బావుల నుండి పైప్‌లైన్ల ద్వారా ముడి చమురును ఖర్గ్ ద్వీపానికి తరలిస్తారు. అక్కడ ఉన్న భారీ ట్యాంకుల్లో చమురును నిల్వ చేసి, ఆ తర్వాత పెద్ద పెద్ద ఓడల (Tankers) ద్వారా ఇతర దేశాలకు పంపిస్తారు.
బావులు వేరే చోట ఉన్నప్పటికీ, ఆ చమురు బయట ప్రపంచానికి వెళ్లాలంటే ఖర్గ్ ద్వీపం దాటాల్సిందే. అందుకే ట్రంప్ ఆ ద్వీపాన్ని దెబ్బతీస్తే, ఇరాన్ చమురు వ్యాపారం స్తంభించిపోతుందని భావిస్తున్నారు.
ఖర్గ్ ద్వీపంపై దాడి చేసి ,అక్కడి చమురు నిల్వల కేంద్రాలను ధ్వంసం చేస్తే మటుకు అది అనాలోచిత చర్య అవుతుంది.
ఇరాన్ నుంచి వెళ్లే చమురు నిలిచిపోతే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత ఏర్పడుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు (ద్రవ్యోల్బణం) పెరిగే ప్రమాదం ఉంది.
ఎగుమతి కేంద్రాలకు నష్టం జరిగితే మటుకు ఇరాన్ ఊరుకోదు. లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హుతీలు వంటి గ్రూపుల ద్వారా అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై దాడులు పెంచవచ్చు. ఇది ఒక పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.
ఖర్గ్ వద్ద ఉన్న భారీ ఆయిల్ టెర్మినల్స్ దెబ్బతింటే, లక్షల టన్నుల ముడి చమురు పర్షియన్ గల్ఫ్ సముద్రంలో కలుస్తుంది. ఇది సముద్ర జీవులకు, ఆ ప్రాంత పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తుంది. ఇరాన్ చమురును ఎక్కువగా కొనేది చైనా. ఖర్గ్ పై దాడి వల్ల చైనాకు చమురు సరఫరా ఆగిపోతే, అమెరికా-చైనా మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయి.
ట్రంప్ కేవలం ఇరాన్‌ను భయపెట్టి, వారిని చర్చల టేబుల్ దగ్గరకు తీసుకురావాలని లేదా వారి అణు కార్యక్రమాలను ఆపాలని చూస్తున్నారు. కానీ, నిజంగా పూర్తిస్థాయి దాడి జరిగితే అది “తేనెతుట్టెను కదిలించినట్టే” అవుతుందని నిపుణులు అంటున్నారు.

