folk movie …………………
చిక్కడు దొరకడు………జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా ఇది. 1967లో విడుదలైన ‘చిక్కడు దొరకడు’ జానపద చిత్రం అప్పట్లో భారీ వాణిజ్య విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘చిక్కడు’ గా , కాంతారావు ‘దొరకడు’ గా ప్రధాన పాత్రలు పోషించారు.
వీరిద్దరూ సమాన స్థాయి ఉన్న జానపద వీరులుగా నటించడం ప్రేక్షకులను అలరించింది. జయలలిత, కృష్ణకుమారి కథానాయికలుగా నటించారు. మూడు హారాలు … గుప్త నిధి కోసం వేట …రాజ్యాన్ని దుష్టశక్తుల నుండి కాపాడటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
బి. విఠలాచార్య ఆకట్టుకునే సన్నివేశాలతో, మంచి పాటలతో సినిమాను రూపొందించారు. ఎన్టీఆర్ సాహసాలు, కాంతారావు కత్తియుద్ధాలు, ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇది కేవలం ఒక సాహస కథ మాత్రమే కాకుండా, చక్కని హాస్యం, వినోదాన్ని కూడా అందిస్తుంది. ‘చిక్కడు దొరకడు’ చిత్రంలో నటీనటులు అందరూ పాత్రోచితంగా నటించారు.
ఎన్టీఆర్ తనదైన మార్కు నటనతో అలరించారు. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చూపిన చురుకుదనం, సంభాషణలు పలికే తీరు అభిమానులను అలరిస్తాయి. ‘ఐసర మజ్జా’ అనేది ఎన్టీఆర్ ఊత పదం. ఒక పాట లో జయలలితను భుజంపైకి ఎక్కించుకుని నర్తిస్తాడు.ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్.
‘కత్తి వీరుడు’గా పేరున్న కాంతారావు, ఎన్టీఆర్‌కు ధీటుగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ బాగుంటాయి. అన్నదమ్ములుగా ఇద్దరూ సూట్ అయ్యారు. జయలలిత , కృష్ణకుమారి కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో కీలక పాత్రలు పోషించారు. జయలలిత తన అందచందాలతో, కృష్ణకుమారి తన నటనతో మెప్పించారు. డాన్సుల్లో జయలలిత అందరిని డామినేట్ చేశారు.
ప్రతినాయకుడి పాత్రలో సత్యనారాయణ తన గంభీరమైన గొంతు, క్రూరత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా నటించారు. విఠలాచార్య సినిమాల్లో విలన్ పాత్రలకు ఉండే ప్రత్యేకతను ఆయన నిలబెట్టారు. సత్యనారాయణ తండ్రిగా త్యాగరాజు కూడా విలనిజం పండించారు.
ప్రేక్షకులను అలరించేలా .. జానపద కథకు అవసరమైన నాటకీయతను మేళవించి, తనదైన శైలిలో దర్శకుడు బి. విఠలాచార్య తెరకెక్కించారు.టి.వి. రాజు అందించిన సంగీతం సినిమాకు మరో ఆకర్షణ. సందర్భానికి తగినట్టు పాటలు పెట్టారు. అన్ని హిట్ సాంగ్స్ కావడం విశేషం.
ఎన్టీఆర్ గూడేనికి దొర అయ్యే ముందు ప్రత్యర్థి తో జరిగిన పోటీలు,పరీక్షలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి . దారి దొంగ ‘చిక్కడు’ పరివర్తన చెందే సన్నివేశాలు ..జనాలను మోసం చేస్తున్న మంజువాణి ని బంగారు బాతు పేరిట మోసం చేసే సన్నివేశాలు బాగుంటాయి . మంజు వాణిగా విజయలలిత బాగా చేసింది.
ఎన్టీఆర్ జయలలిత పరిచయ దృశ్యాలు .. కాంతారావు,కృష్ణకుమారి పరిచయ దృశ్యాలు ఆకట్టుకుంటాయి. మహారాణి హారం కాజేసే సీన్లు , ఎన్టీఆర్, కాంతారావుల మారు వేషాలు ..ప్రచండుడిని అవమానించే సన్నివేశాలు .. అంతకుముందు నాగిని గా జయ నృత్యం అలరిస్తాయి.వీటూరి సంభాషణలు అందించి కొన్ని పాటలు కూడా రాశారు. సినారే మిగిలిన పాటలు రాశారు.
ఈ చిత్రంలో నాయకా నాయికలుగా నటించిన ఎన్.టి. రామారావు (ఆంధ్రప్రదేశ్) జయలలిత (తమిళనాడు) తర్వాత కాలంలో తమ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా సేవలు అందించారు. ఈ సినిమాను 1977 లో హిందీలో ‘జై వెజయ్’ (Jay Vejay) పేరుతో రీమేక్ చేశారు. అందులో జీతేంద్ర హీరోగా నటించారు. ఎల్వీ ప్రసాద్ స్వీయ దర్శకత్వం లో నిర్మించారు.
అప్పట్లో గ్రాఫిక్స్ లేకపోయినా, విఠలాచార్య తనదైన స్పెషల్ ఎఫెక్ట్స్, ట్రిక్ ఫోటోగ్రఫీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా నిధి వేటలో వచ్చే దృశ్యాలు నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హెచ్ .ఎస్ వేణు కెమెరా పనితనం సినిమాకు ప్లస్ అయింది.
శ్రీలక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి సీతారామస్వామి నిర్మించారు.యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. చూడని వారు చూడవచ్చు. చూసిన వారు మరో సారి చూడవచ్చు.

