God’s Own Country ……
కేరళను God’s Own Country అని పిలుస్తారు. ప్రకృతి సౌందర్యానికి, విభిన్న సంస్కృతులకు కేరళ ప్రసిద్ధి. అనుసంధానించబడిన నదులు, కాలువలు, సరస్సుల్లో హౌస్ బోట్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది.పొడవైన తీరప్రాంత బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మున్నార్ వంటి ప్రదేశాలు, తేయాకు తోటలు, పొగమంచు కొండలకు పేరుగాంచాయి.
కేరళ శాస్త్రీయ నృత్యం..కదలికలు ఆహార్యం అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. మొహినియాట్టం కేరళకు చెందిన మరొక సుందరమైన శాస్త్రీయ నృత్య రూపం. ఓనమ్ వారికి అతిపెద్ద పండుగ. అరటి ఆకులో వడ్డించే సద్య (Sadhya) అనే విందు భోజనం.. వల్లం కలి (బోట్ రేస్) చాలా ప్రత్యేకం.
కేరళను “భారతదేశ సుగంధ ద్రవ్యాల తోట” (Spice Garden of India) అని పిలుస్తారు. మిరియాలు, ఏలకులు, కొబ్బరి, రబ్బరు ఉత్పత్తిలో ఇది అగ్రస్థానంలో ఉన్నది.కేరళ ఆయుర్వేద చికిత్సలకు పుట్టినిల్లు. ఇక్కడ లభించే మసాజ్‌లు, సహజసిద్ధమైన వైద్య విధానాల కోసం విదేశీయులు కూడా వస్తుంటారు.
భారతదేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రం కేరళ.అత్యధిక ఆయుర్దాయం, అత్యల్ప శిశు మరణాల రేటు వంటి ఆరోగ్య సూచీల్లో కేరళ ముందు వరుసలో ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రాష్ట్రం పేరు ‘కేరళం’ గా మారింది.రాష్ట్రపతి ఆమోదమే తరువాయి.
మలయాళ భాషలో రాష్ట్రాన్ని ‘కేరళం’ అని పిలుస్తారు, అయితే భారత రాజ్యాంగం ప్రకారం ఇది ఇప్పటివరకు ‘కేరళ’ అని మాత్రమే ఉంది. ఈ తేడాను తొలగించి, స్థానిక భాషా గుర్తింపును గౌరవించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మలయాళం మాట్లాడే వారందరినీ కలిపి ‘కేరళం’ అని పిలవాలని డిమాండ్ ఉండేది.బ్రిటీష్ వారు తమ ఉచ్చారణ సౌలభ్యం కోసం ‘కేరళం’ అనే పేరును ‘కేరళ’గా మార్చారని, అది అధికారిక రికార్డుల్లో అలాగే ఉండిపోయిందని చరిత్రకారుల అభిప్రాయం.రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న అన్ని భాషల్లో రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
‘కేరళం’ అంటే …….
మలయాళంలో ‘కేర’ (Kera) అంటే కొబ్బరి చెట్టు, ‘ఆలం’ (Alam) అంటే భూమి లేదా ప్రదేశం అని అర్థం. అందుకే కేరళను “కొబ్బరి చెట్ల భూమి” అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ‘చేర’ (Chera) వంశం పేరు మీదగా ‘చేరళం’ అని పిలిచేవారని, కాలక్రమేణా అది ‘కేరళం’గా మారిందని చరిత్రకారులు చెబుతారు. అశోకుడి శాసనాల్లో కూడా ఈ ప్రాంతాన్ని ‘కేరళపుత్ర’ అని ప్రస్తావించారు.
కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు ప్రధాన ప్రతిపక్షాల నుండి మిశ్రమ స్పందన లభించింది. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినప్పటికీ, కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ నిర్ణయంపై స్పందిస్తూ, మలయాళంలో ఇప్పటికే ‘కేరళం’ అని పిలుస్తున్నామని, దీనివల్ల కొత్తగా వచ్చే మార్పు ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కేరళకు రావాల్సిన ప్రాజెక్టులు (ఉదాహరణకు AIIMS) లేదా బడ్జెట్ కేటాయింపులపై శ్రద్ధ చూపకుండా, ఇలాంటి పేర్ల మార్పులకు మాత్రం వెంటనే ఆమోదం తెలుపుతోందని ఆయన విమర్శించారు.
ఇంగ్లీషులో రాష్ట్ర ప్రజలను ఇకపై ఏమని పిలవాలి? ‘కేరళమైట్’ (Keralamite) అంటే ఏదో సూక్ష్మజీవి లాగా, ‘కేరళమియన్’ (Keralamian) అంటే ఏదో అరుదైన ఖనిజం లాగా ఉందని ఆయన చమత్కరించారు.
కేరళ బీజేపీ విభాగం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇది భారతీయ వారసత్వాన్ని, మలయాళ భాషా ప్రాముఖ్యతను గౌరవించడమేనని, ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశీయ మూలాలకు ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కొనియాడారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, తమ రాష్ట్ర పేరును ‘బంగ్లా’గా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్రం పెండింగ్‌లో పెట్టి, కేరళకు మాత్రం ఆమోదం తెలపడాన్ని వివక్షగా అభివర్ణించారు. మొత్తంగా, రాష్ట్ర శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ మార్పును కోరుకున్నాయి కాబట్టి రాజకీయంగా పెద్దగా వ్యతిరేకత లేదు,

